- కర్నూలు జిల్లాలో రోడ్డు ప్రమాదం
- ఇద్దరి దుర్మరణం, మరో ఆరుగురికి గాయాలు
- మృతుల్లో ఒకరు అనంతపురం జిల్లా వాసి
ఓర్వకల్లు: కర్నూలు– చిత్తూరు జాతీయ రహదారిలో ఓర్వకల్లు–హుసేనాపురం మధోయ గుట్టపాడు బస్సు స్టేజీ సమీపంలో శనివారం మధ్యాహ్నం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మరణించగా, ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఆళ్లగడ్డ డిపోకు చెందిన ఆర్టీసీ అద్దె బస్సు కర్నూలు నుంచి నంద్యాల వైపు బయలుదేరింది. రాజమండ్రి నుంచి బళ్లారికి పండ్ల మొక్కలను తరలిస్తున్న అనంతపురం జిల్లాకు చెందిన ఐచర్ వాహనం గుట్టపాడు బస్‌స్టేజీ వద్ద ముందుగా వెళ్తున్న వాహనాన్ని అధిగమించే క్రమంలో ఎదురుగా వచ్చిన ఆర్టీసీ బస్సును ఢీకొంది. ఘటనలో ఐచర్ వాహన డ్రైవర్ నారాయణ(40) అక్కడికక్కడే దుర్మరణం చెందగా, తీవ్రగాయాలైన తూర్పుగోదావరి జిల్లాకు చెందిన సాయి(20)ని ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు.
అదే వాహనంలో ఉన్న మిగతా ఇద్దరు కోడ్రైవర్లు అనంతపురానికి చెందిన రహంతుల్లా, రమేష్(తూర్పు గోదావరి)కు స్వల్ప గాయాలయ్యాయి. ఆర్టీసీ బస్సులో 20 మంది ప్రయాణిస్తుండగా వారిలో డ్రైవర్ వెంకటయ్య, కండక్టర్ వెంకటేశ్వర్లుతో పాటు, బండి ఆత్మకూరు మండలం ఎ.కోడూరుకు చెందిన బావాబామ్మర్దులు వెంకటేశం, వెంకటరమణకు రక్తగాయాలయ్యాయి. క్షతగాత్రులను 108లో కర్నూలు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. సంఘటనతో ఆ మార్గంలో ట్రాఫిక్ స్తంభించిపోయింది. ఎస్‌ఐ మల్లికార్జున, హెడ్ కానిస్టేబుల్ కేశవరెడ్డి తమ సిబ్బందితో కలసి అక్కడికి చేరుకుని ట్రాఫిక్‌ను క్లియర్ చేశారు. ఐచర్ వాహనంలో ఇరుక్కుపోయిన నారాయణ మృతదేహాన్ని యంత్రాల సాయంతో వెలికి తీయించారు. ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.