వీడిన 'బాలికల అదృశ్యం' మిస్టరీ..
Published Tue, Apr 12 2016 8:00 PM | Last Updated on Sat, Aug 25 2018 5:38 PM
ఇల్లెందు (ఖమ్మం జిల్లా) : గుండాలలో అదృశ్యమైన బాలికల మిస్టరీ ఎట్టకేలకు వీడింది. మంగళవారం ఇల్లెందు పోలీస్‌స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీఎస్పీ ఆర్.వీరేశ్వరరావు తెలిపిన వివరాల ప్రకారం... మండలంలోని పోలారం గ్రామానికి చెందిన ఇస్లావత్ కిషోర్ గుండాలలో వరికోత యంత్రం డ్రైవర్‌గా పనిచేశాడు. ఈ క్రమంలో గుండాల గిరిజన బాలికల హాస్టల్‌లో చదువుకుంటున్న రోళ్లగడ్డ తండాకు చెందిన ఓ విద్యార్థిని పరిచయమైంది. ప్రేమపేరుతో శారీరకంగా లోబర్చుకున్నాడు. ఈ క్రమంలోనే అదే తండాకు చెందిన మరో బాలికను కిషోర్ వివాహం చేసుకున్నాడు. దీంతో కిషోర్ మీద కోపంతో ఆ విద్యార్థిని తన స్నేహితురాలిని తీసుకొని గత డిసెంబర్ 16న తేదీన హాస్టల్ నుంచి అదృశ్యమైంది. గుండాల నుంచి ఇల్లెందు మీదుగా మహబూబాబాద్ చేరుకున్నారు.
అక్కడ తన బంధువు భద్రూ తారసపడి ప్రశ్నించగా, పెళ్లికి వెళుతున్నానని చెప్పి రైల్లో సికింద్రాబాద్ చేరుకున్నారు. అక్కడ వీరికి ఇద్దరు మహిళలు పరిచయమయ్యారు. పని కల్పిస్తామని చెప్పి కొత్తగూడెం నెట్ సెంటర్‌కు తరలించారు. అక్కడి నుంచి మరో మహిళ పార్వతి ఇంటికి తరలించారు. అక్కడ ఆ బాలికలను వ్యభిచార ఊబిలోకి దించాలని యత్నించగా వారు నిరాకరించారు. దీంతో నల్లగొండ జిల్లా యాదగిరిగుట్ట సమీపంలోని కందుకూరుకు చెందిన వ్యభిచార గృహ నిర్వాహకుడు యాదగిరికి ఆ ఇద్దరినీ విక్రయించారు. యాదగిరి చెరలో నరకం అనుభవిస్తున్న వీరిలో ఒక విద్యార్థిని తన వద్దకు వచ్చిన కస్టమర్ ఫోన్ నుంచి మహబూబాబాద్ సమీపంలో ఉంటున్న తన సోదరికి ఫోన్ చేసి జరిగిందంతా చెప్పింది.
ఇది గమనించిన యూదగిరి కుటుంబసభ్యులు ఆ బాలికపై దాడి చేశారు. దీంతో ఎలాగైనా వ్యభిచార కూపం నుంచి బయటపడాలని నిర్ణయించుకుంది. యాదగిరికి విషయాన్ని వివరించింది. ఇంటికి వెళ్లాలని నిర్ణయించుకున్న ఆ విద్యార్థిని పరిస్థితిని గమనించి యాదగిరి చేతి ఖర్చుకు డబ్బులు ఇచ్చి రైలు ఎక్కించాడు. మహబూబాబాద్ చేరుకున్న ఆ విద్యార్థిని సోదరి సాయంతో గుండాల సీఐ రవిని ఆశ్రయించింది. ఆమె ఇచ్చిన సమాచారం ఆధారంగా సీఐ రవి, యాదగిరిగుట్ట సమీపంలోని కందుకూరుకు వెళ్లి యూదగిరి చెరలో ఉన్న ఆ విద్యార్థినిని విడిపించి, అతన్ని అదుపులోకి తీసుకుని విచారించారు. ఆపై విద్యార్థినిని మోసగించిన డ్రైవర్ కిషోర్, వ్యబిఛార గృహ నిర్వాహకుడు యాదగిరిపై కేసులు నమోదు చేసి కోర్టులో హాజరుపరిచారు.
Advertisement