♦ ఎన్యూమరేటర్లకు సహకరించండి
♦ నగర ప్రజలకు జీహెచ్‌ఎంసీ కమిషనర్ విజ్ఞప్తి
సాక్షి, హైదరాబాద్ : భారత పౌరుల జాతీయ రిజిస్టరు తయారీలో మొదటి అంకమైన నేషనల్ పాపులేషన్ రిజిస్టర్(ఎన్‌పీఆర్)కోసం జరుగుతున్న ఇంటింటి సర్వేలో సిబ్బందికి తగిన విధంగా సహకరించాల్సిందిగా జీహెచ్‌ఎంసీ కమిషనర్ డా.బి.జనార్దన్‌రెడ్డి నగర ప్రజలకు విజ్ఞప్తి చేశారు. సర్వేలో భాగంగా ఎన్యూమరేటర్లు కోరే వ్యక్తుల పేర్లు, తల్లిదండ్రుల పేర్లు, పుట్టిన స్థలం, ప్రస్తుత చిరునామా, విద్యార్హతలు, వృత్తి, జాతీయత, చిరునామా తదితర వివరాలు అందజేయాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. ఈ నెలాఖరు వరకు ఈ సర్వే జరుగనుంది.
19.71 లక్షల ఓటర్ల పునః పరిశీలన..
ఓటర్ల తుది జాబితా మే 31న విడుదల చేయనున్నందున స్పెషల్ సప్లిమెంటరీ రివిజన్ కింద ఓటర్ల జాబితాకు సంబంధించి ఇంటింటి సర్వే జరుగుతోంది. ఈ సర్వేలో భాగంగా చిరునామా మారినవారు, మరణించిన వారు, డూప్లికేట్లను జాబితాలోంచి తొలగిస్తారు. మే 15 వరకు మార్పుచేర్పులతో కూడిన తుది జాబితాను రూపొందించి, 31వ తేదీన వెలువరిస్తారు. గతంలో జాబితాలోంచి తొలగించిన 19.71 లక్షలమంది ఓటర్లకు సంబంధించిన వివరాలను పునః పరిశీలిస్తారు. మృతులు, చిరునామా మారిన వారు, అనర్హులు తదితరులను గుర్తిస్తారు. అర్హులుంటే జాబితాలో చేరుస్తారు. ఇందుకుగాను బూత్‌లెవెల్ ఆఫీసర్లు ఇంటింటి సర్వేలో పాల్గొంటున్నారు. అనర్హులను తొలగించేందుకు ఏప్రిల్ 16 నుంచి 22 వరకు నోటీసులు జారీ చేస్తారు.
మే 10లోగా ఫిర్యాదులు స్వీకరిస్తారు. మార్పులు, చేర్పులు, జాబితాలో పేరు స్పెల్లింగ్‌లలో పొరపాట్లు తదితరమైన వాటికి సంబంధించి అందిన దరఖాస్తులను పరిష్కరిస్తారు. 15వ తేదీలోగా అనర్హులను, చిరునామా మారినవారి పేర్లు తొలగిస్తారు. 18న అనుబంధ జాబితా రూపొందిస్తారు. 20 తేదీన జాబితాను ప్రచురిస్తారు. 21 వ తేదీనాటికి ఎన్నికల ప్రధానాధికారికి పంపిస్తారు. 23వ తేదీ నాటికి కేంద్ర ఎన్నికల సంఘానికి పంపిస్తారు. మే 31న ఓటర్ల తుది జాబితాను వెలువరిస్తారు. ఈ సందర్భంగా ఇళ్లకు వచ్చే బూత్‌లెవెల్ అధికారులకు సహకరించాల్సిందిగా హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్‌ఎంసీ కమిషనర్ డా.బి.జనార్దన్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు. జాబితా లో పొరపాట్లు ఉంటే సవరించుకోవాలని, అర్హులైన వారు జాబితాలో పేర్లు లేకుంటే నమోదు చేయించుకోవాలని, చిరునామా మార్పులు, ఫొటోలు, పేర్లలో పొరపాట్లు దొర్లినా సవరించుకోవచ్చునని సూచించారు.