
గడుగ్గాయి
♦ రెండేళ్ల వయసులోనే అపార జ్ఞాపకశక్తి
♦ భక్త రామదాసు పది కీర్తనలు ఆలపిస్తూ..
♦ రాష్ట్రాల రాజధానుల పేర్లు ఇట్టే చెబుతూ..
♦ ఆకట్టుకుంటున్న చిన్నారి సౌమిత్ర ప్రశస్తి
భద్రాచలం : ‘పిట్ట కొంచెం.. కూత ఘనం’ అనే సామెతకు ఆ చిన్నారి కరెక్టుగా సరిపోతుంది. రెండేళ్ల రెండునెలల వయసులోనే రాష్ట్రాలు- రాజధానుల పేర్లు గుక్కతిప్పుకోకుండా చెప్పేస్తోంది. బుడిబుడి అడుగులు వేస్తూనే తన అపార జ్ఞాపకశక్తితో అందర్నీ ఆశ్చర్యచకితులను చేస్తోంది. భద్రాచలంలోని మెడికల్ కాలనీకి చెందిన గట్టు వెంకటాచార్య మనువరాలు సౌమిత్ర ప్రశస్తి దేశంలోని 25 రాష్ట్రాల పేర్లను చకచకా చెప్పేస్తోంది. ‘ముద్దుగారే యశోద..’ అంటూ కూనిరాగాలు కూడా తీస్తూ అందర్నీ ఆకట్టుకుంటోంది. భక్తరామదాసు శ్రీ సీతారాములవారిపై భక్తిభావంతో రాసిన పది కీర్తనలనూ రాగయుక్తంగా ఆలపిస్తుంది.
పరిశ్రమలశాఖలో ‘ఇండస్ట్రియల్ ప్రమోషన్ ఆఫీసర్’గా పనిచేస్తున్న ప్రశస్తి తల్లి శ్రీహరిణి.. పాపకు స్నానం పోయించేటప్పుడు లాలిపాటలు పాడుతుంది. వాటిని కూడా ఈ చిన్నారి ఇట్టే పట్టేసి ఆలపిస్తోంది. అన్నం తినిపించేటప్పుడు పాడిన శ్రీరామనామ కీర్తనలు, వాకింగ్ సమయంలో చెప్పిన రాష్ట్రాలు- రాజధానులు అన్నీ తన అపార జ్ఞాపకశక్తితో గుర్తు పెట్టుకొని చెబుతుంది. ముఖ్యమంత్రులు, ఇతర ప్రముఖుల పేర్లు కూడా ప్రశస్తి దగ్గర ఓ నాలుగైదు సార్లు చెబితే చాలు... ఇట్టే వాటిని గుర్తుపెట్టుకొని ఎప్పుడు అడిగినా.. ఠక్కున సమాధానం ఇస్తుందని తల్లి శ్రీహరిణి తెలిపింది. చిన్నారి మేధా సంపత్తిని పలువురు అభినందిస్తున్నారు. గట్టువారి ఇంట గడ్డుగ్గాయి పుట్టిందని ప్రశంసిస్తున్నారు.