
గోదారమ్మ మింగేసింది
వినాయక నిమజ్జనం.. విషాదాన్నిమిగిల్చింది. పర్ణశాల వద్ద గోదావరిలో మంగళవారం ఉదయం ఇద్దరు యువకులు గల్లంతయ్యారు. గాలింపు కొనసాగుతోంది.
♦ పర్ణశాల వద్ద గోదావరిలో ఇద్దరు యువకుల గల్లంతు
♦ కొనసాగుతున్న గాలింపు
పర్ణశాల(భద్రాచలం)/జూలూరుపాడు(వైరా):
వినాయక నిమజ్జనం.. విషాదాన్నిమిగిల్చింది. పర్ణశాల వద్ద గోదావరిలో మంగళవారం ఉదయం ఇద్దరు యువకులు గల్లంతయ్యారు. గాలింపు కొనసాగుతోంది.
ఎలా జరిగింది?
జూలురుపాడు మండలం పడమటి నర్సాపురం గ్రామస్తులు దాదాపుగా 40మంది కలిసి వినాయకుక విగ్రహంతో భద్రాచలం వద్ద గోదావరి వద్దకు సోమవారం సాయంత్రం వెళ్లారు. విగ్రహాన్ని నిమజ్జనం చేశారు. ఆ తరువాత అందరూ కలిసి పర్ణశాల చేరుకున్నారు. ఆ రాత్రి అక్కడే బస చేశారు. ఉదయం స్నానాలు చేసేందుకు గోదావరి అవతలి ఒడ్డుకు బోటుపై వెళ్లారు. అక్కడ స్నానాలు చేస్తుండగా పాపిని శ్రీకాంత్(22) లోతుకు వెళ్లాడు. అతడికి ఈత రాదు. నీట మునిగిపోతూ భయంతో గట్టిగా అరవసాగాడు. అతడిని కాపాడేందుకని దుర్గారావు అనే యువకుడు వెళ్లాడు. ఇంతలో.. శ్రీకాంత్‌ను కాపాడుదామన్న ఆతృతతో బోగి వినయ్‌కృష్ణ(22) కూడా నీటిలోకి వెళ్లాడు. తనకు ఈత రాదన్న విషయాన్ని ఆ క్షణాన అతడు మరిచిపోయినట్టున్నాడు.
వినయ్‌కృష్ణ కూడా నీట మునిగిపోతున్నాడు. వీరిద్దరినీ కాపాడేందుకు దుర్గారావు శాయశక్తులా ప్రయత్నించాడు. ఒక్కడికి సాధ్యపడలేదు. అప్పటికే గోదావరి ఉధృతంగా ప్రవహిస్తోంది. ఆ ఇద్దరూ నీట మునిగిపోయారు. దుర్గారావు నిరాశగా వెనుదిరిగాడు. శ్రీకాంత్, వినయ్‌కృష్ణ.. వరసకు అన్నదమ్ములు. ఒడ్డున ఉన్న కుటుంబీకులు, బంధువులు, మిత్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ఈ ప్రదేశాన్ని భద్రాచలం ఆర్డీవో శివనారాయణ రెడ్డి, ఎస్‌ఐ బాలకృష్ణ పరిశీలించారు. గల్లంతైన ఆ ఇద్దరి కోసం గజ ఈతగాళ్లు మంగళవారం సాయంత్రం వరకు గాలిస్తూనే ఉన్నారు.
పడమట నర్సాపురంలో విషాదం
గల్లంతైన ఈ ఇద్దరు యువకులది జూలూరుపాడు మండలం పడమటనర్సాపురం కాలనీ. వీరిద్దరూ తాపీ మేస్త్రీలు. వినాయక ఉత్సవ కమిటీలోని 14 మంది సభ్యుల్లో వీరిద్దరు కూడా ఉన్నారు. వినయ్‌కృష్ణతోపాటు, అతని భార్య మౌనిక, సోదరి ఉమామణి కూడా వెళ్లారు.కుటుంబీకులు, బంధువులు, గ్రామస్తులు మరో 25మందికి పైగా ఉన్నారు. భద్రాచలంలో నిమజ్జనం అనంతరం పర్ణశాల వెళ్లారు. అక్కడ ఈ దుర్ఘటన జరిగింది. వినయ్‌కృష్ణ, శ్రీకాంత్ వరుసకు సోదరులే కాదు.. మంచి మిత్రులు కూడా. ఏ కార్యానికైనా వీరిద్దరి కుటుంబీకులు, బంధువులు, మిత్రులు కలిసే వెళ్లొస్తుంటారు. ఈ ఇద్దరు గల్లంతవడంతో పడమట నర్సాపురం కాలనీలో విషాదం అలుముకుంది.
కుటుంబ నేపథ్యం..
బోగి వినయ్‌కృష్ణ: తల్లిదండ్రులు వెంకటేశ్వర్లు, కళావతి దంపతులకు ఇద్దరు సంతా నం... వినయ్‌కృష్ణ, ఉమారాణి. ఇద్దరూ వివాహితులే. ఒక్కడే కొడుకవడంతో చిన్నప్పటి నుంచి విడిచి పెట్టి ఉండేవారు కాదు. ఏడాదిన్నర క్రితం కాకర్ల గ్రామానికి చెందిన మౌనికతో వినయ్‌కృష్ణకు వివాహమైంది. వినయ్‌కృష్ణ, భార్య మౌని క, తల్లిదండ్రులు వెంకటేశ్వర్లు, కళావతి కలిసి ఒకే ఇంటిలో ఉంటున్నారు. కొడుకు గోదావరిలో గల్లంతైన విషయాన్ని ఇంటి వద్దనే ఉన్న ఆ తల్లిదండ్రులకు బంధువులు రాత్రి వరకు తెలియనివ్వలేదు.
పాపిన్ని శ్రీకాంత్: శంకర్, నాగమణి దంపతులకు ఇద్దరు సంతానం... లక్ష్మీనారాయణ, శ్రీకాంత్. అవివాహితుడైన శ్రీకాంత్, సుతారి మేస్త్రీ పనితో కుటుంబానికి ఆసరాగా ఉంటున్నాడు. కొడుకు గల్లంతయ్యాడన్న వార్తతో తల్లిదండ్రులు శంకర్, నాగమణి గుండెలవిసేలా రోదిస్తూ, తట్టుకోలేక కిందపడి బొర్లారు. కొద్ది క్షణాల్లోనే స్పృహ కోల్పోయారు.
క్షణాల్లో జరిగిపోయింది..
‘‘మాలో కొందరు ఇప్పటివరకూ పర్ణశాల చూడలేదు. చూద్దామనుకున్నాం. అందరం కలిసి వచ్చాం. స్నానాలు చేయడానికి అవతలి ఒడ్డు బాగుంటుందని వెళ్లాం. ఆడవారు ఒకవైపు, మగవారు మరోవైపు స్నానాలు చేస్తున్నారు. ఇంతలో అరుపులు వినిపించాయి. ఏం జరిగిందోనని భయంతో వెళ్లాం. అప్పటికే నీటి ప్రవాహంలో శ్రీకాంత్, వినయ్‌కృష్ణ కొట్టుకుపోయారు. ఇదంతా క్షణాల్లో జరిగిపోయింది’’ అని చెప్పింది బోడ వరలక్ష్మి. గల్లంతైన శ్రీకాంత్, వినయ్‌కృష్ణకు ఈమె బంధువు.
ఈ పాపం ఎవరిది..?
పర్ణశాల(భద్రాచలం): గోదావరిలో ఇద్దరు యువకుల గల్లంతు పాపం ఎవరిది? నిబంధనలను గాలికొదిలేసిన బోటు షికారు యజమానులది. దీనిని పట్టించుకోని అధికారులది. గోదావరిలో ఫెర్‌ర్రీ వేలం పాటను కొన్ని నియమ నిబంధనలతో పంచాయతీ నిర్వహిస్తోంది. అన్ని బోట్లకు లైసెన్స్ ఉండాలని, పరిమితికి మించి ఎక్కించవద్దని, బోటులోని అందరికీ సేఫ్టీ జాకెట్ ఇవ్వాలని నిబంధనలు ఉన్నాయి. బోటు షికారు ఎప్పుడెప్పుడు.. ఎంత దూరం చేయాలి? ఇవేవీ బోటు యజమానులు పట్టించుకోవడం లేదు. పర్ణశాలలోని బోట్ యజమానులు పరిమితికి మించిన సంఖ్యలో పర్యాటకులను ఎక్కించుకుంటున్నారు. సేఫ్టీ జాకెట్లు ఇవ్వడం లేదు. తమ వ్యాపారం కోసం ‘‘స్నానాలు చేయడానికి అవతల ఒడ్డు చాలా బాగుంటుంది’’ అని పర్యాటకులను మభ్యపెడుతున్నారు. అక్కడ ప్రమాద హెచ్చరిక బోర్డులేవీ లేకపోవడం, జాగ్రత్తలు చెప్పేవారు లేకపోవడంతో పర్యాటకులకు ప్రాణాపాయం ఏర్పడుతోంది.