ఈ ఇద్దరు నేతలు కలిసిన వేళ
►కాంగ్రెస్ త్రిమూర్తుల కలయికపై రాజకీయ వర్గాల్లో చర్చ
►కోమటిరెడ్డి ఇంటికి ఉత్తమ్ వెళ్లడం వెనుక ఆంతర్యమేమిటో?
►పెద్దాయన జానా సమక్షంలో ఇద్దరు నేతల ఐక్యతా రాగం దేనికి సంకేతమో?
►నిరాశతో ఉన్న పార్టీ కార్యకర్తల్లో ధైర్యం నింపేందుకా?
►అందరం కలిసి అధికారంలోకి వస్తామన్న వ్యాఖ్యలతో భేటీకి ప్రాధాన్యత
►ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని హస్తం శ్రేణుల్లో కొత్త ఉత్సాహం
పెద్దనోట్ల రద్దుపై కాంగ్రెస్‌నేత ఆర్డీఆర్ దీక్ష
మద్దతుగా వచ్చిన ఏఐసీసీ, టీపీసీసీ నేతలు
భారీగా హాజరైన కార్యకర్తలు
సాక్షి, నల్లగొండ : జిల్లా కాంగ్రెస్ నేతలు పెద్ద ’ముచ్చట’కే తెరలేపారు. ఎప్పటికీ జరగదేమో.. ఈ నాయకులు ఇంతేనేమో అనే సందేహంలో ఉన్న తమ పార్టీ శ్రేణులకు ఆత్మీయ కలయికతో ఓ తీపి కబురు పంపా రు. జిల్లా రాజకీయ లెజెండ్, పెక్కు శాఖల మంత్రిగా పేరుగాంచిన కాంగ్రెస్ దిగ్గజం కుందూరు జానారెడ్డి సమక్షంలో పీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, సీఎల్పీ ఉపనేత, మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆసక్తికర సన్నివేశానికి తెరలేపారు. ఇటు జిల్లా, అటు రాష్ట్ర రాజకీయాల్లో ఉప్పు, నిప్పుగా ఉండే ఉత్తమ్, కోమటిరెడ్డిలు ఒకే వాహనం లో వెళ్లి, ఒకే చోట విలేకరుల సమావేశం పెట్టి, కలిసి భోజనం చేసి ఏకం అయ్యామనే సంకేతాలను కాంగ్రెస్ శ్రేణులకు పంపారు. ఇటీవలి రాజకీయ పరిణామాల్లో అత్యంత ప్రాధాన్యత సంతరించుకున్న ఈ ఘటన ఇప్పుడు జిల్లా రాజకీయ వర్గాల్లో హాట్‌టాపిక్‌గా మారింది. అసలు ఈ ఇద్దరు నేతల ఆకస్మిక భేటీ వెనుక ఆంతర్యమేమిటనే దానిపై చర్చోపచర్చలు జరుగుతున్నాయి. దీనికి తోడు ఈ మధ్య కాలంలో కాంగ్రెస్ నేతలంతా ఒకే తాటిపై ఉండడం, అసెంబ్లీ శీతాకాల సమావేశాల్లో కలిసికట్టుగా టీఆర్‌ఎస్ ప్రభుత్వంపై పోరాడడం, ప్రజల పక్షాన పలు ఆందోళనలకు శ్రీకారం చుడుతుండడం ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపుతోంది.
జెడ్పీ టు కోమటిరెడ్డి నివాసం
జిల్లాల విభజన తర్వాత తొలిసారి జరుగుతున్న జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం హడావుడిలో అటు రాజకీయ నాయకులు, ఇటు అధికారులు, విలేకరులు బిజీగా ఉన్న సమయంలోనే కాంగ్రెస్ నాయకులు హల్‌చల్ చేశారు. జిల్లా పరిషత్ సమావేశాన్నే వేదికగా చేసుకుని ఐక్యతారాగం వినిపించి అందరినీ ఆశ్చర్యచకితులను చేశారు. జెడ్పీ సమావేశంలో పాల్గొనేందుకు వచ్చిన ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అక్కడినుంచి జానారెడ్డితో కలిసి తనకు పార్టీలో ప్రత్యర్థి అయిన నల్లగొండ ఎమ్మెల్యే కోమటిరెడ్డి ఇంటికి వెళ్లారు. ముగ్గురు నేతలు కలిసి ఒకే వాహనంలో నల్లగొండలో ప్రయాణించి కోమటిరెడ్డి ఇంటికి వెళ్లి అక్కడే విలేకరులతో మాట్లాడారు. ఆ తర్వాత ఎంచక్కా నాటుకోడి, మటన్, బిర్యానీతో భోజనం చేశారు. రాజకీయాల్లో ఏదైనా సాధ్యమే అనే నానుడిని వాస్తవం చేస్తూ ఉప్పు, నిప్పులా ఉండే ఇద్దరు కలిసి ఫొటోలకు పోజులివ్వడం చర్చనీయాంశమయింది. జిల్లా కాంగ్రెస్ రాజకీయాల్లో ప్రత్యర్థులుగా గుర్తింపు పొందిన ఉత్తమ్, కోమటిరెడ్డిలిద్దరూ కలిసిపోయారా అనే రీతిలో జరిగిన ఈ ఘటన ఇప్పుడు హాట్‌టాపిక్‌గా మారింది. అసలు ఈ ఇద్దరు ఎందుకు కలిశారు? ఈ కలయిక వెనుక ఆంతర్యమేమిటి? అనే చర్చ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో ఆసక్తిని కలిగిస్తోంది.
ఎందుకో... ఏమిటో?
ఈ ఇద్దరు నేతల కలయిక, జానా సమక్షంలో మంతనాల వెనుక ఆంతర్యమేమిటనే దానిపై పలు రకాల చర్చలు జరుగుతున్నాయి. వీరి మధ్య సఖ్యతను కుదర్చడంలో ఇటు జానాతో పాటు టీపీసీసీ నేతలు సఫలం అయ్యారనే మాట లు వినిపిస్తున్నాయి. పీసీసీ అధ్యక్షుడిగా ఉత్తమ్ నియామకాన్ని వ్యతిరేకించి ఆయన నాయకత్వంలోనే పనిచేయనని, గాంధీభవన్‌కు వెళ్లనని చెప్పిన కోమటిరెడ్డి ఇటీవల గాంధీభవన్‌కు వెళ్లి టీపీసీసీ నేతలతో కలిసి విలేకరుల సమావేశంలో పాల్గొన్నప్పుడే ఈ కలయికకు బీజం పడిందని, అంతకు ముందు శీతాకాల అసెంబ్లీ సమావేశాల సందర్భంగా పునాది పడిందని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. అసెంబ్లీలో టీఆర్‌ఎస్ ప్రభుత్వంపై పోరాడే సందర్భంలో కలిసిన మాటలు ఉత్తమ్, కోమటిరెడ్డిలను దగ్గరకు చేర్చాయని వారంటున్నారు. దీనికి తోడు తెలంగాణ ఇచ్చినా అధికారం రాక నిరాశతో ఉన్న పార్టీ శ్రేణుల్లో తామంటే ఒకటేననే ధైర్యాన్ని నింపడం కోసమే ఇద్దరు నేతలు ’రాజీ’ పడ్డారని తెలుస్తోంది. పార్టీలో అంతర్గత విభేదాలతో నష్టపోయిన దాని కన్నా కలిసిపోయి కేడర్‌కు ధైర్యం చెప్పాలనే ఆలోచనతోనే ఇది జరిగిందని కాంగ్రెస్ శ్రేణులంటున్నాయి.
అధికారం తెస్తాం.. వస్తాం
ఈ ఇద్దరు నేతలు కలిసిన వేళ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే అంశంపై కూడా చర్చకు తెరలేచింది. జానా, ఉత్తమ్, కోమటిరెడ్డిలు నల్లగొండలో విలేకరుల సమావేశంలో ఏర్పాటు చేసిన సందర్భంగా అందరం కలిసి పనిచేస్తామని, అసెంబ్లీలో, బయటా కలిసి పోరాటాలు చేస్తామని, 2019లో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తెచ్చి తెలంగాణ ఇచ్చిన సోనియాకు బహుమతిగా ఇస్తామని వ్యాఖ్యానించడం రాజకీయ ప్రాధాన్యత సంతరించుకుంది. నల్లగొండ నుంచి సూర్యాపేటకు వెళ్లిన ఉత్తమ్, జానాలు కూడా ఇవే వ్యాఖ్యలు చేశారు. 2019లో 85 అసెంబ్లీ స్థానాలు గెలిచి కాంగ్రెస్‌ను అధికారంలోనికి తీసుకువస్తామని చెప్పారు. అకస్మాత్తుగా ఇద్దరు నేతలు కలిసిపోవడం, అదే వేళ అధికారంలోకి వస్తామనే ధీమా మాటలు వినిపించడం కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపుతోంది. ఇక, పెద్ద నోట్ల రద్దుకు వ్యతిరేకంగా సూర్యాపేటలో నిర్వహించిన సభకు ఏఐసీసీ, టీపీసీసీ నేతలతో పాటు పెద్ద ఎత్తున ప్రజలు కూడా హాజరు కావడం నూతనోత్సాహాన్ని నింపింది. ఇటీవలి కాలంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రజల పక్షాన కార్యక్రమాలు నిర్వహిస్తుండడం, అసెంబ్లీలో, బయటా పోరుబాట పట్టడం, ఇప్పుడు నేతలంతా కలిసే ఉన్నామనే సంకేతాలివ్వడం జిల్లా కాంగ్రెస్ శ్రేణుల్లో ధైర్యం నింపుతాయనడంలో ఎలాంటి సందేహం లేదని రాజకీయ విశ్లేషకులంటున్నారు. అయితే, ఈ ఐక్యతారాగం, పోరాట పటిమ ఎన్నాళ్లు కొనసాగుతాయనేదే అనుమానమని, ఈ బంధం ధృడమైతే మళ్లీ ఉమ్మడి జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి జవసత్వాలు వస్తాయని వారంటున్నారు. అయితే, అంతర్గత ప్రజాస్వామ్యం పాళ్లు ఎక్కువగా ఉండే కాంగ్రెస్ పార్టీలో ఏం జరుగుతుందో ఏమో? వేచిచూడాల్సిందే.