తెలుగు తమ్ముళ్ల వసూళ్ల దందా
తెలుగు తమ్ముళ్ల వసూళ్ల దందా
Published Wed, Nov 9 2016 10:48 PM | Last Updated on Fri, Aug 10 2018 8:23 PM
- చెక్‌పోస్టు వద్ద అనధికారిక అంగళ్లు
- ప్రైవేటు కంప్యూటర్ ఆపరేటర్లతో నిర్వహణ
- వారు చెప్పిందే రేటు!
- దోపిడీకి గురువుతున్న వాహనదారులు
కర్నూలు(హాస్పిటల్): సాధారణంగా ఒక పేపర్ జిరాక్స్ తీయించుకోవాలంటే రూ.1 నుంచి రూ.2లు తీసుకుంటారు. కానీ అక్కడ మాత్రం రూ.10లు వసూలు చేస్తారు. నెట్ సెంటర్లలో నాలుగు పేపర్లున్న పత్రాలను డౌన్‌లోడ్ చేయాలంటే రూ.10ల నుంచి రూ.15లు తీసుకుంటారు. అక్కడ మాత్రం రూ.50లు ఇవ్వాల్సిందే. ఇదేదో కాకులు దూరని కారడవి కాదు..నీళ్లు దొరకని ఎడారి ప్రాంతమూ కాదు. కర్నూలు నగర శివారులోని పంచలింగాల గ్రామంలోని వాణిజ్యపన్నుల శాఖ తనిఖీ కేంద్రం వద్ద ప్రైవేటు ఆపరేటర్లు కొనసాగిస్తున్న దందా. అధికార పార్టీ నాయకుల సహకారంతో ఈ దందా యథేచ్ఛగా కొనసాగుతోంది.
తెలంగాణా రాష్ట్రం నుంచి వచ్చే ప్రతి వాహనమూ స్థానిక పంచలింగాల చెక్‌పోస్టు వద్ద వాణిజ్యపన్నుల శాఖ అధికారులచే తనిఖీ చేయించుకుని వెళ్లాలి. ప్రతిరోజూ ఇక్కడ 1400 నుంచి 1600 వరకు వాహనాలు తనిఖీ చేయించుకుని వెళ్తాయి. ప్రతి ఒక్కరూ కంప్యూటర్ ఆపరేటర్ వద్దకు వెళ్లి ట్రాన్సిస్ట్ పాస్‌ను ఆన్‌లైన్లో డౌన్‌లోడ్ చేయించుకుని వెళ్లాలి. ఈ పనిని వాణిజ్యశాఖ అధికారులే చేయించాలి. కానీ ఆ పని తమకు భారం అవుతుందని చెప్పి ప్రైవేటు ఆపరేటర్లకు ఆహ్వానం పలికి దందాకు తెరతీశారు. అధికారుల కనుసన్నల్లో ఈ చెక్‌పోస్టు వద్ద 20కి పైగా ప్రైవేటు కంప్యూటర్ ఆపరేటర్లు ప్రత్యక్షమయ్యారు. ఒక గొడుగు, దాని కింద కంప్యూటర్, ప్రింటర్/జిరాక్స్ మిషన్ ఏర్పాటు చేసుకుని కూర్చుంటారు. ఒక్కొక్కరు రోజుకు 50 నుంచి 80 దాకా ట్రాన్సిస్ట్ పాస్‌లను ఆన్‌లైన్ ద్వారా డౌన్‌లోడ్ చేసి ఇస్తుంటారు. ఇలా నాలుగు పేజీల ఒక పాస్ డౌన్‌లోడ్ చేసి ఇవ్వడానికి రూ.50లు వసూలు చేస్తారు. అంతేకాదు ఒక పేజిని జిరాక్స్ చేసి ఇవ్వడానికి రూ.10లు ఛార్జి చేస్తున్నారు. ఈ లెక్కన ఒక్కో ఆపరేటర్ రోజుకు రూ.3వేల నుంచి రూ.4వేల దాకా ఆర్జిస్తున్నట్లు సమాచారం.
తెలుగు తమ్ముళ్లదే హవా
తెలుగుదేశం అధికారంలోకి వచ్చాక వాణిజ్యపన్నుల శాఖకు ప్రతి నెలా లక్ష్యాలు విధించారు. తెలంగాణా రాష్ట్ర నుంచి వచ్చే ప్రతి వాహనాన్ని కచ్చితంగా తనిఖీ చేసి పంపించాలి. ఈ మేరకు ప్రతి ఒక్క వాహనమూ ట్రాన్సిస్ట్ పాస్ చూపించాలి. ఇక్కడే కొంతమంది తెలుగు తమ్ముళ్ల కన్ను పడింది. వెంటనే రహదారి పక్కన గుడిసెలు, బంకులు వేయించారు. ఒక్కో గుడిసె, బంకులను నెలకు రూ.5వేల చొప్పున అద్దె వసూలు చేస్తున్నారు. ఇలా అద్దెలు తీసుకున్న వారు కంప్యూటర్ ఆపరేటర్‌లను నియమించుకున్నారు. ఆ గుడిసె, బంకుల ఎదురుగా రహదారిపై చిన్న గొడుగు ఏర్పాటు చేసి, దాని కింద కంప్యూటర్, ప్రింటర్‌ను ఉంచి దందా చేయిస్తున్నారు. వాణిజ్యపన్నుల శాఖ తనిఖీ కేంద్రం వద్ద 20కి పైగా ఆపరేటర్లు 24 గంటలూ పనిచేస్తారు. ఎండా, వాన, చలిని లెక్క చేయకుండా కంప్యూటర్ ఆపరేటర్లు నెల, రోజు చొప్పున జీతానికి ఇక్కడ పనిచేస్తూ జీవనం సాగిస్తున్నారు. కానీ వీటిని ఏర్పాటు చేసి టీడీపీ నాయకులు మాత్రం నెలకు ఎలాంటి పని చేయకుండానే రూ.లక్ష వరకు సంపాదిస్తున్నారు. ప్రైవేటు ఆపరేటర్ల చేస్తున్న దందాను అధికారులు చూసీ చూడనట్లు వదిలేస్తుండటం విమర్శలకు తావిస్తోంది.
Advertisement
Advertisement