
ముద్రగడను హౌస్ అరెస్ట్ చేస్తారా?
తూర్పుగోదావరి జిల్లాలో పోలీసులు ఆంక్షలు విధించడాన్ని మాజీ మంత్రి వట్టి వసంతకుమార్ తప్పుబట్టారు.
కాకినాడ: ముద్రగడ పద్మనాభం ఆమరణ నిరాహారదీక్ష నేపథ్యంలో తూర్పుగోదావరి జిల్లాలో పోలీసులు ఆంక్షలు విధించడాన్ని మాజీ మంత్రి వట్టి వసంతకుమార్ తప్పుబట్టారు. పోలీసుల తీరుపై అసనహనం వ్యక్తం చేశారు. శుక్రవారం ఆయన 'సాక్షి'తో మాట్లాడుతూ.. ముద్రగడకు సంఘీభావం తెలిపేందుకు వస్తున్న కాపు నాయకులను అడ్డుకోవడం సరికాదని అన్నారు. కిర్లంపూడిలో ముద్రగడ ఇంటి చుట్టూ భారీగా పోలీసులను మొహరించడం చూస్తుంటే ఆయనను హౌస్ అరెస్ట్ చేస్తారేమోనన్న అనుమానం కలుగుతోందన్నారు. దీనిపై పోలీసులు వివరణ ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు.
బయటి ప్రాంతాల నుంచి ఎవరూ తూర్పు గోదావరి జిల్లాకు రావద్దని పోలీసులు నిషేధాజ్ఞలు విధించారు. ముద్రగడ దంపతుల ఆమరణదీక్ష నేపథ్యంలో తూర్పు గోదావరి జిల్లాలో కర్ఫ్యూ వాతావరణం నెలకొంది. జిల్లా అంతటా పోలీసు బలగాలను మోహరించారు. జిల్లా కేంద్రం కాకినాడ సహా కిర్లంపూడి, జగ్గంపేట, పిఠాపురం, తుని, అమలాపురం తదితర ప్రాంతాల్లో భారీ సంఖ్యలో బలగాలను దించారు.