'నాటి పాట హృదయాన్ని తట్టిలేపేది. నేటి పాట శరీరాన్ని పట్టి ఊపుతోంది. యువతరం అభిరుచుల్లో మార్పు వచ్చినప్పుడే మంచి సినిమా పాటలు వస్తాయ’ని ప్రముఖ సినీ గేయ రచయిత వెనిగళ్ళ రాంబాబు అన్నారు.
‘సాక్షి’తో సినీగేయ రచయిత వెనిగళ్ళ రాంబాబు
రాజమహేంద్రవరం :‘నాటి పాట హృదయాన్ని తట్టిలేపేది. నేటి పాట శరీరాన్ని పట్టి ఊపుతోంది. యువతరం అభిరుచుల్లో మార్పు వచ్చినప్పుడే మంచి సినిమా పాటలు వస్తాయ’ని ప్రముఖ సినీ గేయ రచయిత వెనిగళ్ళ రాంబాబు అన్నారు. ఆంధ్రకేసరి యువజన సమితి, తెలుగు వెలుగు సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో యువచైతన్య పురస్కారం అందుకోవడానికి వచ్చిన సందర్భంగా ఆయన ‘సాక్షి’తో తన సినీ గేయ ప్రస్థానాన్ని ఇలా వివరించారు.
‘‘మాది గుంటూరు జిల్లా రేపల్లె. ఎంఏ తెలుగు, ఎంఏ సంస్కృతం, ఎమ్మెస్సీ చదివాను. డి.రామానాయుడి ‘ప్రేయసి రావే’ సినిమాలో తొలిసారిగా ‘తెంచుకుంటే తెగి పోతుందా దేవుడు చేసిన బంధం’ అనే పాట రాశాను. ‘మీ శ్రేయోభిలాషి’ సినిమా కోసం ‘చిరునవ్వులతో బతకాలి.. చిరంజీవిగా బతకాలి’ తదితర పాటలను ప్రేక్షకులు బాగా రిసీవ్ చేసుకున్నారు. ఇప్పటివరకూ సుమారు 60 సినిమాలకు వందకు పైగా పాటలు రాశాను. ఇటీవల విడుదలయిన ‘రాజా చెయ్యి వేస్తే’ సినిమా కోసం ‘నీతోనే ఉంది ప్రపంచం.. నీ తీరు మార్చు నేడు కొంచెం’ పాట విమర్శకుల మెప్పు పొందింది.’’