వెటర్నరీ కాలేజీలో ప్రవేశాలు సందిగ్ధమే
-
స్థలం చూశారు.. పనులు మరిచారు
-
నిధులు మంజూరైనా వీడని నిర్లక్ష్యం?
-
శంకుస్థాపనకు కూడా నోచుకోని కళాశాల
సాక్షి, హన్మకొండ : ముఖ్యమంత్రి కేసీఆర్ 2016 జనవరిలో జిల్లాలో పర్యటించిన సందర్భంగా వరంగల్ నగరాన్ని ఎడ్యుకేషన్ హబ్‌గా మార్చుతామని ప్రకటించారు. కాటన్ రీసెర్చ్ సెంటర్, వెటర్నరీ, అగ్రికల్చర్ కాలేజీలు, గిరిజన యూనివర్సిటీ, మేనేజ్‌మెంట్ స్కూల్ తదితర ప్రతిష్టాత్మక సంస్థలను వరంగల్‌లో నెలకొల్పుతామని హామీ ఇచ్చారు. ఇందులో వెటర్నరీ, వ్యవసాయ కళాశాలలను 2016–17 విద్యా సంవత్సరం నుంచి ప్రారంభించేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. దీంతో జిల్లా యంత్రాంగం అగ్రికల్చర్, పశు వైద్య కాలేజీల ఏర్పాటుకు ఆగమేఘాల మీద స్థల సేకరణ ప్రారంభించింది. పీ.వీ.నర్సింహారావు తెలంగాణ రాష్ట్ర పశు సంవర్థక విశ్వవిద్యాలయానికి(హైదరాబాద్) అనుబంధంగా హన్మకొండ మండలం మామునూరు సమీపంలో ఉన్న వెటర్నరీ పాలిటెక్నిక్ కాలేజీ క్యాంపస్‌లో 128 ఎకరాల స్థలాన్ని వెటర్నరీ కళాశాల కోసం గుర్తించారు. ఈ స్థలాన్ని వెటర్నరీ కళాశాలకు కేటాయించాలంటూ మార్చిలో రెవెన్యూ అధికారులకు డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి ఆదేశాలు జారీ చేశారు.
ముందుకు సాగని పనులు..
2016–17 విద్యాసంవత్సరం నుంచి వెటర్నరీ కాలేజీలో తరగతులు ప్రారంభించేలా ఏర్పాట్లు చేసేందుకు అవసరమైన ప్రతిపాదనలు సిద్ధం చేయాలంటూ పీ.వీ.నరసింహరావు పశుసంవర్థక యూనివర్సిటీ రిజిస్ట్రార్ కొండల్‌రెడ్డికి నాలుగు నెలల క్రితం డిప్యూటీ సీఎం కడియం సూచించారు. పశు వైద్యకళాశాల శంకుస్థాపన, భవన నిర్మాణ పనులను ఆర్నెళ్లలోలోపు పూర్తయ్యేలా పనులు చేపట్టాలని ఆదేశించారు. అయితే నాలుగు నెలలు గడిచినా వెటర్నరీ కాలేజీ పనులు ముందుకు సాగడం లేదు. ఇంత వరకు భవన నిర్మాణ పనులకే శంకుస్థాపన చేయలేదు. ఈ అంశంపై స్థానిక ఎమ్మెల్యే అరూరి రమేష్, ప్రభుత్వ సలహాదారు పాపారావు రెండోసారి స్థల పరిశీలన చేశారు. కాలేజీ ఏర్పాటుకు కావాల్సిన ప్రతిపాదనలు త్వరగా సిద్ధం చేయాలంటూ సంబంధిత అధికారులకు మరోసారి ఆదేశాలు జారీ చేశారు. అయినా పరిస్థితిలో మార్పు రాలేదు.
నిధులు కేటాయింపు
విశ్వసనీయవర్గాల సమాచారం మేరకు వరంగల్ వెటర్నరీ కాలేజీ నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం రూ.207 కోట్లు కేటాయించినట్లు తెలుస్తోంది. మొదటి ఏడాది 30 సీట్లతో ప్రవేశాలు కల్పించేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు సమాచారం. ఈ కాలేజీ కోసం 143 పోస్టులు కూడా మంజూరు చేసినటు తెలుస్తోంది. ప్రభుత్వం సానుకూలంగా ఉన్నందున ఈ ఏడాది నుంచి పశువైద్య కాలేజీలో ప్రవేశాలు కల్పించేలా జిల్లా అధికారులు చొరవ చూపించాల్సిన అవసరం ఉంది.