డీల్ రూ.5లక్షలు
స్నేహితులే నిందితులు
ఏడుగురు అరెస్టు, మరో వ్యక్తి పరారీ
నరసన్నపేట : జిల్లాలో సంచలనం సృష్టించిన నరసన్నపేట యువకుడు విజయ్ హత్య కేసు చిక్కుముడిని పోలీసులు విప్పేశారు. నిందితులను అరెస్టు చేశారు. ఈ హత్యపై అన్ని కోణాల నుంచి దర్యాప్తు చేసి ఆధారాలను సేకరించి కేసును కొలిక్కి తెచ్చారు. దీనికి సంబంధించి ఎస్పీ బ్రహ్మారెడ్డి శనివారం రాత్రి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వెల్లడించారు.
నరసన్నపేటకు చెందిన డాక్టర్ పొన్నాడ సోమేశ్వరరావు భార్య స్థానిక హడ్కో కాలనీకి చెందిన మల్లా విజయ్ అలియాస్ గవాస్కర్‌తో సన్నిహితంగా ఉండడం తట్టుకోలేని డాక్టర్ తన అన్నయ్య పొన్నాన రామచంద్రరావు, మేనత్త కుమారుడు జమ్ముకు చెందిన రెడ్డి బాబుతో కలసి విజయ్ హత్యకు పథకం వేశారు. ఈ మేరకు పట్టణానికి చెందిన కారింగుల వెంకటేష్, మగ్గూరు రమణబాబుతో మాట్లాడి రూ.5లక్షలకు డీల్ కుదుర్చుకున్నారు.
ఇందులో భాగంగానే ఈ నెల 24న బుధవారం రాత్రి 7.30–8 గంటల మధ్య నరసన్నపేట ఎంపీడీవో క్వార్టర్స్ వద్ద ఉన్న శిథిల భవనంలో రమణబాబు, వెంకటేష్‌లు విజయ్‌ను తీసుకువచ్చి గొంతు నులిమి చంపినట్టు తెలిపారు. తరువాత వెంకటేష్ జమ్ముకు చెందిన కొత్తరెడ్డి రామకృష్ణ, రెడ్డి బుచ్చిబాబు తీసుకువచ్చిన ఇండికా కారులో మృతదేహాన్ని శ్రీముఖలింగం తీసుకువెళ్లి ముళ్లపొదల్లో వేశారు. కారుతో పాటు రెడ్డి బుచ్చిబాబు, పొన్నాన రామచంద్రరావు మోటారుసైకిల్‌పై వెళ్లి మృతదేహం తరలింపునకు సహకరించారని ఎస్పీ చెప్పారు. అలాగే సోమేశ్వరరావు ఆసుపత్రిలో పని చేస్తున్న కాంపౌండర్లు సంతోష్, బమ్మిడి అప్పన్న కూడా సహకరించారని తెలిపారు.
నగదు, బంగారు గొలుసు స్వాధీనం
ముందుగా కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం సోమేశ్వరరావు హంతకులకు చెల్లించిన రూ.1.5 లక్షలు, ఒక బంగారు గొలుసు స్వాధీనం చేసుకున్నారు. నిందితులు వినియోగించిన మెబైల్ ఫోన్లు కూడా స్వాధీనం చేసుకున్నారు. హత్య రోజు, ముందు రోజు, తరువాత హంతకులు చేసిన సంభాషణలకు సంబంధించిన కాల్ డేటా తీసుకున్నట్లు ఎస్పీ తెలిపారు.
ఏడుగురు అరెస్టు, పరారీలో రామచంద్రరావు
కేసుతో సంబంధం ఉన్న ఎనిమిది మందిలో ఏడుగురు వ్యక్తులను అరెస్టు చేసినట్లు ఎస్పీ బ్రహ్మారెడ్డి తెలిపారు. వీరిలో డాక్టర్ పొన్నాడ సోమేశ్వరరావు, కారింగుల వెంకటేష్, ఎం రమణబాబు, రెడ్డి బుచ్చిబాబు, కొత్తరెడ్డి రామకృష్ణ, బమ్మిడి అప్పన్న, తోణంగి సంతోష్‌లను అరెస్టు చేశామని తెలిపారు. రామచంద్రరావు కోసం గాలిస్తున్నామని చెప్పారు. కాగా హతుడు తల్లిదండ్రుల నుంచి, డాక్టర్ భార్య నుంచి పోలీసులు వేర్వేరుగా స్టేట్‌మెంట్ తీసుకున్నారు. ఈ కేసులో వెంటనే స్పందించి పూర్తి వివరాలు సేకరించి నిందితులను సకాలంలో గుర్తించి సమాచారం రాబట్టిన నరసన్నపేట సీఐ చంద్రశేఖర్, ఎస్‌ఐలు వినోద్‌బాబు, లక్ష్మణ, నర్శింహా మూర్తి, హెచ్‌సీ శ్రీనివాసరావు, కానిస్టేబుల్స్ సింహాచలం, శ్రీనివాసరావులను ఎస్పీ అభినందించారు. మరికొంత సమాచారం రాబట్టాల్సి ఉందని పోలీస్ కస్టడీకి కోర్టు అనుమతితో తీసుకుంటామని ఎస్పీ తెలిపారు. ఎస్పీతో శ్రీకాకుళం డీఎస్పీ భార్గవనాయుడుతో పాటు జిల్లా వివిధ విభాగాల్లో పనిచేస్తున్న డీఎస్పీలు ఆదినారాయణ, శ్రీనివాసరావు, పెంటారావు ఉన్నారు.