► వైఎస్సార్‌సీపీ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి డిమాండ్
► ప్రత్యేకహోదా కోసం రేపు కలెక్టరేట్ల వద్ద ధర్నాలు
► కాకినాడ ఆందోళనలో పాల్గొననున్న పార్టీ అధినేత జగన్
కాకినాడ: ప్రత్యేక హోదా సాధనపై సీఎం చంద్రబాబుకు చిత్తశుద్ధి ఉంటే వెంటనే అఖిలపక్షాన్ని ఏర్పాటు చేయాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి డిమాండ్ చేశారు. అఖిలపక్ష నేతల్ని వెంటబెట్టుకుని ఢిల్లీకి వెళ్లి ప్రధానమంత్రిపై ఒత్తిడి తీసుకురావాలన్నారు. ప్రత్యేక హోదా సాధనకోసం రాష్ట్రవ్యాప్తంగా కలెక్టరేట్ల వద్ద ఈనెల 10న ధర్నాలు నిర్వహించాలని వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, అసెంబ్లీలో ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పిలుపునివ్వడం, ఆ రోజున కాకినాడ కలెక్టరేట్ వద్ద జరిగే ధర్నాలో ఆయన పాల్గొననుండడం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆదివారం కాకినాడ వచ్చిన విజయసాయిరెడ్డి, పార్టీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డిలు ధర్నా నిర్వహించే ప్రాంతాన్ని పరిశీలించారు.
ఏర్పాట్లపై పార్టీ తూర్పుగోదావరి జిల్లా పార్టీ అధ్యక్షుడు కురసాల కన్నబాబు, మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి, పార్టీ సిటీ కోఆర్డినేటర్ ముత్తా శశిధర్, రాష్ట్ర అధికార ప్రతినిధి చెల్లుబోయిన వేణు, సిటీ ప్రెసిడెంట్ రాగిరెడ్డి ఫ్రూటీకుమార్‌లతో చర్చించారు. ఈ సందర్భంగా కలెక్టరేట్ వద్ద విజయసాయిరెడ్డి విలేకరులతో మాట్లాడారు.
హోదా సాధనలో బీజేపీ, టీడీపీ విఫలం
కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో టీడీపీ ప్రత్యేక హోదా సాధనలో పూర్తిగా విఫలమయ్యాయని ఆయన విమర్శించారు. రాష్ట్ర ప్రజల ప్రయోజనాలు కాపాడేందుకు రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షమైన వైఎస్సార్‌సీపీ ఒక్కటే పోరాడుతోందన్నారు. తమిళనాడు, గుజరాత్ రాష్ట్రాల మాదిరిగా రాష్ర్టం అభివృద్ధి చెందాలంటే ప్రత్యేకహోదా వస్తేనే సాధ్యమవుతుందనే విషయం బాబుకు తెలియదా? అని ప్రశ్నించారు. రాష్ట్ర పునర్విభజన బిల్లును పార్లమెంటులో ఆమోదించే సమయంలో రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఐదేళ్లు సరిపోదని, 15 ఏళ్లు ఇవ్వాలని డిమాండ్ చేసిన కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు ఇప్పుడు హోదా విషయంలో మాట మార్చడం ఎంతవరకు సమంజసమన్నారు.
కేంద్రంలో భాగస్వామిగా ఉన్న చంద్రబాబు, కేంద్ర మంత్రిగా వెంకయ్యనాయుడుల తీరును రాష్ట్ర ప్రజలు గమనిస్తూనే ఉన్నారన్నారు. చంద్రబాబు కృషి చేయకుండా ప్రతిపక్షాలు ఢిల్లీ వెళ్లి ఆందోళనలు చేయాలనడం హోదా సాధన నుంచి తనకు తాను తప్పుకోవడంగానే కనిపిస్తోందని చెప్పారు. ప్రధాన ప్రతిపక్షంగా వైఎస్సార్ సీపీ మొదటి నుంచీ హోదా విషయంలో తన వంతు పాత్ర పోషిస్తున్న విషయం రాష్ట్ర ప్రజలకు తెలియంది కాదన్నారు. తమ పార్టీ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డి ఢిల్లీలో దీక్ష, గుంటూరులో ప్రాణాలు సైతం లెక్కచేయకుండా ఆమరణదీక్ష చేసిన విషయం రాష్ట్ర ప్రజలందరికీ గుర్తున్నా చంద్రబాబుకు గుర్తు లేకపోవడం విడ్డూరమన్నారు. హోదా సాధించే వరకు తమ పార్టీ ప్రజల వెన్నంటే ఉంటుందన్నారు.
'హోదా సాధనలో బీజేపీ, టీడీపీ విఫలం'
Published Sun, May 8 2016 9:53 PM | Last Updated on Fri, Mar 29 2019 9:31 PM
Advertisement
Advertisement