ఆ లిఫ్ట్ ఎక్కేందుకు వీఐపీ, వీవీఐపీలకైతే ఓకే... | vijayawada sri kanaka durga temple lift only for vips and vvips only | Sakshi
Sakshi News home page

ఆ లిఫ్ట్ ఎక్కేందుకు వీఐపీ, వీవీఐపీలకైతే ఓకే...

Published Tue, Feb 16 2016 10:05 AM | Last Updated on Sun, Sep 3 2017 5:46 PM

ఆ లిఫ్ట్ ఎక్కేందుకు వీఐపీ, వీవీఐపీలకైతే ఓకే...

ఆ లిఫ్ట్ ఎక్కేందుకు వీఐపీ, వీవీఐపీలకైతే ఓకే...

వృద్ధులు, వికలాంగులు సైతం రూ.100 టికెట్ కొనాల్సిందే
సిబ్బందికి ఐడీ కార్డు తప్పనిసరి
ఆలయ వేళలు రోజుకు 15 గంటలు
లిఫ్టు పనివేళలు ఏడు గంటలే
వ్యాపారుల ప్రయోజనాల కోసమే అధికారుల నిర్ణయం!

 
విజయవాడ : ఇంద్రకీలాద్రిపై కొలువైన దుర్గమ్మను దర్శించుకునేందుకు వచ్చే భక్తులు దేవస్థానం ఏర్పాటు చేసిన లిఫ్టు ఎక్కాలంటే అనేక నిబంధనలను ఎదుర్కోవాల్సి వస్తోంది. అమ్మవారికి భక్తులు సమర్పించిన మొక్కుబడులు, కానుకల సొమ్ము నుంచి సుమారు రూ.50 కోట్లు వెచ్చించి మల్లికార్జున మహామండపాన్ని నిర్మించారు. దీనిలో సుమారు రూ.20 లక్షలు పెట్టి రెండు లిప్టులు ఏర్పాటు చేశారు. అయితే ఈ లిప్టును ఇప్పుడు భక్తులు వినియోగించుకునేందుకు అధికారులు అనేక నిబంధనలు విధిస్తున్నారు.
 
వృద్ధులు, వికలాంగులపైనా కనికరం లేదా...
సాధారణంగా వృద్ధులు, వికలాంగులు, గర్భిణులు కనపడితే వారికి సహాయం చేద్దామని భావిస్తాం. అయితే దేవస్థానం అధికారులు వారిపైనా కనికరం చూపడం లేదు. వృద్ధులు లిఫ్టు ఎక్కదలిస్తే వారు 65 ఏళ్లు దాటినట్లు ధృవపత్రం, వికలాంగులకు 40 శాతం కంటే ఎక్కువ అంగవైకల్యం ఉన్నట్లు ధృవపత్రం చూపించాలంటూ నిబంధనలు విధించారు.

దీంతో పాటు రూ.100 టిక్కెట్ తీసుకోవాలని నిబంధనల్లో పేర్కొన్నారు. ఆ టిక్కెట్‌పై మరొకరిని అనుమతిస్తామని నిబంధనల్లో తెలిపారు. అలా కాకుండా ఉచితంగా కొండపైకి వెళ్లదలిస్తే.. సాధారణ భక్తులతో కలిసి ఉచిత బస్సులో కొండపైకి చేరుకుని అక్కడ నుంచి కొంత దూరం బ్యాటరీ కారులో వెళ్లి తరువాత కొద్దిదూరం నడిచి అమ్మవారి దర్శనానికి వెళ్లాలని దేవస్థానం అధికారులు సెలవిస్తున్నారు.
 
వీఐపీ, వీవీఐపీలకైతే ఓకే...
అమ్మవారి దర్శనానికి వచ్చే వీఐపీ, వీవీఐపీలను మాత్రం లిఫ్టులో అనుమతిస్తారు. అందుకు సంబంధిత అధికారుల అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. సాధారణ భక్తులను అనుమతించని అధికారులు.. ప్రజాప్రతినిధులు, వారి అనుచరగణానికి వీలు కల్పించేందుకే ఇటువంటి నిబంధనలు విధించారనే విమర్శలు వస్తున్నాయి. దేవస్థానం నిత్యం ఉదయం ఆరు నుంచి రాత్రి తొమ్మిది గంటల వరకు 15 గంటలపాటు పనిచేస్తుంటే.. లిఫ్టును మాత్రం మొక్కుబడిగా ఏడుగంటలే నడపాలని నిర్ణయించటం విచారకరం.
 
కమిషనర్ ఆదేశాలు బేఖాతర్...
ఇటీవల దేవాదాయ శాఖ కమిషనర్ వై.అనూరాధ దేవస్థానానికి వచ్చిన సందర్భంగా లిఫ్టును వినియోగించకపోవటంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. భక్తులకు ఈ లిఫ్టును ఉపయోగించాలంటూ ఆదేశాలిచ్చారు. దుర్వినియోగం అవుతోందని భావిస్తే అందులో ఎక్కేవారి ఐడీ కార్డులు అడగాలని సూచించారు. దీన్ని ఆసరాగా చేసుకున్న అధికారులు సాధారణ భక్తులు ఎక్కటానికి వీల్లేకుండా నిబంధనలు విధించటంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
 
వ్యాపారులకు లబ్ధి చేకూర్చేందుకే!
భక్తులు లిఫ్టు మార్గంలో కొండపైకి వెళితే ఘాట్‌రోడ్డులోని దుకాణాల్లో పూజా సామగ్రి కొనుగోలు చేయకుండా నేరుగా అమ్మవారి దర్శనానికి వెళతారు. అందువల్ల వ్యాపారులు తమకు నష్టాలు వస్తున్నాయని గోల చేయడంతో అధికారులు ఈ నిబంధనలు విధించారని భక్తులు విమర్శిస్తున్నారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement