వైభవంగా విరాట్‌సాయి జన్మదినోత్సవం
భక్తజనంతో రేపూరు కిటకిట ∙
భారీగా సామూహిక సత్యవ్రతాలు
రేపూరు (కాకినాడ రూరల్) : కాకినాడ రూరల్ మండలం రేపూరులోని 116 అడుగుల ఎల్తైన విరాట్ షిరిడీ సాయిబాబా 181వ జన్మదినోత్సవం బుధవారం వైభవంగా నిర్వహించారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి వేలాదిమంది భక్తులు తరలివచ్చారు. ఉదయం 4 నుంచి భక్తులు సాయికోటి మహాస్థూపంలో శ్రీసాయి సాయికోటి పుస్తకాలను వేయించారు. కాకడ హారతితో పాటు భక్తులు సుప్రభాతం, అభిషేకాలు, సామూహిక సత్యవ్రతాలు నిర్వహించారు. ఉదయం 10 గంటలకు బాబాకు చందనోత్సవం నిర్వహించారు. విరాట్‌సాయి విగ్రహ వ్యవస్థాపకులు అమ్ముల సాంబశివరావు ప్రసంగం వినడానికి వచ్చిన భక్తులు, బాబాను దర్శించుకునేందుకు క్యూ కట్టారు. 11రోజుల పాటు సాయికోటి దీక్షలు చేపట్టిన యువకులు వాటిని విరమించారు. సుమారు 2 వేలకు పైగా మహిళలు సామూహిక సత్యవ్రతాలను చేశారు. కార్యక్రమం లో పాల్గొని సాయిబాబాను దర్శించుకొని సాయికోటి పుస్తకాలను మహాస్థూపంలో వేశారు. ఒక్కరోజు రాష్ట్ర నలుమూలల నుంచి సుమారు 40 వేలకు పైగా భక్తులు తరలివచ్చారని ఆలయ కమిటీ సభ్యులు వివరించారు. సాయిబాబా 181వ జన్మదినోత్సవం సందర్భంగా 65 కిలోల భారీ కేక్‌ను భక్తుల కట్ చేశారు. భక్తులకు ఇబ్బందులు కలుగకుండా ఆలయ కమిటి భారీ భద్రతా ఏర్పాట్లు చేసింది. భక్తులకు తాగునీరు, మజ్జిగ, వివిధ రకాల పానీయాలు అందించారు. రూరల్ సీఐ పవన్‌కిశోర్ ఆధ్వర్యంలో ఇంద్రపాలెం ఎస్సై తిరుపతి తమ సిబ్బందితో భారీ బందోబస్తు నిర్వహించారు.