ఇంటర్, టెన్త్ ఓపెన్ పరీక్షల్లో మాస్ కాపీయింగ్‌కు ప్రోత్సహించిన అధికారుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. చూచిరాతను తలపించే విధంగా పరీక్షలు జరగడం..
♦ రంగంలోకి దిగిన అధికారులు
♦ అక్రమార్కుల గుండెల్లో రైళ్లు
♦ ‘సాక్షి’ వరుస కథనాలకు స్పందన
ఖమ్మం : ఇంటర్, టెన్త్ ఓపెన్ పరీక్షల్లో మాస్ కాపీయింగ్‌కు ప్రోత్సహించిన అధికారుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. చూచిరాతను తలపించే విధంగా పరీక్షలు జరగడం.. అత్తకు బదులు కోడలు, తండ్రికి బదులు కొడుకు, అన్నకు బదులు తమ్ముడు పరీక్ష రాస్తూ పట్టుబడిన విషయాలు.. అధికారులు మాస్ కాపీయింగ్‌ను ప్రోత్సహించిన విధానాలను వివరిస్తూ ‘సాక్షి’ వరుస కథనాలు ప్రచురించిన విషయం విదితమే. దీనికి బాధ్యులెవరనే విషయాలను తెలుసుకునేందుకుజిల్లా అధికార యంత్రాంగం కదిలింది. ఉన్నతాధికారులు విద్యా శాఖ పనితీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. అక్రమాలకు బీజాలు ఎక్కడ పడ్డాయి.. అసలు సూత్రధారులెవరు.. అనే విషయాలపై ఆరా తీసేందుకు అధికారులు ముమ్మర ప్రయత్నాలు చేశారు. దీనికోసం విజిలెన్స్ బృందాలను కూడా రంగంలోకి దింపినట్లు తెలిసింది. కలెక్టర్ లోకేష్‌కుమార్ స్వయంగా ఇల్లెందు తదితర ప్రాంతాల్లోని పరీక్ష కేంద్రాలకు నేరుగా వెళ్లి తనిఖీలు చేపట్టడంతో అక్రమార్కులు ఆందోళనకు గురవుతున్నారు.
పకడ్బందీగా మాస్ కాపీయింగ్..
అభ్యర్థులకు పదోన్నతి, ఉద్యోగ అవకాశాలు, లెసైన్స్‌లు తదితర అవసరాల కోసం పదో తరగతి, ఇంటర్ సర్టిఫికెట్ల అవసరం ఉంటుంది. అయితే పరీక్ష రాయకుండానే పాస్ అయ్యే మార్గం వెతుక్కున్న వారికి పలువురు దళారులు తారసపడటం.. వారికి జిల్లా విద్యాశాఖ అధికారి కార్యాలయంలో పలువురు అధికారులతో ఉన్న పరిచయాలను ఎరగా చూపి పాస్ చేయిస్తామని హామీలు ఇస్తూ.. వారి వద్ద నుంచి రూ.5వేల నుంచి రూ.10వేల వరకు వసూలు చేసినట్లు తెలుస్తోంది. కనీసం చూసి కూడా రాయలేని వారిని పాస్ చేయించేందుకు ముందుగా వేసుకున్న ప్రణాళిక ప్రకారం అనువైన సెంటర్ల నుంచి అడ్మిషన్లు పొందడం.. ఆ తర్వాత సెంటర్ల ఏర్పాటు.. అక్కడ అనువైన వారిని సీఎస్, డీఈలతోపాటు ఇన్విజిలేటర్లను వేయించడంలో సఫలమయ్యారనే ప్రచారం జరిగింది. ప్రణాళికలో భాగంగానే ఒకరికి బదులు మరొకరు పరీక్ష రాయడం, సమాధాన పత్రాలను బయటకు తీసుకెళ్లి రాయించడం వంటి వాటిపై ‘సాక్షి’ కథనాలు రాయడంతో.. అధికారులు స్పందించారు. ప్రతీ ఒక్కరిని క్షుణ్ణంగా పరిశీలించగా.. ఇల్లెందులో తండ్రికి బదులు కొడుకు.. కొత్తగూడెంలో అత్తకు బదులు కోడలు పరీక్ష రాస్తూ పట్టుబడ్డారు.
అక్రమార్కుల వేటలో అధికారులు
ఎక్కడా లేని విధంగా ఒకరికి బదులు మరొకరు పరీక్షలు రాస్తూ ప్రతీ రోజు పట్టుబడటంపై జిల్లా అధికారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జిల్లా పరువు తీస్తున్న వరుస సంఘటనలకు మూలం ఎవరనే విషయంపై ఆరా తీస్తున్నట్లు తెలిసింది. దీనికోసం పలువురు అభ్యర్థులను పరీక్షలు ఎలా రాస్తున్నారు.. పాస్ గ్యారెంటీ కోసం ఎవరికి ఎన్ని డబ్బులు ఇచ్చారు.. అధికారుల పాత్ర ఏమిటనే విషయాలను పరీక్ష రాస్తున్న వారిని నేరుగా అడిగి తెలుసుకుంటున్నట్లు తెలిసింది. ఈ సందర్భంగా పలువురు అభ్యర్థులు.. తమకేమీ తెలియదని, పాస్ చేయిస్తామని, పెద్ద పెద్ద అధికారులు తమకు తెలుసు.. అందరినీ మేనేజ్ చేస్తాం.. పాస్ గ్యారెంటీ అంటూ వేలాది రూపాయలు తీసుకొని ఇప్పుడు చేతులెత్తేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసినట్లు తెలిసింది. ఇలా మాస్ కాపీయింగ్ వ్యవహారాన్ని బట్టబయలు చేసేందుకు జిల్లా ఉన్నతాధికారులు ప్రయత్నాలు ముమ్మరం చేయడంతో అక్రమార్కులకు ఉచ్చు బిగుస్తోంది. దీంతో ఎప్పుడు ఏ వార్త వినాల్సి వస్తుందోనని మాస్ కాపీయింగ్‌లో కీలక భూమిక పోషించిన అధికారుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి.