ఊరూరా కన్నీరే!
అడుగంటిన భూగర్భజలాలు
ఎండిపోతున్న తాగునీటి పథకాల బోర్లు
డేంజర్ జోన్‌కు చేరిన 24 మండలాలు
ఈ నెలలో వర్షాలు సమృద్ధిగా కురిస్తేనే ఊరట
తీవ్ర వర్షాభావ పరిస్థితుల కారణంగా భూగర్భజలాలు ప్రమాదకరస్థాయిలో పడిపోవడంతో తాగునీటి కష్టాలు పెరిగిపోయాయి. వేసవిలో గుక్కెడు నీటి కోసం గ్రామీణ జనం అవస్థలు పడుతోంది. కొళాయిల్లో వచ్చే అరకొర నీరు, ట్యాంకర్ల ద్వారా సరఫరా చేసే చాలీచాలని నీటి కోసం గంటల తరబడి పడిగాపులు కాస్తున్నారు. అయినా సరిపడునన్ని నీరు దొరక్క ఇబ్బందులు పడుతున్నారు.
- అనంతపురం సిటీ
జిల్లాలో ఎండిపోతున్న బోరుబావుల సంఖ్య ఆందోళనకు గురి చేస్తోంది. రెండు నెలల కిందట తాగునీటి పథకాలకు సంబంధించి 1800 బోరుబావుల్లో నీరు ఇంకిపోతే.. నేడు ఆ సంఖ్య 2500కు చేరింది. ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు గ్రామీణ నీటి సరఫరా విభాగం (ఆర్‌డబ్ల్యూఎస్) అధికారుల నివేదికలు పేర్కొంటున్నాయి. జిల్లా వ్యాప్తంగా 3,314 గ్రామాలు ఉన్నాయి. ఇందులో 1980 గ్రామాలకు వివిధ పథకాలు, నదుల నుంచి తాగునీటిని సరఫరా చేస్తున్నారు. మిగతా 1334 గ్రామాల ప్రజలకు తాగునీటి కష్టాలు తప్పడం లేదు. చాలా గ్రామ పంచాయతీల్లో తాగునీటి పైప్‌లైన్లు, చేతింపులు మరమ్మతులకు నోచుకోలేదు. ఆర్‌డబ్ల్యూఎస్, గ్రామపంచాయతీ అధికారులు వీటి గురించి పట్టించుకోవడం లేదని ప్రజలు విమర్శిస్తున్నారు. తాగునీటి ఎద్దడి తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం, అధికారులు చెబుతున్నా ఆచరణలో ఎక్కడా కనిపించడం లేదని మండిపడుతున్నారు. జూన్‌లోనైనా వర్షాలు బాగా కురిస్తే భూగర్భజలాలు పెంపొంది.. నీటి ఎద్దడి నుంచి ఊరట పొందే అవకాశం ఉంటుంది.
డేంజర్ జోన్‌లో 24 మండలాలు
జిల్లాలోని 63 మండలాల్లో 11 మండలాలు సురక్షితం, 14 మండలాలు క్లిష్ట పరిస్థితుల్లో, మరో 14 మండలాలు అతి క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నాయి. ఎక్కువగా నీటిని తోడేసిన 24 మండలాలు డేంజర్ జోన్ జాబితాలో నిలిచాయి. 271 గ్రామాల్లో ప్రభుత్వం వాల్టా చట్టాన్ని అమలు చేసింది. ఈ ప్రాంతాల్లో ఎక్కడా బోరు బావులు వేయకూడదని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఈ జాబితాలో గాండ్ల పెంట మండలంలోని పలు గ్రామాలు ప్రమాదకర స్థితిలో ఉన్నట్లు అధికారులు తెలిపారు. 75.592 మీటర్ల లోతుకు బోరు వేసినా నీటి చుక్క కానరావడం లేదని చెబుతున్నారు.
భయం భయంగా నీటి వినియోగం..
మునుపెన్నడూ ఇటువంటి నీటి ఎద్దడి చూడలేదు. మూడు వేల జనాభా ఉన్న కలుగోడులో కొళాయిలకు సరిపడునన్ని నీరు రావడం లేదు. ట్యాంకర్‌తో నీటిని సరఫరా చేస్తున్నా అందరికీ చాలడం లేదు. దరించి స్నానం చేయాలన్నా ధైర్యం చాలడం లేదు. బిందెడు నీటిని ఎలా సంపాదించాలో తెలియక భయం భయంగా నీటిని వాడుకుంటున్నాం. బోరుబావుల్లో నీటిమట్టం దారుణంగా పడిపోతోంది. దాహర్తి తీర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకోవాలి.
– సూరయ్య, కలుగోడు, గుమ్మఘట్ట మండలం