'ఏపీ సీఎస్ కు నోటీసులిస్తాం'
హైదరాబాద్: గత కొన్ని నెలలుగా టీడీపీ సర్కార్ ఎంపీలను విధులను కాలరాసే విధంగా యత్నిస్తోందని వైఎస్సార్ సీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి మండిపడ్డారు. రాజ్యాంగబద్ధంగా ఎన్నికైన తమ ఎంపీల విధులను పచ్చచొక్కా నేతలకే కట్టబట్టే యత్నం చేస్తున్నారని ఆయన విమర్శించారు. ఆరోగ్య మిషన్ మానిటరింగ్ చైర్మన్ లుగా వైఎస్సార్ సీపీ ఎంపీలను కేంద్రం నియమిస్తే.. ఆ నియమాకాలను ఏపీ సర్కారు తొలగించిందన్నారు. కేంద్రం ఆదేశాలను పక్కకు పెట్టి ఏపీ సర్కారు తమ స్థానంలో టీడీపీ ఎంపీలను నియమిస్తూ జీవోలు ఇచ్చిందని.. రాష్ట్ర సర్కారు వైఖరి తప్పుబడుతూ కేంద్రం నుంచి తనకు లేఖ అందిందన్నారు.
ఆ జీవో ఉపసంహరించుకోవాలని రాష్ట్ర సర్కార్ కు కేంద్రం సూచించినట్లు వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. దీనిపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావుకు నోటీసులిస్తామన్నారు. న్యాయపరమైన చర్యలకు తాము ఎట్టిపరిస్థితుల్లోనూ వెనకాడేది లేదన్నారు. జన్మభూమి కమిటీల పేరుతో టీడీపీ నేతలు చేస్తున్న అరాచకాలపై న్యాయపోరాటం చేస్తామన్నారు. నంద్యాల ఎంపీ ఎస్పీవై రెడ్డి పార్టీ ఫిరాయింపుపై త్వరలోనే నిర్ణయం ఉంటుందన్నారు. ఈ నెల 29వ తేదీన ప్రత్యేక హోదా కోసం చేపట్టిన ఏపీ బంద్ ను విజయవంతం చేయాలని వైవీ సుబ్బారెడ్డి ప్రజలకు పిలుపునిచ్చారు.