పాడితోనే శిరుల పంట
గ్రామీణ ప్రాంతాల్లో పాడి ఉన్న ఇల్లు శిరుల పంటను కురుపిస్తుందని నంద్యాల విజయ డెయిరీ డిప్యూటీ డైరెక్టర్ పరమేశ్వరరెడ్డి, ఆళ్లగడ్డ పçశు సంవర్ధక సహాయ సంచాలకుడు డాక్టర్ వెంకటేశ్వర్లులు అన్నారు.
రుద్రవరం: గ్రామీణ ప్రాంతాల్లో పాడి ఉన్న ఇల్లు శిరుల పంటను కురుపిస్తుందని నంద్యాల విజయ డెయిరీ డిప్యూటీ డైరెక్టర్ పరమేశ్వరరెడ్డి, ఆళ్లగడ్డ పçశు సంవర్ధక సహాయ సంచాలకుడు డాక్టర్ వెంకటేశ్వర్లులు అన్నారు. శనివారం స్థానిక పాల ఉత్పత్తిదారుల సహకార శీథలీకరణ కేంద్రం మేనేజర్ శ్రీనివాసులు ఆధ్వర్యంలో స్వచ్ఛమైన పాల ఉత్పత్తిపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రుద్రవరం మండలంలో కేంద్రం ప్రారంభంలో 22 గ్రామాల ద్వారా రోజుకు 1200 లీటర్ల పాల సేకరణ జరిగేదని ప్రస్తుతం 37 గ్రామాల నుంచి 3వేల లీటర్ల పాల ఉత్పత్తి జరుగుతుందన్నారు.
పాల ఉత్పత్తిని మరింత అభివృద్ధి చేసేందుకు సిటీ యూనియన్ బ్యాంక్ ద్వారా రూ.1.10 కోట్ల రుణాలు పాల ఉత్పత్తి దారులకు అందించినట్లు చెప్పారు. మహిళ అభివృద్ధి కోసం ప్రపంచ బ్యాంక్ ఆర్థిక సహకారంతో నేషనల్ డెయిరీ కింద 52 సొసైటీలను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. రుద్రవరం మండలంలో పెద్దకంబలూరు, చిన్నకంబలూరు, చందలూరు, రుద్రవరంలో రెండు సొసైటీలను ఏర్పాటు చేసి సబ్సిడీతో పరికరాలను ఇచ్చినట్లు చెప్పారు. కార్యక్రమంలో విజయ డెయిరీ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ సుబ్బరాయుడు, పశువైద్యాధికారులు డాక్టర్ మనోరంజన్, శ్రీనివాసులు, నీల కంటేశ్వరరెడ్డి, రమణారావు, ఆయా గ్రామాల పాల ఉత్పత్తి సేకరణ దారులు పాల్గొన్నారు.