బాక్సైట్ అంటే ఏంటమ్మా?
వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేను అడిగిన గనుల శాఖ మంత్రి పీతల సుజాత
హైదరాబాద్: బాక్సైట్ తవ్వకాలకు వ్యతిరేకంగా విశాఖ మన్యంలో ప్రజా ఉద్యమాలు ఊపందుకుంటున్నాయి. గిరిజన ఎమ్మెల్యేలంతా బాక్సైట్ తవ్వకానికి వ్యతిరేకంగా పోరాడుతున్నారు. స్థానిక గిరిజనులు దీనిపై ఏళ్ల తరబడి ఉద్యమాలు చేస్తూనే ఉన్నారు. కానీ, రాష్ట్ర గనుల శాఖ మంత్రి పీతల సుజాతకు బాక్సైట్ అంటే ఏమిటో తెలియక పోవడం విచిత్రం. బాక్సైట్ అంటే ఏమిటో ఓ ఎమ్మెల్యేను అడిగి మంత్రి తెలుసుకోవడం తాజాగా అందరినీ ముక్కున వేలేసుకునేలా చేసింది.
వైఎస్సార్‌సీపీ పాడేరు ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి ఈ విషయాన్ని స్వయంగా మీడియాతో చెప్పారు. బాక్సైట్ అంటే ఏంటమ్మా అని మంత్రి పీతల సుజాత తనను అడిగారని తెలిపారు. సొంత శాఖకు సంబంధించిన విషయం గురించి తెలియని మంత్రులు ఉన్నారంటే ఏమనాలో అర్థం కావడం లేదని పేర్కొన్నారు. బాక్సైట్ తవ్వకాలకు వ్యతిరేకంగా ఉద్యమం రగులుతూంటే సంబంధిత మంత్రికి దీనిపై కనీస అవగాహన లేకపోవడం పట్ల అధికారులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.