ముఖ్యమంత్రి కేసీఆర్ తన ఇరవై నెలల పాలనపై శ్వేతపత్రం విడుదల చేయాలని మాజీ ఉపముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహా డిమాండ్ చేశారు.
- మాజీ ఉపముఖ్యమంత్రి దామోదర డిమాండ్
నారాయణఖేడ్: ముఖ్యమంత్రి కేసీఆర్ తన ఇరవై నెలల పాలనపై శ్వేతపత్రం విడుదల చేయాలని మాజీ ఉపముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహా డిమాండ్ చేశారు. మెదక్ జిల్లా నారాయణఖేడ్‌లో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. రైతులకు ఒకేమారు రుణమాఫీ చేయలేని ప్రభుత్వం.. రూ.30 వేల కోట్లు మిషన్ భగీరథకు టెండర్లు పిలువకుండా కట్టబెట్టారని విమర్శించారు. 2,500 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే వారిని ఆదుకోవడానికి డబ్బులు ఉండవు కానీ, భగీరథ పైపుల కొనుగోలుకు మాత్రం డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయని ప్రశ్నించారు.
ఎన్ని ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి? ఎన్నింటిని భర్తీ చేశారని ప్రశ్నించారు. కేసీఆర్ ఎన్నికల్లో ఇచ్చిన ఏ ఒక్క మాటైనా నిలబెట్టుకున్నారా అని అడిగారు. గిరిజనులు, మైనార్టీలకు 12శాతం రిజర్వేషన్ అమలు ఏమైందన్నారు. టీఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చాక జరిగిన అభివృద్ధి, మిషన్ భగీరథ పైపుల కొనుగోళ్లు, ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్‌మెంట్‌లపై వెంటనే శ్వేతపత్రం విడుదల చేయాలని దామోదర డిమాండ్ చేశారు.