కమల దళపతి ఎవరు? | Who will be the next president of Telangana BJP | Sakshi
Sakshi News home page

కమల దళపతి ఎవరు?

Published Sat, Dec 12 2015 5:36 AM | Last Updated on Fri, Mar 29 2019 9:31 PM

కమల దళపతి ఎవరు? - Sakshi

కమల దళపతి ఎవరు?

రాష్ట్ర అధ్యక్షుడి కోసం బీజేపీ కసరత్తు
♦ పార్టీకి జవసత్వాలు కలిగించే నేత కోసం వెతుకులాట
♦ బరిలో యెండల, ఇంద్రసేనారెడ్డి, రామచందర్‌రావు
♦ విముఖత చూపిన మురళీధర్‌రావు, లక్ష్మణ్
 
 సాక్షి, హైదరాబాద్: పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిని నియామకంపై భారతీయ జనతా పార్టీ (బీజేపీ) తీవ్రస్థాయిలో కసరత్తు చేస్తోంది. ఈ నెలాఖరులోగా జిల్లా కమిటీలకు ఎంపిక ప్రక్రియను పూర్తిచేయాలని భావిస్తోంది. ఆ వెంటనే రాష్ట్ర కార్యవర్గం ఏర్పాటు చేయడంపై అంతర్గత చర్చలకు ఉపక్రమించింది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా జి.కిషన్‌రెడ్డి వరుసగా రెండు సార్లు పదవీ కాలాన్ని పూర్తి చేసుకున్నారు. దీంతో కొత్త అధ్యక్షుడి కోసం బీజేపీ రాష్ట్ర ముఖ్యులు చర్చలు జరుపుతున్నారు. తెలంగాణలో పార్టీని బలోపేతం చేసే సత్తా కలిగిన నాయకుడెవరనే దానిపై బీజేపీ జాతీయ నాయకత్వం వివిధ మార్గాల ద్వారా సమాచారాన్ని సేకరిస్తున్నట్టు తెలుస్తోంది. ఇలాంటి ముఖ్య విషయాల్లో కీలక పాత్ర పోషించే సం ఘ్ పరివార్ యోచన ఏమిటన్నదానిపై పార్టీ నేతలు అంచనాకు రాలేకపోతున్నారు. బీజేపీ విస్తరణకు రాష్ట్రంలో చాలా అవకాశాలున్నాయని, వాటిని అందిపుచ్చుకుని పార్టీకి జవసత్వాలు కలిగించే నాయకుడి ఎంపికకు అవకాశం ఉందని పార్టీ నేతలు చెబుతున్నారు.

 మురళీధర్‌రావు, లక్ష్మణ్ విముఖత
 పార్టీ రాష్ట్ర అధ్యక్ష పదవి కోసం జాతీయ పార్టీలో కీలక బాధ్యతల్లో ఉన్న పి.మురళీధర్‌రావు పేరు తెరపైకి వచ్చింది. కానీ జాతీయ స్థాయిలోనే బాధ్యతలు నిర్వహిస్తానని, రాష్ట్ర అధ్యక్ష పదవిపై ఆసక్తి లేదని ఆయన ఇప్పటికే  తేల్చినట్లుగా సమాచారం. పార్టీలో సీనియర్‌గా ఉన్న బీజేపీ శాసనసభాపక్ష నేత కె.లక్ష్మణ్ పేరు కూడా చర్చకు వచ్చింది. శాసనసభాపక్షానికి నాయకుడిగా ఉంటూ పార్టీ అధ్యక్ష పదవిని కోరుకోవడం మంచిది కాదని, శాసనసభాపక్షనేతగానే కొనసాగుతానని లక్ష్మణ్ సంకేతాలు ఇచ్చినట్టుగా తెలుస్తోంది.

 కొత్త వారికే..
 తెలంగాణలో బీజేపీని బలోపేతం చేయడం కోసం పార్టీలో వ్యక్తిగతంగా గ్రూపులు, వివాదాలు లేకుండా విస్తృత దృక్పథంతో పనిచేయగలిగే వారికోసం జాతీయ నేతలు అన్వేషిస్తున్నారు. దీనిలో భాగంగా ఇప్పటిదాకా పనిచేసినవారు కాకుండా కొత్త నేతకే పార్టీ రాష్ట్ర పగ్గాలను అప్పగించాలనే యోచనలో ఉన్నారు. పార్టీ రాష్ట్ర అధ్యక్ష పదవి కోసం పోటీపడుతున్నవారిలో మాజీ ఎమ్మెల్యే యెండల లక్ష్మీనారాయణ, ఎమ్మెల్సీ ఎన్.రామచందర్‌రావు పేర్లు ముందు వరుసలో ఉన్నాయి. నిజామాబాద్ జిల్లాకు చెందిన యెండల లక్ష్మీనారాయణ ఎమ్మెల్యేగా రెండుసార్లు ఎన్నికయ్యారు. తెలంగాణ ఉద్యమం సందర్భంగా రాజీనామా చేసి, ఉప ఎన్నికలోనూ రెండోసారి గెలిచారు. పార్టీకి, సంఘ్ పరివార్‌కు విధేయంగా పనిచేస్తున్నారు. ఆయన బీసీ కావడం అదనపు అర్హత కూడా.

కానీ ఆయన పార్టీ శాసనసభాపక్షనేత లక్ష్మణ్ సామాజిక వర్గానికే చెందినవారు కావడంతో అధ్యక్ష పదవిని ఇస్తారా అనే సందేహం వ్యక్తమవుతోంది. ఇక పార్టీలో సీనియర్ అయిన ఎమ్మెల్సీ ఎన్.రామచందర్‌రావు కూడా పోటీలో ఉన్నారు. పార్టీలో ఎవరితోనూ వివాదాల్లేకుండా, జాతీయస్థాయిలో ప్రముఖులతో సంబంధాలున్న రామచందర్‌రావు అభ్యర్థిత్వానికి సంఘ్‌పరివార్ కూడా సుముఖంగానే ఉండొచ్చునని పార్టీ నేతలు చెబుతున్నారు. ఇక తెలంగాణలో బలమైన సామాజికవర్గం నుంచి నల్లు ఇంద్రసేనారెడ్డి పేరు కూడా చర్చలో ఉంది. గతంలో ఉమ్మడి రాష్ట్ర పార్టీగా అధ్యక్షుడిగా పనిచేసిన అనుభవం, టీఆర్‌ఎస్‌ను ఎదుర్కోవడంలో కఠినవైఖరి వంటి సానుకూల అంశాలు ఆయనకు ఉన్నాయి. అయితే కేంద్రంలో అధికారం ఉన్నందున నామినేటెడ్ పదవి ఇస్తే బాగుంటుందనే ఆలోచనలో ఇంద్రసేనారెడ్డి ఉన్నట్టు తెలుస్తోంది. వీరితో పాటు పార్టీ సీనియర్లు బి.రాజేశ్వర్‌రావు, చింతల రామచంద్రారెడ్డి తదితరులు కూడా రాష్ట్ర అధ్యక్ష పదవిని ఆశిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement