భక్తిమైకంలో దంపతుల ఆత్మహత్య
–కాలువలోకి దూకి అఘాయిత్యం
పెరవలి : భక్తిమైకంలో కాలువలోకి దూకి ఓ జంట ఆత్మహత్యకు పాల్పడింది. ఈ దుర్ఘటన పశ్చిమగోదావరి జిల్లా పెరవలి మండలం కాకరపర్రులో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. పెరవలి మండలం తీపర్రుకు చెందిన పత్తిపాటి అచ్యుతరామయ్య(53), ఆయన భార్య రత్నజ్యోతి(45)కు ఇద్దరు సంతానం. కొడుకు 9వ తరగతి, కుమార్తె ఇంటర్మీడియెట్ చదువుతున్నారు. స్వతహాగా ఆస్తిపరులైన అచ్యుతరామయ్య, రత్నజ్యోతి పిల్లలను తణుకులోని హాస్టల్లో వేసి.. ఇహలోక సుఖాలను త్యజించి మూడేళ్లుగా కాకరపర్రు సురీంద్రబాబు ఆశ్రమంలో ఉంటున్నారు. అక్కడ వేదపాఠశాల నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఏమైందో ఏమోగానీ ఆదివారం తెల్లవారుజామున భార్యాభర్తలిద్దరూ ఆశ్రమం నుంచి వెళ్లిపోయారు. తెల్లవారిన తర్వాత దంపతులిద్దరూ కనపడకపోవడంతో సహచరులు వెతికారు. వారిద్దరూ కోడేరు కాలువవైపు వెళ్లారని గ్రామస్తులు చెప్పడంతో గాలింపు చేపట్టారు. ఎట్టకేలకు సాయంత్రం ముక్కామల వద్ద వారి మృతదేహాలు లభ్యమయ్యాయి. పెరవలి ట్రై నింగ్ ఎస్‌ఐ రాజ్‌కుమార్ కేసు నమోదు చేసి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తణుకు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. నిత్యం భక్తిమార్గంలో నడిచే అచ్యుతరామయ్య, రత్నజ్యోతి ముక్తి కోసమే ఇలా చేసి ఉంటారని ఆశ్రమవాసులు, బంధువులు చెబుతున్నారు.