ఆ..ఇల్లాలు ఇంటికి చీకటి! | wife cruelty against husband | Sakshi
Sakshi News home page

ఆ..ఇల్లాలు ఇంటికి చీకటి!

Published Mon, Dec 19 2016 9:31 PM | Last Updated on Fri, Jul 27 2018 2:21 PM

ఆ..ఇల్లాలు ఇంటికి చీకటి! - Sakshi

ఆ..ఇల్లాలు ఇంటికి చీకటి!

భర్తతో ఏడడుగులు కలిసి నడిచినా కనికరం చూపని భార్య
ఇంటి యజమాని మంచాన పడితే ముఖం చాటేస్తున్న ఇల్లాలు
పింఛన్, ఇతర వనరులన్నీ అనుభవిస్తూ భర్తను ఎట్టికి వదిలిన సతి
ఇంటి నుంచి దుర్గంధం వస్తుండటంతో ఆందోళనకు దిగిన ఇరుగుపొరుగు
ప్రశ్నించిన బంధువులపై కేసులు బనాయిస్తానంటూ బెదిరిస్తున్న మహిళ


కార్యేషు దాసి.. కరణేషు మంత్రి.. భోజ్యేషు మాత.. శయనేషు రంభ..
ఇక్కడ ఈమె.. కార్యేషు దాసి కాలేకపోతోంది..
ఇక్కడ.. ఈమె కరణేషు మంత్రి అంతకన్నా కాదు..
ఇక్కడ. ఈమె భోజ్యేషు మాతను కాదు పొమ్మంటోంది..


సృష్టిలో వివాహ బంధాన్ని వర్ణిస్తూ కవులు ఎన్నో పాటలు రాశారు. ఎన్నో చిత్రాల్లో భార్య,భర్తల అనుబంధాన్ని చెప్పే సన్నివేశాల్లో పై నాలుగు చరణాలు ఉటంకిస్తుంటారు. అంతటి పవిత్ర బంధాన్ని ఓ ఇల్లాలు మంటగలుపుతోంది. కడవరకూ తోడుంటానని పెళ్లినాటి బాసలకు పాతరేస్తోంది. మంచంపట్టిన ఇంటి యజమానికి తోడు లేకుండా తన దారి తాను చూసుకుంటోంది. ఆయన నుంచి వచ్చిన అన్ని ఆదాయ వనరులు అనుభవిస్తూ ఎట్టికి వదిలేసింది.  

గిద్దలూరు రూరల్‌ : అగ్ని సాక్షిగా వివాహం చేసుకున్న భర్త అనారోగ్యానికి గురయ్యాడు. భర్త మంచాన పడితే ఆమె కనికరం చూపడం లేదు. ఆయన్ను నిర్ధాక్షిణంగా వదిలి పుట్టింటికి వెళ్లింది. చివరకు స్థానికుల చొరవతో కన్నతల్లి, బంధువుల వద్దకు చేరాడు. ఈ హృదయ విదారక సంఘటన పట్టణంలోని నల్లబండ బజారులో ఆదివారం వెలుగు చూసింది.

ఇదీ.. జరిగింది
రాచర్లకు చెందిన రాచర్ల వెంకట సుబ్బయ్య ఆర్మీ ఉద్యోగి. ఆయనకు గిద్దలూరుకు చెందిన రమాదేవితో 11 ఏళ్ల క్రితం వివాహమైంది. ఆ దంపతులకు గుర్తుగా ఇద్దరు కుమారులు కలిగారు. సుబ్బయ్య జమ్మూలో విధులు నిర్వర్తిస్తుండగా ఉన్నట్టుండి అనారోగ్యానికి గురయ్యాడు. 3 ఏళ్ల క్రితం పక్షవాతం కూడా వచ్చి కాళ్లు, నోరు పడిపోయాయి. అప్పటి వరకూ దంపతులు కలిసి మెలిసి అన్యోన్యంగానే ఉన్నారు. విధుల నుంచి బయటకు వచ్చిన తర్వాత దంపతులు కాపురాన్ని గిద్దలూరు మార్చారు. నల్లబండ బజారులో ఓ అద్దె ఇంట్లో నివాసం ఉన్నారు. సుబ్బయ్య ఆరోగ్యం క్రమక్రమంగా క్షీణిస్తోంది. ఆయనకు పదవీ విరమణ బెన్‌ఫిట్స్‌ వచ్చాయి. ఫెన్షన్‌ నెలనెలా వస్తోంది.   

భర్త బాగోగులు పట్టించుకోని భార్య
చిన్నచిన్నగా ఆమె భర్త బాగోగులను పట్టించుకోవడం లేదు. దీన్ని పసిగట్టిన ఇంటి యజమాని వారిని ఇంటి నుంచి ఖాళీ చేయించాడు. ఈ నేపథ్యంలో 6 నెలల క్రితం నల్లబండ బజారులో సొంతంగా ఓ ఇల్లు కొనుగోలు చేసి భర్తను అందులో పెట్టింది. మంచాన పడిన భర్త ఆలనా పాలన చూసుకోకుండా ఆమె తన మకాన్ని దగ్గర్లోని పుట్టింటికి మార్చింది. భర్తను ఒంటరిగా కొనుగోలు చేసిన ఇంట్లో ఉంచి ఆహారం మాత్రమే పెట్టింది. సుబ్బయ్య మలమూత్రాలు మంచంపైనే విసర్జించేవాడు. ఆమె పట్టించుకోవడం లేదు.

ఇంటి నుంచి దుర్గంధం
ఇంటి నుంచి తీవ్ర దుర్గంధం వస్తోంది. తట్టుకోలేని స్థానికులు ఆమెకు నచ్చజెప్పినా వినిపించుకోలేదు. చేసేది లేక ఆయన బంధువులకు సమాచారం ఇచ్చారు. సుబ్బయ్యకు మెరుగైన వైద్య సేవలు అందించి ఇంటిని శుభ్రంగా ఉంచుకోవాలని ఇరుగుపొరుగు ఆదివారం ఆందోళనకు దిగారు. కట్టుకున్న భర్తను వదిలేసి ఇంటిని శుభ్రం చేసుకోకుండా భర్తను పట్టించుకోకుంటే ఎలాగని స్థానికులు ప్రశ్నించారు. సుబ్బయ్యకు వచ్చే నెలవారీ జీతం, ఫెన్షన్‌ మాత్రం తీసుకుని నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని స్థానికులు మండిపడుతున్నారు.

కన్న ప్రేమను వదులుకోలేను : రాచర్ల పార్వతమ్మ, వెంకట సుబ్బయ్య తల్లి
నా కుమారుడు వెంకట సుబ్బయ్య అనారోగ్యంతో మంచానపడితే కోడలు రమాదేవి పట్టించుకోవడం లేదు. ఆమె భర్త ప్రేమను మరిస్తే నేను కన్న ప్రేమను తుంచుకోలేను. నా కన్న కుమారుడిని ఇంటికి తీసుకెళ్లి దగ్గరుండి చూసుకుంటా.  నా కొడుకును ఇంటికి తీసుకెళ్తే కిడ్నాప్‌ చేశారంటూ.. కేసులు పెడతానని కోడలు బెదిరిస్తోంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement