కట్టుకున్నోడే కడతేర్చబోయాడు
Published Sat, Jul 16 2016 6:03 PM | Last Updated on Mon, Jul 30 2018 8:27 PM
నేలకొండపల్లి : అదనపు కట్నం ఇవ్వకుంటే చంపుతానని చిత్రహింసలు.. భరించలేక పుట్టింటికి వెళ్లిన భార్య.. అక్కడ కూడా వదలకుండా అర్ధరాత్రి ఇంట్లో చొరబడి భార్య గొంతుపై కత్తితో పొడిచాడు భర్త. ఈ సంఘటన ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలంలో గురువారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. బాధితురాలి తల్లి కథనం ప్రకారం.. కోరట్లగూడెం గ్రామానికి చెందిన జరీనా కూతురు మనీషాను.. నల్లగొండ జిల్లా మునగాల మండలం నర్సింహులగూడెంకు చెందిన జలీల్‌కు ఇచ్చి నాలుగేళ్ల క్రితం పెళ్లి చేశారు. కొంతకాలం సాఫీగానే సాగిన వీరి దాంపత్య జీవితంలో ఓ కూతురు జన్మించింది. పనీపాట లేకుండా తిరుగుతున్న జలీల్ అదనపు కట్నం తేవాలని నిత్యం భార్యను వేధించేవాడు. తట్టుకోలేక మనీషా పుట్టింటికి నెల క్రితం వచ్చింది. అయినా వదలకుండా అప్పుడప్పుడు వచ్చి బెదిరించేవాడు.
దీంతో మనీషా విషయాన్ని తల్లికి, ఇతర పెద్దలకు చెప్పింది. ఈ క్రమంలో ఇంట్లో మనీషా నిద్రిస్తుండగా.. ఆరుబయట తల్లి జరీనా, మనవరాలు పడుకున్నారు. దీనిని గమనించిన జలీల్ ఇంటి వెనక ఉన్న కిటికీని పగులగొట్టి లోనికి చొరబడ్డాడు. మంచంపై నిద్రిస్తున్న మనీషా గొంతుపై కత్తితో పొడిచి పారిపోయాడు. తీవ్ర రక్తస్రావంతో బయటకు వచ్చిన మనీషా మాటలు రాకపోవడంతో.. పలకపై రాసి విషయాన్ని తల్లికి చూపింది. వెంటనే స్థానిక పోలీస్‌స్టేషన్ కు చేరుకుని ఫిర్యాదు చేశారు. అనంతరం మనీషాను చికి త్స కోసం ఖమ్మం ఆస్పత్రికి తరలించారు. ఆమె పరిస్థితి విషమంగా ఉండటంతో వైద్యులు హైదరాబాద్‌కు తరలించాలని సూచించినట్లు తల్లి తెలిపింది. బాధితురాలి తల్లి ఫిర్యాదు మేరకు ఎస్సై పి.దేవేందర్‌రావు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.
Advertisement
Advertisement