అనుమానంతో భార్య ముక్కుకోసిన భర్త
చందర్లపాడు : భార్యపై అనుమానంతో భర్త ముక్కుకోసిన ఘటన మండలంలోని ఏటూరులో సోమవారం సాయంత్రం జరిగింది. సేకరించిన సమాచారం మేరకు గ్రామానికి చెందిన దున్నా చంటి, సుజాత దంపతులు. సుజాతపై భర్తకు అనుమానం రావడంతో పది రోజుల క్రితం వీరిమధ్య వివాదం జరిగింది. ఈ నేపథ్యంలో ఆమెను పుట్టింటికి పంపించివేశాడు. 17న అత్తగారింటికి (తక్కెళ్లపాడు) వెళ్లి భార్య సుజాతను ఇంటికి తీసుకొచ్చాడు. ఇంటికి తీసుకువచ్చిన అనంతరం ఇరువురి మధ్య తిరిగి ఘర్షణ చోటుచేసుకుంది. ఈ నేపథ్యంలో చంటి తలుపులు వేసి ఆమె చేతులు కట్టేసి ముక్కుకోసి పరారయ్యాడు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు సుజాతను చికిత్స నిమిత్తం నందిగామ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు చందర్లపాడు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.