
మెదక్ జిల్లా ఎస్పీతో మాట్లాడతా: డీజీపీ
మెదక్ జిల్లాలో జర్నలిస్టులపై నమోదైన కేసుల విషయమై జిల్లా ఎస్పీ సుమతిని పిలిచి మాట్లాడుతానని డీజీపీ అనురాగ్‌శర్మ చెప్పారు.
జర్నలిస్టులపై నమోదైన కేసులపై డీజీపీకి టీయూడబ్ల్యూజే ఫిర్యాదు
సాక్షి, హైదరాబాద్: మెదక్ జిల్లాలో జర్నలిస్టులపై నమోదైన కేసుల విషయమై జిల్లా ఎస్పీ సుమతిని పిలిచి మాట్లాడుతానని డీజీపీ అనురాగ్‌శర్మ చెప్పారు. జర్నలిస్టులపై పోలీసులు అన్యాయంగా, అక్రమంగా కేసులు నమోదు చేస్తున్నారని తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ (టీయూడబ్ల్యూజే) ప్రతినిధి బృందం డీజీపీ అనురాగ్‌శర్మ దృష్టికి తీసుకెళ్లింది. ‘సాక్షి’ దినపత్రిక సిద్ధిపేట జోన్ ఇన్‌చార్జి ప్రభాకర్‌తో పాటు జిల్లాలో ఏడాది కాలంలో 17 మందిపై అక్రమంగా కేసులు నమోదు చేశారని బృందం సభ్యులు చెప్పారు. మంగళవారం ఈమేరకు డీజీపీకి వినతిపత్రం ఇచ్చారు. జిల్లా ఎస్పీ సుమతి జర్నలిస్టుల పట్ల వ్యవహరిస్తున్న తీరును వివరించారు.
డీజీపీ అనురాగ్‌శర్మ స్పందిస్తూ.. మెదక్ జిల్లాలో జర్నలిస్టులపై నమోదైన కేసులన్నింటినీ విచారిస్తామని యూనియన్ నాయకులకు హామీ ఇచ్చారు. డీజీపీని కలసిన వారిలో టీయూడబ్ల్యూజే ప్రధాన కార్యదర్శి సీహెచ్ క్రాంతికిరణ్, ఉపాధ్యక్షుడు పల్లె రవికుమార్, తెలంగాణ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టు యూనియన్ అధ్యక్షుడు ఎంవీ రమణ తదితరులున్నారు.