
మసీదుల పక్కన మద్యం షాపులు వద్దు
అనంతపురం సెంట్రల్ : ప్రశాంతతకు మారుపేరుగా ఉంటున్న మసీదుల పక్కన మద్యం షాపులు ఏర్పాటు చేయడం ద్వారా తమ మనోభావాలు దెబ్బతీయరాదంటూ అధికారులను ముస్లిం మత పెద్దలు కోరారు. అనంతపురంలోని ఐదో రోడ్డు సమీపంలో మసీదు వద్ద మద్యం షాపు ఏర్పాటు చేయడాన్ని వ్యతిరేకిస్తూ సీపీఎం, ఐద్వా ఆధ్వర్యంలో వందలాది మంది ముస్లింలు శుక్రవారం ధర్నా నిర్వహించారు. ఐదో రోడ్డు నుంచి ఎక్సైజ్ సూపరింటెండెంట్ కార్యాలయం వరకూ భారీ ర్యాలీతో ముస్లింలు చేరుకున్నారు. ఈ సందర్భంగా రోడ్డుపై బైఠాయించి, ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఆందోళన విరమించాలంటూ డీఎస్పీ మల్లికార్జున వర్మ,, ఎక్సైజ్ సూపరింటెండెంట్ అనిల్‌కుమార్‌రెడ్డి చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి.
ఒకనోక దశలో సహనం కోల్పోయిన ఆందోళన కారులు అధికారులతో వాగ్వాదానికి దిగారు. మసీదుల వద్ద కాకుండా అధికారులు, స్థానిక ఎమ్మెల్యే ఇంటి వద్ద మద్యం షాపులు ఏర్పాటు చేసుకోవాలని నినదించారు. మసీదు, గుడి, బడి అని తేడా లేకుండా ఇష్టారాజ్యంగా ఎలా ఏర్పాటు చేస్తారంటూ వాగ్వాదం చేశారు. వెంటనే మసీదుల వద్ద మద్యం దుకాణాల ఏర్పాటును ఉపసహరించుకోకపోతే ప్రత్యక్ష ఆందోళనకు దిగుతామంటూ హెచ్చరించారు. ఎక్సైజ్ సూపరింటెండెంట్ మాట్లాడుతూ... మద్యం షాపులు తొలగిస్తామని హామీనిచ్చారు. ప్రజాభిప్రాయాలకు అనుగుణంగా ఇబ్బంది కలగని చోట ఏర్పాటు చేస్తామని తెలిపారు. దీంతో ఆందోళన విరమించారు. కార్యక్రమంలో ఐద్వా జిల్లా అధ్యక్షురాలు లక్ష్మీదేవి, కార్యదర్శి సావిత్రి, నగర అధ్యక్షురాలు యమున, నాయకులు రామాంజనమ్మ, నేహమత్, సీపీఎం నగర కార్యదర్శి నాగేంద్రకుమార్, కార్యదర్శివర్గ సభ్యులు రామిరెడ్డి, నాయకులు గోపాల్, వలి, సికిందర్, ముతవల్లీలు రఫిక్, హజీ మునీర్, హమీద్, హుస్సేన్, ఐఎంఎం అధ్యక్షుడు బాషా తదితరులు పాల్గొన్నారు.