విద్యుదాఘాతంతో వ్యక్తి మృతి
భువనగిరి అర్బన్ : విద్యుదాఘాతంతో వ్యక్తి మృతి చెందిన సంఘటన ఆదివారం భువనగిరిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వలిగొండ మండలంలోని పులిగిల్ల గ్రామానికి చెందిన పల్లెర్ల బాబు (30) భువనగిరిలో నారల రాములు మేస్త్రి వద్ద కూలీ పనిచేస్తు జీవనం సాగిస్తున్నాడు. ఆదివారం రోజూలాగే కూలి పనికి భువనగిరికి వచ్చాడు. పట్టణంలోని అర్బన్ కాలనీలో ఓ ఇల్లు నిర్మాణంలో పాల్గొన్న ఆయన స్లాబ్ వేసేందుకు ఇనుప చువ్వలను కింద నుంచి పైకి అందజేస్తున్నారు. ఈ క్రమంలో సమీపంలో ఉన్న 11 కేవీ విద్యుత్ వైర్లకు ఇనుప చువ్వలు తగలడంతో విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే మృతి చెందినట్లు తెలిపారు. మృత దేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ఏరియా ఆస్పత్రికి తరలించారు. మృతుడి తల్లి పల్లెర్ల లక్ష్మమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తునట్లు పట్టణ ఎస్‌ఐ మంజునాథ్‌రెడ్డి తెలిపారు. మృతునికి భార్య ఉంది.