వివాహేతర సంబంధానికి అడ్డున్నాడని..
- మిస్టరీ వీడిన హత్యకేసు
- పోలీసుల అదుపులో నిందితుడు
డోన్ టౌన్: తన వివాహేతర సంబంధానికి అడ్డున్నాడని ఓ మహిళ తన భర్తనే హత్య చేయించిన ఘటన ఇది. వెంకటనాయినిపల్లె గ్రామానికి చెందిన రామచంద్రుడు(40) హత్య కేసు మిస్టరీ వీడింది. కేసు వివరాలను డోన్ డీఎస్పీ బాబా ఫకృద్దీన్ మంగళవారం విలేకరులకు వివరించారు. డోన్ పరిధిలోని ఎర్రగుంట్ల గ్రామ పొలిమేరలోని అటవీ ప్రాంతంలో ఈనెల 4వ తేదీన గుర్తుతెలియని వ్యక్తి మృతదేహాం లభించింది. సీఐ శ్రీనివాసులు గౌడ్ ఆధ్వర్యంలో ఎస్‌ఐ రామసుబ్బయ్య కేసు దర్యాప్తు చేపట్టారు. మృతదేహం వెంకటనాయినిపల్లె గ్రామానికి చెందిన రామచంద్రుడు(40)గా గుర్తించి విచారణ చేపట్టారు.
పోలీసులు అతని భార్య నాగమద్దమ్మను అదుపులోకి తీసుకొని విచారించగా కృష్ణగిరి మండలం ఎస్ ఎర్రగుడి గ్రామానికి చెందిన తిమ్మరాజుతో కలసి భర్తను హత్య చేసినట్లు ఒప్పుకుంది. నాగమద్దమ్మ కూలీ పనులకు వెళ్తూ తిమ్మరాజుతో వివాహేతర సంబంధం ఏర్పడింది. ఈ క్రమంలో తమ సంబంధానికి అడ్డుగా ఉన్న భర్తను అంతమొందించాలని ఇద్దరు కుట్ర పన్నారు. గత నెల 27వ తేదీన తిమ్మరాజు పథకం ప్రకారం రామచంద్రుడిని ఎర్రగుంట్ల కొండకు తీసుకువెళ్లి అతిగా మద్యం తాగించి, తర్వాత తలపై బండరాతితో బలంగా మోది, గొంతుకు టవాల్‌ను బిగించి హత్య చేశాడు. ఈనెల 4వ తేదీన మృతదేహం వెలుగులోకి రావడంతో పోలీసులు కేసును ఛేదించారు. మంగళవారం నిందితుడు తిమ్మరాజును అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. నాగమద్దమ్మ పాత్రపై కూడా విచారణ చేస్తున్నామని డోన్ డీఎస్పీ బాబా ఫకృద్దీన్ తెలిపారు.