ప్రభుత్వం డ్వాక్రా మహిళా సంఘాల సభ్యులకు పసుపు, కుంకుమ పేరుతో రెండో విడత అందించిన రూ.3వేల కోసం బ్యాంకు వద్ద ధర్నా చేపట్టారు.
రొళ్ల : ప్రభుత్వం డ్వాక్రా మహిళా సంఘాల సభ్యులకు పసుపు, కుంకుమ పేరుతో రెండో విడత అందించిన రూ.3వేల కోసం బ్యాంకు వద్ద ధర్నా చేపట్టారు. వివరాలిలా ఉన్నాయి. మండల పరిధిలోని కాకి ఎస్సీ కాలనీ వాసులు, రత్నగిరి గ్రామానికి చెందిన వందలాది డ్వాక్రా మహిళలు బుధవారం రత్నగిరి ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంకు వద్దకు చేరుకుని తమ ఖాతాలో జమ అయిన రూ.మూడు వేలు చెల్లించాలన్నారు. అయితే బ్యాంకు అధికారులు పాత బకాయిలకు జమ చేసుకుంటున్నామని తెలపడంతో ఆందోళనకు దిగారు.
ఇదివరకే పలువురి సంఘ సభ్యులకు రూ.3వేల అందించి తమకు ఎందుకు చెల్లించడం లేదని ప్రశ్నించారు. ప్రభుత్వం పసుపు కుంకుమ కింద ఇచ్చిన డబ్బు తమకు ఇచ్చేదాకా ఆందోళన విరమించబోమని పట్టుబట్టారు. ఈ సందర్భంగా పలువురు సంఘ సభ్యులు రాధమ్మ, రంగమ్మ, హనుమక్క, శంకరమ్మ, రత్నమ్మ, జయమ్మ, సీత తదితరులు మాట్లాడుతూ ఎన్నికల సమయంలో డ్వాక్రా రుణాలను పూర్తిగా మాఫీ చేస్తామని చెప్పి మాఫీ చేయకుండా మోసగించారని వాపోయారు.
తమకు పసుపు, కుంకుమ పేరుతో అందించిన నగదును పాతబకాయిలకు జమ చేసుకోవడం సబబుకాదని మండిపడ్డారు. మండుటెండను కూడా లెక్కచేయకుండా బ్యాంకు ఎదుట ధర్నా చేపట్టారు. జోక్యం చేసుకున్న ఫీల్డ్ ఆఫీసర్ శ్రీనివాస్ మేనేజరు లేని కారణంగా తమకు చెల్లించాల్సిన నగదును వచ్చే మంగళవారం చెల్లించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. వారికి ఏపీ ఎమ్మార్పీఎస్ జిల్లా ఉపాధ్యక్షుడు ఆలుపనపల్లి శ్రీనివాస్ పలువురు మద్దతు తెలిపారు. కార్యక్రమంలో డ్వాక్రా మహిళలు తదితరులు పాల్గొన్నారు.