
భర్త ఇంటి ముందు కల్పన నిరసన
సాక్షి, హైదరాబాద్: భర్త మరో మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకుని తనను, పిల్లలను పట్టించుకోకుండా మానసికంగా వేధిస్తున్నాడని ఆరోపిస్తూ భార్య మహిళా సంఘాల నాయకులతో కలిసి ఇంటి ఎదుట ఆందోళనకు చేపట్టింది. ఈ ఘటన మీర్‌పేట పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. సీఐ మహేందర్‌రెడ్డి తెలిపిన ప్రకారం.. వరంగల్ జిల్లాకు చెందిన దేవులపల్లి వేణుకుమార్ (46), కల్పన (42)కు 18ఏళ్ల క్రితం వివాహమైంది. వీరికి ఒక కుమారుడు, కూతురు సంతానం.
కొంతకాలంగా బడంగ్‌పేట శివనారాయణపురంలో నివాసమున్నారు. వేణుకుమార్ నగరంలోని బ్యాంక్ ఆఫ్ ఇండియాలో క్లర్క్‌గా పనిచేస్తున్నాడు. మూడేళ్లుగా భార్యాభర్తల మధ్య కలహాలు ప్రారంభమయ్యాయి. ఈ క్రమంలో వేణు మరో మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకుని తనను మానసికంగా, శారీరకంగా వేధిస్తున్నాడని భార్య కల్పన ఆరోపిస్తూ గతంలో వరంగల్‌లోని మహిళా పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఈ మేరకు వేణుపై కేసు నమోదు చేయడంతో పాటు కోర్టులో మెయింటెనెన్స్ కేసు నడుస్తోంది.
తనను దూరం పెట్టాలనే ఉద్ధేశంతో మూడేళ్లుగా తనను, తన పిల్లలను పట్టించుకోవడం లేదని కల్పన శుక్రవారం స్థానిక మహిళా సంఘాల నాయకులతో కలిసి శివనారాయణపురంలోని భర్త ఇంటికి వచ్చి బైఠాయించి పోలీసులు, కోర్టు తనకు న్యాయం చేయాలని డిమాండ్ చేసింది. ఈ సంఘటనకు సంబంధించి భార్యాభర్తలిద్దరూ ఫిర్యాదులు చేయగా కేసు విచారిస్తున్నామని సీఐ తెలిపారు.
చదవండి: బిహార్‌లో కల్తీ మద్యం కలకలం.. 11మంది మృతి
Comments
Please login to add a commentAdd a comment