కుటుంబ కలహాలతో మనస్తాపానికి గురైన ఓ యువతి బలవన్మరణానికి పాల్పడింది.
కదిరి టౌన్ / అమడగూరు : కుటుంబ కలహాలతో మనస్తాపానికి గురైన ఓ యువతి బలవన్మరణానికి పాల్పడింది. వివరాలిలా ఉన్నాయి. కదిరి పట్టణంలోని నిజాంవలి కాలనీలో హోటల్ పెట్టుకొని జీవనం సాగిస్తున్న అబ్దుల్ మునాఫ్‌కు ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. మునాఫ్ భార్య బతుకుదెరువు కోసం సౌదీకి వెళ్లి ఇటీవల తిరిగొచ్చింది. తరచూ కుటుంబ కలహాలతో గొడవపడేవారు. కొన్నాâýæ్ల కిందట స్వగ్రామం అమడగూరు మండలం కస్సముద్రంలో వ్యవసాయ పనుల నిమిత్తం కుటుంబ సభ్యులు వెళ్లారు.
ఆదివారం తెల్లవారుజామున మరోసారి ఇంట్లో గొడవ జరిగింది. దీంతో మనస్తాపానికి గురైన రెండో కుమార్తె నగీనా (20) ఇంట్లోనే విషపుద్రావకం తాగింది. అపస్మారకస్థితిలో పడి వున్న ఆమెను కుటుంబ సభ్యులు వెంటనే ఓడీచెరువు పీహెచ్‌సీకి తీసుకెళ్లారు. అక్కడ ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం కదిరి ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించారు. చికిత్స అందించేలోపే నగీనా మృతి చెందింది. కుటుంబ సభ్యులు బోరున విలపించారు. ఇప్పటికే అప్పుల్లో ఉన్న తల్లిదండ్రులు.. తనకు పెళ్లి చేస్తే పీకల్లోతు అప్పుల్లో కూరుకుపోతారని, ఇది ఇష్టం లేకే నగీనా ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని మార్చురీకి తరలించారు.