- నా చావుకు ఎవరూ కారకులు కాదంటూ సూసూడ్ నోట్
- పెళ్లైన రెండున్నరేళ్లకే ఆత్మహత్య చేసుకున్న ఇల్లాలు
- మృతురాలి స్వస్థలం తాడిపత్రి
‘నా చావుకు ఎవరూ కారకులు కాదు. అమ్మా..నాన్న నన్ను క్షమించండి’ అంటూ ఆమె లేఖ రాసి మరీ ఆత్మహత్య చేసుకుంది. ఇది చూసిన తల్లిదండ్రులు తల్లడిల్లిపోయారు. ఉన్న ఒక్కగానొక్క కుమార్తె.. మంచి సంబంధం చూసి పెళ్లి చేసిన రెండున్నరేళ్లు కాకనే ఈ ఘోరం జరిగడంతో వారు దిగ్భ్రాంతికి గురయ్యారు.
- గుంతకల్లు టౌన్
తాడిపత్రికి చెందిన విజయలక్ష్మీ, సుబ్రమణ్యం దంపతుల ఒక్కగానొక్క కుమార్తె లక్ష్మీదీప్తి(25) వివాహం గుంతకల్లులోని ఎస్‌జేసీ హైస్కూల్ రోడ్ ప్రాంతానికి చెందిన కోటా సరస్వతి, మల్లికార్జున దంపతుల కుమారుడు షణ్ముఖతో 2014 డిసెంబర్ 4న ఘనంగా జరిగింది. వారికి ఏడాదిన్నర వయస్సు కలిగిన జాహ్నవి అనే కుమార్తె కూడా ఉంది.
ఏం జరిగిందంటే...
లక్ష్మీదీప్తి రోజులాగే ఆదివారం తెల్లవారుజామునే నిద్రలేచి ఇంటి ముందు కల్లాపిజల్లి ముగ్గులేసేందుకు మిద్దె పై నుంచి కిందకు వచ్చింది. అయితే ఆమె ముగ్గు వేయకుండానే నేరుగా టాయ్‌లెట్‌లోకి వెళ్లి నోట్లో గుడ్డలు పెట్టుకుని ఒంటిపై కిరోసిన్ పోసుకుంది. ఆ తరువాత నిప్పంటించుకుంది. కిటికీల్లో నుంచి వస్తున్న పొగలు చూసి కిందకు పరుగున వచ్చిన భర్త సహా అత్త, మామలు అక్కడి దృశ్యం చూసి నిశ్చేష్టులయ్యారు. అప్పటికే లక్ష్మీదీప్తి మంటలో కాలిపోయి మృతదేమమై పడి ఉంది.
రంగంలోకి పోలీసులు
సమాచారం తెలిపిన వెంటనే అర్బన్ సీఐ రాజా, వన్‌టౌన్ ఎస్‌ఐ నగేష్‌బాబు తమ సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకున్నారు. లక్ష్మీదీప్తి మృతదేహాన్ని పరిశీలించారు. ఆమె రాసి ఉంచిన సూసైడ్ నోట్‌ను స్వాధీనం చేసుకున్నారు. భార్యాభర్తల మధ్య గొడవ వల్లనే ఆమె ఆత్మహత్యకు పాల్పడిందా? లేక అత్తమామల వేధింపుల వల్లే ఈ అఘాయిత్యానికి ఒడిగట్టిందా అనే అంశాలపై పోలీసులు ఆరా తీశారు. కేసు నమోదు చేసుకుని, మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు.
మృతురాలి తల్లిదండ్రులు ఏమంటున్నారంటే...
తాడిపత్రి నుంచి హుటాహుటిన గుంతకల్లుకు వచ్చిన లక్ష్మీదీప్తి తల్లిదండ్రులు విజయ, సుబ్రమణ్యం మాట్లాడుతూ... తమ అల్లుడు, వియ్యంకుడు ఎలాంటి వేధింపులకు పాల్పడలేదన్నారు. తమ కూతురు ఎందుకింత దారుణానికి ఒడిగట్టిందో అంతు చిక్కడం లేదని విలపించారు. వేరు కాపురం పెట్టాలని తమ కూతురు అడిగిందని, సర్దుకుపోవాలని తామే పదిహేను రోజుల కింద కూతురికి నచ్చచెప్పామన్నారు. అంతలోనే ఈ ఘోరం జరిగిపోయిందని వాపోయారు. మృతురాలి తల్లిదండ్రులను రెవెన్యూ అధికారులు విచారించారు.
అమ్మా, నాన్నా.. నన్ను క్షమించండి !
Published Sun, May 28 2017 11:59 PM | Last Updated on Tue, Sep 5 2017 12:13 PM
Advertisement