
సీఎం కొడుకు కదా.. కష్టాన్ని చెబితే..
♦ డ్వాక్రా రుణమాఫీ ఎప్పుడు చేస్తారు?
♦ వైఎస్సార్ జిల్లాలో మంత్రి లోకేశ్‌ను నిలదీసిన మహిళలు
♦ మీరే బ్యాంకులకు కట్టొదన్నారు.. ఇప్పుడు వడ్డీ భారంగా మారింది
♦ కూలీనాలీ చేసి కట్టాల్సి వస్తోందని ఆవేదన.. దాటవేసిన లోకేశ్
♦ మైదుకూరులో అగ్రిగోల్డ్ బాధితుల నిరసన
మంత్రి లోకేశ్ బుధవారం కమలాపురం, మైదుకూరు నియోజకవర్గాల్లో పలు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. పలుచోట్ల ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి గురించి అడుగుతూ వస్తున్న లోకేశ్‌కు డ్వాక్రా మహిళల రూపంలో చేదు అనుభవం ఎదురైంది. వల్లూరు మండలం తప్పెట్ల, పెద్దపుత్త గ్రామాల్లో మహిళలు.. డ్వాక్రా రుణాలు మాఫీ కాక వడ్డీ భారం పెరిగిందని.. భారంగా కడుతున్నామని, చివరకు వడ్డీలేని రుణాలూ అందించలేకపోతున్నారని ప్రశ్నించారు.
రుణ మాఫీ చేయకపోగా, రూ.10 వేల అప్పు నిధి సరిగా ఇవ్వలేదని నిలదీశారు. ఇప్పుడే అధికారులతో మాట్లాడుతానంటూ మంత్రి అక్కడి నుంచి జారుకున్నారు. మైదుకూరు నియోజకవర్గంలోని ఖాజీపేట, మైదుకూరు, దువ్వూరు మండలాల్లో మంత్రి లోకేశ్‌కు అగ్రిగోల్డ్ బాధితుల నుంచి నిరసన వ్యక్తమైంది. ఖాజీపేటలో కాన్వాయ్‌ని అడుకోగా, మైదుకూరు నాలుగు రోడ్లు కూడలిలో నోటికి నల్ల రిబ్బన్ కట్టుకుని, ప్లకార్డులతో నిరసన తెలిపారు. అగ్రిగోల్డ్ వ్యవహారంపై విచారణ జరుగుతోందని, బాధితులకు న్యాయం చేస్తామన్నారు.
మాఫీ ఎప్పుడు చేస్తారు?: మంత్రి లోకేశ్ బుధవారం రాత్రి 7 గంటలకు మైదుకూరు నియోజకవర్గం ఖాజీపేట మండలం తవ్వారుపల్లెకు చేరుకుని రోడ్డుపై ఉన్న పలువురిని పలుకరించారు. ఈ సందర్భంగా బీసీకాలనీకి చెందిన కొండమ్మ అనే మహిళ డ్వాక్రా రుణాలపై ప్రశ్నించారు. ‘మీరేమో మా అప్పు మాఫీ చేస్తామని ఇంతవరకు పట్టించుకోలేదు. బ్యాంకు సార్లు నెలనెల కడితేనే సరి..లేకపోతే నోటీసులు ఇచ్చే పరిస్థితి. ఇలాంటి పరిస్థితులతో కొట్టుమిట్టాడుతున్నా మీరేమో పట్టించుకోలేదు. ఎన్నిరోజులు ఇలా అగచాట్లు పడాలో తెలియదు. మాఫీ అన్నారు.. ఏమి చేశారో తెలియ లేదు’ అని నిలదీయడంతో ఏం చేయాలో పాలుపోని లోకేశ్.. గ్రూపులో ఒక్కొక్కరికి రూ.6 వేలు చొప్పున ఇచ్చాం కదా అని సర్ధి చెప్పబోయారు. ‘అది కాదు.. నేను అడుగుతున్నది రుణ మాఫీ’ అని అమె మరోమారు రెట్టించి అడిగింది.
సీఎం కొడుకు కదా.. కష్టాన్ని చెబితే మాఫీ చేస్తారని..
నా పేరు కొండమ్మ. మా ఆయన పేరు చిన్నహుస్సేన్. మాకు ఎకరా పొలం ఉంది. కూలి పనులు చేసుకుంటున్నాం. మా పెద్ద కుమారుడిని కువైట్‌కు పంపించాం. కొద్దిరోజులకు చనిపోయాడు. ప్రస్తుతం చిన్నకొడుకు బేల్దారి పని చేసుకుంటూ జీవిస్తున్నాడు. 2008 నుంచి డ్వాక్రా గ్రూపులో ఉన్నాం. 2013లో మదీన గ్రూపు పేరుతో రూ.2.50 లక్షలు అప్పు తీసుకున్నాం. తర్వాత 2015లో కూడా రూ.5 లక్షల రుణం ఖాజీపేట సిండికేట్ బ్యాంకులో తెచ్చుకుని కంతులను చెల్లిస్తున్నాం. నెలకు రూ.1,500 చొప్పున గ్రూపులో ఒక్కొక్కరం కడుతున్నాం. డ్వాక్రా సొమ్మొంతా మాఫీ అవుతుందిలే అనుకున్నాం. ఇంతవరకు మాఫీ కాలేదు. పైగా నెలనెలా వడ్డీతో కలుపుకొని కంతులు కట్టడం కష్టంగా మారింది. సీఎం కొడుకు వస్తున్నాడని తెలియడంతో మా గోడును ఆయనకైనా చెబితే మాఫీ చేస్తారేమోనని ఇక్కడికి వచ్చాం. పెద్దోళ్లు కదా.. మాఫీ చేస్తారేమోనని ఆశతో అడిగాను.