కోడలు దిద్దిన కాపురం
♦ కన్నీటిని దిగమింగి.. కష్టాలకు ఎదురొడ్డి..
♦ ఆ కుటుంబానికి అత్తాకోడళ్లే పెద్ద దిక్కు
♦ ‘సాగు’తోన్న సంసారం ఎందరికో ఆదర్శం
♦ అత్తాకోడళ్ల జీవన యానం
వర్గల్: అత్తాకోడళ్లు కలిసికట్టుగా సాగారు... కాపురం నిలబెట్టారు. ఇంటి పెద్దల్లో ఒకరు మరణించగా.. మరొకరు మంచాన పడ్డారు. ఆడవాళ్లం మేమేం చేయగలం అని వారు చేతులెత్తేయలేదు. ఆత్మస్థైర్యాన్ని కోల్పోలేదు. ఇద్దరు కలిసి కష్టపడి వ్యవసాయం చేస్తూ కుటుంబాన్ని నెట్టుకొస్తూ ఆదర్శంగా నిలిచారు.
వర్గల్ మండలం సింగాయపల్లికి చెందిన రైతు టేకులపల్లి మల్లారెడ్డి-నర్సమ్మ దంపతులు. కొడుకు గోపాల్‌రెడ్డి, కోడలు సంతోష, మనవరాలు నవ్య, మనవడు అరవింద్ ఉ న్నారు. ఈ కుటుంబానికి వ్యవసాయమే ఆధా రం. సాఫీగా సాగుతున్న వీరి కుటుంబంలో సంతోష భర్త గోపాల్‌రెడ్డి అకాల మరణంతో ఒక్కసారిగా విషాదం అలుముకుంది. ఏ మా త్రం నెరవని సంతోష అత్తామామలతో కలిసి పొలంబాట పట్టింది. మరో మూడేళ్లు గడిచిందో లేదో ఇంటి పెద్దగా ఉన్న మామ మల్లారెడ్డి తీవ్ర అనారోగ్యంతో మంచానికే పరిమితమయ్యాడు. దీంతో అత్తాకోడళ్లు మరోసారి కష్టాలు ఎదురయ్యాయి. అయినా వాటికి ఎదురొడ్డి నిలిచారు. అత్తాకోడళ్లు కలిసి రెండెకరాల్లో కూరగాయ పంటలు సాగు చేయడం దినచర్యగా మార్చుకున్నారు. పురుషులకు దీటుగా ‘బంగారు’ పంటలు పండిస్తూ ఆ అత్తాకోడళ్లు గౌరవప్రదమైన జీవితాన్ని గడుపుతున్నారు. మరోవైపు తీరిక దొరికితే చాలు కోడలు సంతోష బీడీలు చుడుతూ అదనపు ఆదాయాన్ని సమకూర్చుకుంటుంది.
పుట్టెడు కష్టాలు ఎదురైనా..
నా పిల్లలు ఐదేళ్లలోపు వయసు ఉన్నప్పుడే ఆ దేవుడు నా భర్త గోపాల్‌రెడ్డిని దూరం చేశాడు. మా కుటుంబం ఒక్కసారిగా కష్టాల్లో కూరుకుపోయింది. ఆ తరువాత మూడేండ్లకు మామ మల్లారెడ్డి ఆరోగ్యం దెబ్బతిన్నది. నేనూ, మా అత్త కష్టం చేస్తే తప్ప కుటుంబం గడవని పరిస్థితి. చిన్నపిల్లలు బెంగటిల్లొద్దని ఎవుసం బరువు బాధ్యతలు అత్తాకోడళ్లం నెత్తినెత్తుకున్నం. రెండెకరాల పొలానికి నీటి సవులత్ ఉన్నది. కాలం బట్టి మిర్చి, ఆలుగడ్డ, గుమ్మడి, కీర పంటలు వేసుకుంటున్నం. డ్రిప్ పెట్టుకున్నం. మిగతా రెండెకరాలల్ల పునాస పంటలు వేస్తం. నాకు వీలైనపుడు బీడీలు కూడా చేస్తుంట. మా కష్టం ఎన్నడు వృథా కాలేదు. మంచి దిగుబడి సాధించినం. పిల్లలకు తండ్రి లేని లోటు లేకుండ చూసుకుంటున్న. - సంతోష
కీర, మిరప వేసినం...
మాకున్న నాలుగెకరాలల్ల రెండెకరాలకు నీళ్ల సవులత్ ఉన్నది. కాలం ఎన్కకుపోయింది. దీంతోని బోరు బాయిల నీళ్లు ఎకరానికే సరిపోతున్నయ్. పంట పండితెనే పిల్లలకు చదువులు, కుటుంబం గడుస్తది. ఎకరం భూమిల అద్దెకరం కీర, అద్దెకరంల మిర్చి వేసుకున్నం. ఇపుడు పూత దశకొచ్చింది. అత్తాకోడళ్లం శేనుకాడనె పంట పనుల్లో మునిగి తేలుతం. కరువుల సైతం మంచి పంట దిగుబడి తెచ్చినం. సర్కారు గింత సాయం చేస్తె ఎకరంల పందిరి వేసుకుంటం. భూమిని నమ్ముకున్నోళ్లు ఎన్నడు చెడిపోరు.
- నర్సమ్మ (అత్త)