నాట్యమంటే ప్రాణం
నాట్యమంటే ప్రాణం
Published Thu, Dec 8 2016 10:42 PM | Last Updated on Mon, Sep 4 2017 10:14 PM
కాకినాడ కల్చరల్ : వండర్ బుక్ ఆఫ్ రికార్డు అవార్డు, జీనియస్ అవార్డులు సాధించిన స్థానిక జగన్నాథపురానికి చెందిన మోకాన మహాలక్ష్మి నృత్యమే శ్వాస అన్నారు. తాను నేర్చుకొన్న నృత్యాన్ని పదిమందికి పంచి కళామాతల్లి రుణం తీర్చుకుంటున్నారు. సూర్య నృత్యనికేతన్ ఏర్పాటు చేసి నృత్యంపై ఆసక్తి ఉన్న పేద విద్యార్థులను గుర్తించి కూచిపూడి నృత్యంలో శిక్షణ ఇస్తూ ప్రదర్శనలు ఏర్పాటు చేస్తున్నారు. ఈమె కూచిపూడి నృత్యం రంగంలో సేవలకు గుర్తింపుగా పలు అవార్డులు అందుకున్నారు. ఈమె కంచెర్ల వీరభద్రరావు, జయలక్ష్మి ద్వితీయ పుత్రిక, చిన్నప్పటి నుంచి ఆమెకు నృత్యంపై ఉన్న ఆసక్తిని తల్లిదండ్రులు గుర్తించి ప్రముఖ నాట్యాచార్యులు ఎంవీ రమణ వద్ద శిక్షణ ఇప్పించారు. అక్కడ నాట్యంలో మెళకువలు నేర్చుకొని అంచలంచెలుగా ఎదిగి సూర్య నృత్య నికేతన్ స్థాపించారు. కాకినాడలో నాలుగు బ్రాంచీలు, ద్రాక్షారామ, నడకుదురు, కరప, ఇంజరం ఇలా మొత్తం ఎనిమిది చోట్ల çసుమారు 300 మందికి ఆమె శిక్షణ ఇస్తున్నారు. 1998–2000లో తిరుపతి శ్రీవిద్యా నికేతన్‌లో శిక్షకురాలుగా పని చేసిన మహాలక్ష్మి తన 21వ ఏటనే ప్రముఖ నటుడు డాక్టర్ ఎం.మోమాన్‌బాబు జన్మదిన వేడుకల్లో అనేక మంది సినీ అర్టిస్టుల సమక్షంలో విద్యార్థులతో శివతాండవం చేయించి మన్నలు పొందారు. ఈ సందర్భంతో సినీ హిరో రజనీకాంత్, మోమాన్‌బాబు ఆమెను ప్రత్యేకంగా అభినందించారు. కూచిపూడి గ్రామంలోను పలు చోట్ల విద్యార్థులతో ప్రదర్శనలు ఇచ్చి మన్నలు పొందారు. తాను జీవించినంత కాలం నాట్యం పదిమందికి నేర్పాలనే తపనతో జీవిస్తున్నానని వండర్ బుక్ ఆఫ్ రికార్డు అవార్డు, జీనియస్ అవార్డుల ప్రధానంతో తన బాధ్యత మరింత పెరిగిందని మహాలక్ష్మి చెబుతున్నారు.
Advertisement