పొలాల్లో జీవచ్ఛవంలా..
♦ అందోలు పొలాల్లో ప్రాణాపాయ స్థితిలో వృద్ధురాలు
♦ ఆస్పత్రికి తరలించిన యువకులు..
♦ పెద్దాపూర్ వాసిగా గుర్తింపు
♦ ‘వాట్సాప్’తో వివరాలు వెలుగులోకి..
జోగిపేట: కన్నవారే పిల్లలకు బరువవుతున్న ఈ రోజుల్లో.. పొలాల్లో చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్న వృద్ధురాలిని చెందిన కొందరు యువకులు చేరదీశారు. ఈ సంఘటన అందోలు గ్రామంలో ఆదివారం జరిగింది. గ్రామ శివారులోని పొలాల మధ్య దాదాపు నిర్జీవ స్థితిలో ఉన్న సుమారు 65 ఏళ్ల మహిళను స్థానిక వీహెచ్‌పీకి చెందిన యువకులు గుర్తించారు. తక్షణమే అంబులెన్స్‌కు సమాచారం అందించారు. పొలాల వద్దకు అంబులెన్స్ రావడం కష్టమవడంతో స్టెచర్‌పై తీసుకెళ్లారు. నేరుగా ప్రభుత్వాస్పత్రికి తరలించారు. వృద్ధురాలికి దుస్తులు కూడా సరిగా లేకపోవడంతో చీర తెప్పించి, కట్టించారు. చికిత్స తర్వాత అల్పాహారం తీసుకున్న ఆమె.. యువకులకు చేతులెత్తి దండం పెట్టింది. దీంతో అక్కడివాళ్ల కళ్లు చమర్చాయి.
శవంగా భావించిన గ్రామస్తులు
అందోలు కొటాల బైపాస్ ఏరియాలో దూరంగా పడి ఉన్న వృద్ధురాలిని చూసి.. ఎవరో హత్య చేసి ఉంటారని స్థానిక మహిళలు మాట్లాడుకున్నారు. విషయం తెలుసుకున్న విశ్వహిందూ పరిషత్ యువకులు అక్కడికి చేరుకొని వృద్ధురాలిని రక్షించారు.
వాట్సాప్ ద్వారా ఆచూకీ
చికిత్స అనంతరం తేరుకున్న వృద్ధురాలు తన పేరు బాలమ్మ అని, తనది అల్లాదుర్గం మండలం పెద్దాపూర్ గ్రామంగా చెప్పింది. తనకు శ్రీశైలం, మొగులయ్య కుమారులు ఉన్నారని తెలిపింది. సమాచారం తెలుసుకున్న యువకులు.. వారి కుటుంబ సభ్యులను గుర్తించేందుకు వృద్ధురాలి ఫొటోను పెద్దాపూర్‌కు చెందిన శంకర్ అనే జోగిపేట డిగ్రీ విద్యార్థికి వాట్సాప్ చేశారు. గ్రామంలోని కొందరికి ఆ ఫొటో చూపడంతో ఆమె చాకలి బాలమ్మగా గుర్తించారు. 2 రోజులుగా తమ తల్లి కనిపించకపోవడంతో వెతుకుతున్నామని కుమారులు తెలిపారు. జోగిపేటలో బాలమ్మ కుమార్తె ఉంటుందని తెలిసింది. వృద్ధురాలి విషయంలో అందోలుకు చెందిన యువత మానవత్వాన్ని చాటడంతో పలువురు అభినందించారు.