
ఒకరిని ప్రేమించి మరో అమ్మాయితో...
తనను ప్రేమించి...మరో అమ్మాయితో ప్రియుడు పెళ్లికి సిద్ధపడ్డాడనే బాధతో ప్రియురాలు ఆత్మహత్యాయత్నానికి
పార్వతీపురం : తనను ప్రేమించి...మరో అమ్మాయితో ప్రియుడు పెళ్లికి సిద్ధపడ్డాడనే బాధతో ప్రియురాలు ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన సంఘటన కొమరాడ మండలం కొట్టు గ్రామంలో గురువారం చోటు చేసుకుంది. దీనికి సంబంధించి బాధితురాలి కుటుంబ సభ్యులు అందించిన వివరాలిలా ఉన్నాయి.
కొమరాడ మండలం కొట్టు గ్రామానికి చెందిన కలమటి రాణి అదే గ్రామంలో విద్యుత్ కార్యాలయంలో పనిచేస్తున్న కొల్లి పృథ్వి మూడేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. అయితే కులాలు వేరు కావడంతో పృథ్వి కుటుంబ సభ్యులు వీరి పెళ్లికి నిరాకరించారు. పైగా ఈ నెల 20న మరో యువతితో పెళ్లి చేసేందుకు పృథ్వి కుటుంబ సభ్యులు ఏర్పాట్లు చేస్తున్నారు.
ఈ విషయం తెలిసిన రాణి పెళ్లి విషయమై పృథ్విని నిలదీయగా, కుటుంబ సభ్యుల ఒత్తిడి మేరకే పెళ్లి చేసుకుంటున్నానని చెప్పాడు. పైగా పెళ్లి అయిన తర్వాత ఇద్దరం వెళ్లిపోదామని తెలిపాడు. ఈ ప్రతిపాదన నచ్చని రాణి గురువారం సాయంత్రం నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. కుటుంబ సభ్యులు కురుపాం ఆస్పత్రికి తరలించగా ప్రథమ చికిత్స అనంతరం ఆమెను పార్వతీపురం ఏరియూ ఆస్పత్రికి తరలించారు.