విద్యుత్ షాక్‌తో వ్యవసాయ కూలీ మృతి
మృతదేహంతో బాధితుల రాస్తారోకో
అధికారుల నిర్లక్ష్యం అంటూ ఆరోపణ
గంపలగూడెం :
మండలంలోని గాదెవారిగూడేనికి చెందిన వ్యవసాయ కూలీ గాదె నాగరాజు (35) విద్యుదాఘాతంతో బు«ధవారం మృతి చెందాడు. విద్యుత్‌శాఖ అధికారుల నిర్లక్ష్యవైఖరి కారణంగా నాగరాజు చనిపోయాడని ఆరోపిస్తూ బాధిత కుటుంబ సభ్యులు, బంధువులు, గ్రామస్తులు తిరువూరు–మధిర ఆర్‌అండ్‌బీ ప్రధాన రహదారిపై గంపలగూడెం విద్యుత్‌సబ్‌స్టేషన్ ఎదుట మృతదేహాన్ని ఉంచి రాస్తారోకో నిర్వహించారు. దీంతో రాకపోకలకు ఆటంకలం ఏర్పడింది. స్థానికుల కథనం ప్రకారం.. గాదె నాగరాజు మిరప మొక్కలు నాటేందుకు పనికి వెళ్లాడు. మధ్యాహ్న సమయంలో గాదె వెంకటేశ్వరరావు పొలంలో ఉన్న విద్యుత్ స్తంభానికి ఏర్పాటు చేసిన సపోర్టు వైరును పట్టుకొన్నాడు. వైరుకు విద్యుత్ ప్రసారం అవుతుండటంతో నాగరాజు షాక్ తగిలి అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడికి భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు.
బంధువుల ఆందోళన
విద్యుత్ అధికారుల నిర్లక్ష్యంతోనే నాగరాజు మృతి చెందాడని ఆరోపిస్తూ మృతదేహాన్ని తీసుకువచ్చి తిరువూరు–మధిర ర హదారిపై ఉంచి ఆందోళన చేశారు. ఘటనకు అధికారులు పూర్తి బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. ఎస్‌ఐ శివశంకర్ అక్కడకు చేరుకొని ఆందోళన కారులు, విద్యుత్‌శాఖ అధికారులతో మాట్లాడి ఆందోళనను విరమింపజేశారు. ప్రభుత్వపరంగా వచ్చే నష్టపరిహారం చెల్లిస్తామని అధికారులు హామీ ఇచ్చారు. మృతుడి భార్య గాదె రాజేశ్వరి ఇచ్చిన ఫిర్యాదు మేర కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ తెలిపారు.