హద్దు మీరితే నాన్ బెయిలబుల్ కేసులు
- నూతన సంవత్సర వేడుకలపై ఎస్పీ హెచ్చరిక
కర్నూలు: నూతన సంవత్సర వేడుకల్లో హద్దుమీరి ప్రవర్తిస్తే కఠిన చర్యలు తప్పవని ఎస్పీ ఆకే రవికృష్ణ మంగళవారం ఒక ప్రకటనలో హెచ్చరించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా గట్టి పోలీసు బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. నూతన సంవత్సర వేడుకల సందర్భంగా విద్యార్థులు, యువకులు ద్విచక్ర వాహనాలకు సైలెన్సర్లు తొలగించి శబ్దాలు చేస్తూ నడపడం, రహదారులపై ఫీట్లు, రేసులు నిర్వహించడాన్ని పోలీసు శాఖ తీవ్రంగా పరిగణిస్తుందన్నారు. మద్యం తాగి వాహనాలు నడుపుతూ ఇతర వాహన చోదకులకు, మహిళలకు, ప్రజలకు ఇబ్బందులు కలుగజేసే విధంగా వ్యవహరిస్తే నాన్‌బెయిలబుల్ సెక్షన్ల కింద కేసులు నమోదు చేస్తామన్నారు.
డీఎస్పీ కార్యాలయం ఆకస్మిక తనిఖీ
వార్షిక తనిఖీలో భాగంగా మంగళవారం నగరంలోని కర్నూలు సబ్ డివిజన్ కార్యాలయాన్ని ఎస్పీ తనిఖీ చేశారు. ఓరల్ ఎంక్వైరీలు, క్రైం చాప్టర్, క్రైం రేటుకు సంబంధించిన సబ్ డివిజన్ కార్యాలయ ఫైళ్లను పరిశీలించారు. ప్రాపర్టీ క్రైం, చైన్ స్నాచింగ్ నేరాల రేటు తగ్గే విధంగా చర్యలు చేపట్టాలని డీఎస్పీ రమణమూర్తికి సూచించారు. రాత్రి గస్తీలలో ఈ–బీట్ విధానం అమలయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు.