
రేణిగుంట చేరుకున్న వైఎస్ జగన్
తిరుపతి: వైస్సార్‌సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి గురువారం ఉదయం తిరుపతిలోని రేణిగుంటకు చేరుకున్నారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్‌కు వైఎస్‌ఆర్‌సీపీ నేతలు, కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు. రేణిగుంట నుంచి ఆయన నెల్లూరు జిల్లాకు బయల్దేరారు. టీడీపీ ప్రభుత్వం అక్రమంగా కేసుల్లో ఇరికించిన ఫలితంగా నెల్లూరు జైలులో జ్యుడీషియల్ కస్టడీలో ఉన్న రాజంపేట ఎంపీ పీవీ మిథున్‌రెడ్డి, చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, వైఎస్‌ఆర్‌సీపీ నేత బియ్యపు మధుసూదన్‌రెడ్డిలను వైఎస్ జగన్ పరామర్శించనున్నారు.
గత నవంబర్ 26వ తేదీన రేణిగుంట విమానాశ్రయ అధికారిని ప్రయాణికుల తరపున ప్రశ్నించినందుకు, ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాల మేరకు ఎంపీ మిథున్‌రెడ్డిపై పోలీసులు అక్రమంగా కేసు పెట్టి సోమవారం అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ఇక చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డిని సమైక్యాంధ్ర ఉద్యమంలో నమోదైన కేసులో రైల్వే పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు.
వీరిని కలుసుకుని పరామర్శించేందుకు జగన్ ఉదయం ఎనిమిది గంటలకు హైదరాబాద్ నుంచి విమానంలో బయలుదేరి తిరుపతికి చేరుకున్నారు. అక్కడినుంచి రోడ్డు మార్గాన నేరుగా నెల్లూరు కేంద్ర జైలుకు వెళ్లి ఈ ముగ్గురు నాయకులను కలిసి వైఎస్ జగన్ పరామర్శించనున్నారు.