
ఏ పంట వేసినా నష్టాలే: జగన్
‘పోలవరం ప్రాజెక్ట్ కోసం మీరు త్యాగం చేస్తున్నారు.. మీకు జరిగిన అన్యాయంపై మీరడిగేది న్యాయమేకదన్నా.. అత్యాశ కాదు.. సమంజసంగానే అడుగుతున్నారు..
అన్నివిధాలా న్యాయం జరిగేలా చూస్తా..
వేలేరుపాడు : ‘పోలవరం ప్రాజెక్ట్ కోసం మీరు త్యాగం చేస్తున్నారు.. మీకు జరిగిన అన్యాయంపై మీరడిగేది న్యాయమేకదన్నా.. అత్యాశ కాదు.. సమంజసంగానే అడుగుతున్నారు.. మీ కోర్కెలు ఎవరూ కాదనలేరు.. పాలకులపై ఒత్తిడి తెచ్చి.. మీకు అన్ని విధాలుగా న్యాయం జరిగేలా చూస్తా..’ అంటూ వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నిర్వాసిత రైతులకు భరోసా ఇచ్చారు. తమ సమస్యలు తీర్చాలని కుక్కునూరులో 17 రోజులుగా వారు నిర్వహిస్తున్న రిలే నిరాహార దీక్ష శిబిరాన్ని ఆయన సందర్శించి సమస్యలు అడిగి తెలుసుకున్నారు.
సాక్షి ప్రత్యేక ప్రతినిధి, జంగారెడ్డిగూడెం: ‘‘రాష్ట్రంలో పొగాకు రైతులు అతి దారుణమైన పరిస్థితుల్లో బతుకుతున్నారు. ఏ పంట కూ మద్దతు ధర రావడం లేదు. వరి దగ్గర నుంచి పామాయిల్, పొగాకు దాకా సాగు చేసినా రైతన్నలకు నష్టాలే మిగులుతున్నాయి. కోనసీమలో రైతులు పంట విరామం(క్రాప్ హాలిడే) ప్రకటిస్తామంటున్నారు. పంటలకు మద్దతు ధర దక్కడం లేదని ధర్నా చేస్తామన్న అన్నదాతలను సాక్షాత్తూ హోంమంత్రే హెచ్చరించారు. ఇంతకంటే దారుణం ఉంటుందా?’’ అని వైఎస్ జగన్ నిప్పులు చెరిగారు. ఆయన బుధవారం పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెంలోని 1వ పొగాకు వేలం కేంద్రాన్ని సందర్శించారు. పొగాకు రైతులతో మాట్లాడారు. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం అక్కడే ఏర్పాటు చేసిన సభలో ప్రసంగించారు.
అధైర్యపడవద్దు..
జీలుగుమిల్లి : ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవడం చేతగాని సీఎం చంద్రబాబు డ్వాక్రా మహిళలకు కోర్టు నుంచి నోటీసులు పంపించడంపై జగన్ మండిపడ్డారు. జీలుగుమిల్లి మండలానికి వచ్చిన వైఎస్ జగన్‌ను లక్ష్మీపురం, జీలుగుమిల్లి, తాటియాకులగూడెం గ్రామాల్లో డ్వాక్రా మహిళలు కలిశారు. రుణమాఫీ చేయకపోగా తమకు లీగల్ నోటీసులు ఇస్తున్నారని వాపోయారు. దీనిపై జగన్ స్పందిస్తూ.. చంద్రబాబు ఇచ్చిన హామీలు నిలబెట్టకోకుండా డ్వాక్రా మహిళలను మోసగించారని, అక్కడితో ఆగకుండా కోర్టుల నుంచి నోటీసులు ఇవ్వడం చాలా దారుణమని అన్నారు. డ్వాక్రా మహిళలెవరూ అధైర్యపడవద్దని, వారందరికీ తాను అండగా ఉంటానని అభయమిచ్చారు.