జల పోరు.. జన ఉప్పెన
- హిందూపురంలో తాగునీటి సమస్యపై జనాగ్రహం
- ఖాళీబిందెలతో రోడ్డెక్కిన మహిళలు
- వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ, రాస్తారోకో
- ఎమ్మెల్యే బాలకృష్ణ, మునిసిపల్ చైర్‌పర్సన్ పేర్లతో దున్నపోతుల ప్రదర్శన
- పోలీసుల లాఠీచార్జ్.. ప్రతిఘటించిన ఆందోళనకారులు
హిందూపురం అర్బన్ : ముఖ్యమంత్రి చంద్రబాబు వియ్యంకుడు, సినీనటుడు నందమూర్తి బాలకృష్ణ ప్రాతినిథ్యం వహిస్తున్న హిందూపురంలో తాగునీటి సమస్య రోజురోజుకూ జఠిలమవుతుండటంతో ప్రజలు రోడ్డుపైకి వచ్చారు. ముఖ్యంగా మహిళలు భారీసంఖ్యలో తరలివచ్చి ఖాళీబిందెలతో నిరసన వ్యక్తం చేశారు. సమస్యను పరిష్కరించాల్సిçన ఎమ్మెల్యే బాలకృష్ణ ఆరు నెలలుగా నియోజకవర్గం వైపు కన్నెత్తి చూడటం లేదని, మునిసిపల్ చైర్‌పర్సన్ లక్ష్మి కూడా పట్టించుకోవడం లేదని వారు మండిపడ్డారు. ముందుగా వైఎస్సార్‌సీపీ నియోజకవర్గ సమన్వయకర్త నవీన్‌నిశ్చల్ ఆధ్వర్యంలో పట్టణంలోని అన్ని వార్డుల నుంచి మహిళలు వేలాదిగా ఖాళీ బిందెలతో తరలివచ్చారు.
స్థానిక చిన్న మార్కెట్ వద్ద నుంచి ఫ్లకార్డులు, బ్యానర్లు పట్టుకుని.. ఖాళీ బిందెలను తలపెట్టుకుని.. నీళ్లు ఇవ్వాలంటూ ర్యాలీగా బయలుదేరారు. ప్రజలకు నీళ్లు కూడా ఇవ్వలేని ఎమ్మెల్యే బాలకృష్ణ, టీడీపీ ప్రభుత్వం డౌన్‌డౌన్ అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ర్యాలీలోకి కొందరు వ్యక్తులు ఎమ్మెల్యే బాలకృష్ణ, మునిసిపల్ చైర్‌పర్సన్ రావిళ్ల లక్ష్మి, టీడీపీ ప్రభుత్వం అని రాసివున్న దున్నపోతులను తీసుకొచ్చారు. పోలీసులు వారిపై విరుచుకుపడ్డారు. అడ్డుకున్న ఆందోళకారులపైనా లాఠీచార్జ్ చేశారు. దీంతో ఆందోళనకారులు, పోలీసుల మధ్య తోపులాట జరిగింది. పోలీసులు కల్పించుకోవడంతో శాంతియుతంగా జరుగుతున్న ర్యాలీ కాస్త ఉద్రిక్తంగా మారింది.
ఈ సందర్భంగా సమన్వయకర్త నవీన్‌నిశ్చల్ మాట్లాడుతూ టీడీపీ నాయకుల డైరెక‌్షన్‌లో పోలీసులు జులుం చేయడం సరికాదన్నారు. అనంతరం గాంధీసర్కిల్, అంబేడ్కర్ సర్కిల్ మీదుగా సద్భావన సర్కిల్ వరకు ర్యాలీ చేపట్టారు. అక్కడ మిట్ట మ««ధ్యాహ్నం మండుటెండలోనే మహిళలు, పట్టణవాసులు, వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు బైఠాయించారు. బిందెలు తలపై పెట్టుకుని తాగడానికి నీళ్లు ఇవ్వలేని ప్రభుత్వం, ఎమ్మెల్యే గద్దె దిగిపోవాలని డిమాండ్ చేశారు. పోలీసులు మళ్లీ ఆందోళనకారులను వెనక్కు తోయసాగారు. దీంతో మరోసారి ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. వన్‌టౌన్ ఎస్‌ఐ దిలీప్‌కుమార్‌తో నవీన్‌నిశ్చల్ వాగ్వాదానికి దిగారు. పార్టీ ప్రచార రథాన్ని తీసేయాలని పోలీసులు చుట్టుముట్టగా... తీసేది లేదంటూ ఆందోళనకారులు అడ్డుపడ్డారు. పోలీసులు వారిని పక్కకు లాగేసి రథాన్ని తొలగించారు. ఇంతలో మునిసిపల్ డీఈ వన్నూరప్ప వచ్చి çసర్ది చెప్పడానికి ప్రయత్నించారు. నవీన్‌నిశ్చల్ ఆయనపై మండిపడ్డారు. తాగడానికి నీళ్లు కూడా ఇవ్వలేని మీరు ఏం చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. మునిసిపల్ కమిషనర్ రాకుండా దాక్కున్నారా అంటూ నిలదీశారు. తాగునీటి ట్యాంకర్ల పేరిట చైర్‌పర్సన్, అధికార పార్టీ కౌన్సిలర్లు దోచుకోవడం తప్ప ప్రజలకు చేసిందేమిటని ప్రశ్నించారు.
నీటి కష్టాలు బాలయ్యకు కన్పించలేదా?
టీడీపీ పాలనలో ప్రజలకు కూడు, నీరు, నీడ దొరకడం లేదని హిందూపురం నియోజకవర్గ వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త నవీన్‌నిశ్చల్ ఆవేదన వ్యక్తం చేశారు. పట్టణంలో పెరిగిన జనాభాకు అనుగుణంగా నీళ్లు అందివ్వలేదన్నారు. బాలకృష్ణ ఆరు నెలలకు ఓసారి చుట్టపు చూపుగా వచ్చి బాత్‌రూంలు, లైటింగ్ ప్రారంభోత్సవాలు చేసి వెళ్లిపోతున్నారని ఎద్దేవా చేశారు. వేసవి ఆరంభంలోనే ప్రజలు నీటికోసం అల్లాడిపోతున్నా పట్టించుకునే నాథులే లేరన్నారు. మునిసిపల్ చైర్‌పర్సన్, అధికార పార్టీ కౌన్సిలర్లు నీటి సరఫరాలోనూ నీచమైన రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. బినామీ పేర్లతో ట్యాంకర్లు పెట్టి అధిక ట్రిప్పులు పంపినట్లు రాసుకుని జేబులు నింపుకుంటున్నారని దుయ్యబట్టారు.
ప్రజల దాహార్తి తీర్చాలని తాము అడుగుతున్నా గుడ్డి, చెవిటి ప్రభుత్వానికి పట్టడం లేదన్నారు. అధికార పార్టీ తొత్తులుగా ఉన్న పోలీసులు «ప్రజా ధర్నాను నిర్వీర్యం చేయడానికి ప్రయత్నించడం దారుణమన్నారు. హంద్రీ-నీవా ప్రాజెక్టును పూర్తి చేసి నియోజకవర్గంలోని ప్రతి చెరువుకు నీరు నింçపి తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని డిమాండ్ చేశారు. ఈ నిరసన నాంది మాత్రమేనని, ఇప్పటికీ స్పందించకుంటే త్వరలోనే పెద్దఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు. కార్యక్రమంలో రాష్ట్ర యువజన ప్రధాన కార్యదర్శి ప్రశాంత్‌గౌడ్, పట్టణ ఏ బ్లాక్ కన్వీనర్ ఈర్షద్, జిల్లా కార్యదర్శి ఫజులూ రెహమన్, కౌన్సిల్ ఫ్లోర్ లీడర్ శివ, డిప్యూటీ ఫ్లోర్ లీడర్ షాజియా, కౌన్సిలర్లు, నాయకులు పాల్గొన్నారు.