రాజమహేంద్రవరం : 'దళితుడిగా పుట్టాలని ఎవరు కోరుకుంటారు' అన్న ముఖ్యమంత్రి చంద్రబాబు మాటల్ని నిజం చేస్తూ గ్రామాల్లో దళితులపై దాడులు పెరుగుతున్నాయని వైఎస్సార్ సీపీ కేంద్ర పాలక మండలి సభ్యురాలు జక్కంపూడి విజయలక్ష్మి ఆరోపించారు.
తూర్పు గోదావరి జిల్లా రాజానగరం మండలం పాత తుంగపాడులో జన్మభూమి కమిటీ సభ్యుల వేధింపులకు తాళలేక బుధవారం ఆత్మహత్యకు పాల్పడిన దళితుడు యడ్ల చిన్నా(30) కుటుంబానికి న్యాయం చేయాలంటూ ఆమె గురువారం రాజమహేంద్రవరం ప్రభుత్వాస్పత్రి వద్ద ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గత 40 ఏళ్లుగా చిన్నా కుటుంబం సాగు చేసుకుంటున్న భూమిలో డంపింగ్ యార్డు ఏర్పాటుకు జన్మభూమి కమిటీ సభ్యులు తీర్మానించి, ఆ భూమిలో చెత్తను డంప్ చేయడంతో జీవనాధారం కోల్పోయిన చిన్నా ఆత్మహత్యకు పాల్పడ్డాడని తెలిపారు. చుట్టుపక్కల 12 ఎకరాల భూమి ఉండగా మధ్యలో ఉన్న దళితుడి భూమిలోనే ఎందుకు డంపింగ్ యార్డ్ ఏర్పాటు చేస్తున్నారని ఆమె ప్రశ్నించారు.
చిన్నా కుటుంబానికి రూ.10 లక్షల ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని, 2 ఎకరాల పొలం మంజూరు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆత్మహత్యకు కారకులైన వారిని వెంటనే అరెస్ట్ చేయాలన్నారు. ప్రభుత్వం నుంచి రూ.లక్ష నష్టపరిహారం ఇస్తామన్న సబ్ కలెక్టర్ విజయకృష్ణన్ అనంతరం రూ.50 వేలు మాత్రమే ఇవ్వడంతో మృతదేహాన్ని ప్రభుత్వాస్పత్రిలోనే ఉంచారు. బాధిత కుటుంబానికి న్యాయం జరిగేవరకూ మృతదేహాన్ని తరలించేంది లేదని విజయలక్ష్మి స్పష్టం చేశారు. ఈ ఆందోళన కార్యక్రమంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
'బాబు పాలనలో దళితులపై దాడులు పెరిగాయి'
Published Thu, Mar 24 2016 8:59 PM | Last Updated on Sat, Aug 18 2018 8:08 PM
Advertisement