‘శివాజీ యుద్ధం చేయాల్సింది చంద్రబాబుతో’
విశాఖ : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై కారెం శివాజీ చేసిన వ్యాఖ్యలను ఆ పార్టీ ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు మేరుగ నాగార్జున తీవ్రంగా ఖండించారు. కారం శివాజీ చేసిన వ్యాఖ్యలు హాస్యాస్పదంగా ఉన్నాయని అన్నారు. మేరుగ నాగార్జున శనివారమిక్కడ మీడియా సమావేశంలో మాట్లాడుతూ రాజ్యాంగబద్ధమైన రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ పదవికి కారెం శివాజీ అనర్హుడని తాము ముందు నుంచి చెబుతూనే ఉన్నామని, అదే విషయాన్ని హైకోర్టు స్పష్టం చేసిందని అన్నారు.
రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ పదవికి శివాజీ అనర్హుడని తెలిసినా నియాకం చేశారని, అందుకే కారెం శివాజీ ప్రమాణా స్వీకారానికి అప్పట్లో చంద్రబాబు గైర్హాజరు అయిన విషయాన్ని గుర్తు చేశారు. కారెం శివాజీ యుద్ధం చేయాల్సింది చంద్రబాబుతో అని, ఈ కేసుతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి సంబంధం లేదన్నారు. మనసులో ఏవో దురుద్దేశాలు పెట్టుకుని కారెం శివాజీ ఆరోపణలు చేయడం సరికాదని మేరుగ నాగార్జున అన్నారు.