'ఖాకీ చొక్కా బదులు పచ్చ చొక్కా వేసుకోమనండి'
► అక్రమ కేసులు పెడితే సహించేది లేదు
► ఎస్‌ఐపై చర్యలు తీసుకోకుంటే పోరాటం
► సీఐ ఓబులేసుతో ఎమ్మెల్యే రఘురామిరెడ్డి
మైదుకూరు: ‘మీ ఎస్‌ఐకి ఖాకీ చొక్కా ఇష్టం లేకుంటే.. పచ్చ చొక్కా వేసుకోమనండీ.. అంతేకాని గ్రామాల్లో వర్గపోరు పెంచి.. అక్రమ కేసులు బనాయించి కక్షలు, ఫ్యాక్షన్‌లను ప్రోత్సహించడం తగదని ఎమ్మెల్యే రఘురామిరెడ్డి చాపాడు ఎస్‌ఐ శివశంకర్‌యాదవ్ వ్యవహరిస్తున్న తీరుపై సీఐతో ఆగ్రహం వ్యక్తం చేశారు. మండలంలోని చిన్నగురువళూరులో శనివారం పైపులైన్ విషయమై టీడీపీ వర్గీయులు వెంకటసుబ్బారెడ్డి, చంగా బ్రహ్మానందరెడ్డి, వెంకటసుబ్బారెడ్డిల నడుమ స్వల్ప వాగ్వాదం ఏర్పడింది. సమస్యను స్థానికులే పరిష్కరించుకున్నారు.
అయితే ఎస్‌ఐ శివశంకర్ టీడీపీకి చెందిన పి.వెంకటసుబ్బారెడ్డి(ఫైలట్) ఫిర్యాదు చేయకపోయినా అతని భార్య వెంకటసుబ్బమ్మ చేత ఫిర్యాదు చేయించి వైఎస్సార్‌సీపీకి చెందిన ఐదుగురిపై కేసు నమోదు చేశారు. విషయం తెలుసుకున్న బాధితులు ఎమ్మెల్యే రఘురామిరెడ్డిని ఆశ్రయిం చారు. దీంతో ఆదివారం ఉదయం ఎమ్మెల్యే బాధితుల తరపున చాపాడు పోలీసుస్టేషన్‌కు వచ్చారు. ఎస్‌ఐ లేకపోవడంతో రూరల్ సీఐ ఓబులేసుతో ఎమ్మెల్యే మాట్లాడుతూ గ్రామాల్లో చిన్న గొడవలు జరిగినా వైఎస్సార్‌సీపీ వర్గీయులనే టార్గెట్ చేసుకుంటూ నాన్ బెయిలబుల్ కేసులు పెడుతున్నారన్నారు. ఎస్‌ఐ ఇక్కడికి వచ్చినప్పటికీ నుంచి గ్రామాల్లో గొడవలు సృష్టించి టీడీపీ వర్గీయులకు సపోర్టు చేస్తూ వైఎస్సార్‌సీపీ వర్గీయులకు జైళ్లకు పంపిస్తున్నాడన్నారు.
సుధాకర్‌యాదవ్ బదులు మీ ఎస్‌ఐనే తనతో ఎమ్మెల్యే పదవికి పోటీ చేయమనండీ.. అంతేకాని అక్రమ కేసులు బనాయిస్తే సహించేది లేదన్నారు. ఎస్‌ఐపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని, లేదంటే బాధితులు, ప్రజలు, వైఎస్సార్‌సీపీ కార్యకర్తలతో ప్రత్యక్ష పోరాటాలకు దిగాల్సి వస్తుందని హెచ్చరించారు. విచారిస్తానని, ఎలాంటి కేసులు నమోదు చేయలేదని, గ్రామాల్లో ప్రశాంత వాతావరణం నెలకొల్పేందుకు చర్యలు తీసుకుంటామని రూరల్ సీఐ ఓబులేసు ఎమ్మెల్యేకు తెలిపారు. ఎమ్మెల్యేతో పాటు ఎంపీపీ రామచంద్రయ్య, జెడ్పీటీసీ సభ్యుడు బాలనరసింహారెడ్డిలు ఉన్నారు.
మమ్మల్ని పోలీస్టేషన్‌కు రమ్మన్నారు
గ్రామంలో జరిగిన వివాదంలో తమ పాత్ర లేకపోయినా అక్రమంగా తమపై కేసులు నమోదయ్యాయని, స్టేషన్ రావాలని పోలీసులు చెప్పడంతో ఎమ్మెల్యేని ఆశ్రయించామని చిన్నగురువళూరుకు చెందిన బొర్రా వీరారెడ్డి శంకర్‌రెడ్డి, గంగాధర్‌రెడ్డి, కొండారెడ్డి, ఓబుళరెడ్డిలు తెలిపారు. ఫైలట్ వెంకటసుబ్బారెడ్డి, చంగా బ్రహ్మనందరెడ్డి, వెంకటసుబ్బారెడ్డిల మధ్య పైపులైను విషయమై స్వల్ప గొడవ జరిగింది. దీంతో ఎల్లన్నగారి వెంకటసుబ్బారెడ్డి సర్ధి చెప్పాడు.
ఎవరూ దాడి చేయలేదు..
ఫైలట్ వెంకసుబ్బారెడ్డి ఇల్లు ఉన్న వీధికి నీటి పైపులైను ఉందని, కాని అక్రమంగా ఫైలట్ పైపులైను వేసుకోగా వద్దని ప్రశ్నించినందుకు తమపై గొడవకు దిగాడని చంగా బ్రహ్మనందరెడ్డి, వెంకటసుబ్బారెడ్డిలు తెలిపారు. అనవసరంగా కేసులు పెట్టారని చెప్పారు.
‘పోలీసులే కక్షలు పెంచుతున్నారు’
శాంతిభద్రతలను పరిరక్షించాల్సిన పోలీసులే గ్రామాల్లో కక్షలు, ఫ్యాక్షన్లను సృష్టిస్తున్నారని ఎమ్మెల్యే ఎస్.రఘురామిరెడ్డి అన్నారు. చిన్నగురువళూరులో శనివారం జరిగిన చిన్న గొడవపై ఎస్‌ఐ శివశంకర్‌యాదవ్ వైఎస్సార్‌సీపీ కార్యకర్తలపై కేసులు పెట్టడంతో ఆదివారం ఎమ్మెల్యే పోలీసుస్టేషన్‌కు వచ్చారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ అనాది నుంచి చిన్నగురువళూరు ప్రజలంతా వ్యవసాయం చేసుకుంటూ ప్రశాంతంగా జీవిస్తున్నారని, ఇలాంటి గ్రామంలో జరిగిన చిన్న ఘటనను ఆసరాగా తీసుకుని ఎస్‌ఐ శివశంకర్‌యాదవ్ వైఎస్సార్‌సీపీ కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టడం ఎంతవరకు సమంజసమన్నారు.
ఈ గ్రామంలో మొదటి నుంచి అన్ని రకాలైన ఎన్నికలు ఏకగ్రీవంగా జరుగుతాయని, ప్రజలందరూ ప్రశాంతంగా ఉంటారన్నారు. ఐదుగురు వైఎస్సార్‌సీపీ కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టి టీడీపీలో చేరాలని బెదించాడన్నారు. బాధితుల కోసం పోలీసుస్టేషన్‌కు రాగా ఎస్‌ఐ లేరన్నారు. ఎస్‌ఐపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని, లేకుంటే డీ ఐజీకి ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు. ఈయనతో పాటు ఎంపీపీ రామచంద్రయ్య, జెడ్పీటీసీ సభ్యుడు బాలనరసింహారెడ్డి, ఉప మండలాధ్యక్షులు సానా నరసింహారెడ్డి తదితరులు ఉన్నారు.