రాజరాజనరేంద్రనగర్ (రాజానగరం): ‘‘యూనివర్సిటీలో అడుగుపెట్టిన వెంటనే ఇది నా కుటుంబం అనే భావన కలిగింది. ఇక్కడి వాతావరణ, విద్యార్థులు, భవనాలు అన్నీ ఎంతో ఆహ్లాదకరంగా ఉన్నాయి. ఎదుటి వ్యక్తికి గౌరవం ఇవ్వడం మనం మొదటిగా నేర్చుకోవలసిన విషయం, అది ఇక్కడ విద్యార్థుల్లో కనిపించడం ఎంతో ఆనందం వేస్తోంది. మా తండ్రి సత్యమూర్తికి ఇంతటి ప్రాధాన్యం ఇచ్చిన యూనివర్సిటీకి తాము జీవితాంతం రుణపడి ఉంటాం’’ అని ప్రముఖ సినీ సంగీత దర్శకుడు దేవిశ్రీప్రసాద్ అన్నారు. ప్రముఖ సినీగేయ రచయిత డాక్టర్ వెనిగెళ్ల రాంబాబు ఆదికవి నన్నయ యూనివర్సిటీ కోసం ప్రత్యేకంగా రచించిన యూనివర్సిటీ గీతాన్ని గురువారం ఆయన ఆవిష్కరించారు. అలాగే తన తండ్రి సత్యమూర్తి పేరుతో ఏర్పాటు చేసిన యోగ విజ్ఞాన కేంద్రాన్ని తల్లి శిరోమణి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో దేవిశ్రీప్రసాద్ మాట్లాడుతూ ఇక్కడికి ఒక ఫంక్షన్‌కి గెస్ట్‌గా వచ్చినట్టుగా లేదని, మా ఫ్యామీలీ ఫంక్షన్‌గా ఉందన్నారు. తన తండ్రి పుట్టినూరు వెదురుపాకైతే, తన తల్లి పుట్టింది అమలాపురమన్నారు. అందువల్లే అ.. అంటే అమలాపురం పాట చేశానన్నారు. అమ్మమ్మ పేరు దేవీమీనాక్షి, తాత పేరు ప్రసాద్‌లను శ్రీతో కలిపి తనకు దేవిశ్రీ ప్రసాద్‌గా పెట్టారన్నారు.
పాటలతో జోష్ నింపుతూ..
విశ్వమే ఒక విద్యాలయం అంటారు. కానీ ఈ విద్యాలయమే ఒక విశ్వంగా కనిపిస్తుందన్నారు. ‘ఎర్రచొక్కానే నీ కోసం వేశాను, సర్‌మంటూ ఫారిన్ సెంటు కొట్టాను, గళ్ల లుంగీతో నీ కోసం వచ్చాను. అమ్మడు, లెట్స్ డూ కుమ్ముడు అని పాడుతూ విద్యార్థులతో ఈలలు వేయించారు. యోగ సాధనలో నిష్టాతులుగా పేరొందిన తన తండ్రి పేరుతో ఏర్పాటు చేసిన యోగా కేంద్రాన్ని ప్రస్తావిస్తూ వన్, టూ, త్రీ, ఫోర్ చెయ్యి యోగా.. ఒంటికి యోగా మంచిదేగా అంటూ పాడి గ్యాలరీలో కేరింతలు కొట్టించారు. రంగా రంగా..రంగస్థలాన ఓ.. అంటూ రానున్న రంగస్థలం సినిమాలో పాటను పాడి వినిపించారు. వీడి పేరు గబ్బర్‌సింగ్., ఏ పిల్లా నీవులేని జీవితం., పాటలు పాడుతూ హుషారెత్తించారు. అలాగే ఆయన సోదరుడు, సినీ సంగీత దర్శకుడు సాగర్ విద్యార్థుల కోరిక మేరకు పాట పాడుతూ ‘తీసేద్దాం.. తీసేద్దాం ఎగ్జామ్ తాట తీసేద్దాం.. తెచ్చేద్దాం తెచ్చేద్దాం ఫస్ట్ మార్కు తెచ్చేద్దాం’ అంటూ వారిలో జోష్ పుట్టించారు. చదువు, ఉత్తీర్ణత లక్ష్యాలను గుర్తు చేశారు.
మనస్సు పెట్టి చేస్తే ఏదైనా హిట్టే..
ఉపకులపతి ఆచార్య ఎం.ముత్యాలునాయుడు మాట్లాడుతూ మనస్సు పెట్టి చేస్తే ఏదైనా సూపర్ హిట్ అవుతుందనడానికి దేవీశ్రీప్రసాదే ఉదాహరణ అని వీసీ పేర్కొన్నారు. ఈ కారణంగానే ఆయన సంగీతం అందించిన అనేక సినిమాలు విజయవంతమయ్యాయన్నారు. యూనివర్సిటీ కోసం గీతాన్ని రచించిన డాక్టర్ వెనిగెళ్ల రాంబాబు, ఆలపించిన డాక్టర్ బాలసుబ్రహ్మణ్యం, ఆవిష్కరించిన దేవిశ్రీప్రసాద్‌లకు కృతజ్ఞతలు తెలిపారు. తరాలు మారిన తరగని ఆస్తి సాహిత్యమేనని గీత రచయిత డాక్టర్ వెనిగెళ్ల రాంబాబు పేర్కొన్నారు. కార్యక్రమంలో దేవిశ్రీప్రసాద్‌తోపాటు ఆయన తల్లి శిరోమణి, సోదరుడు సాగర్, చెల్లెలు పద్మినిప్రియదర్శిని, బావ రాంబాబు, యూనివర్సిటీ అధికారులు డాక్టర్ ఎస్.టేకి, డాక్టర్ పి.సురేష్‌వర్మ, డాక్టర్ కేఎస్ రమేష్, డాక్టర్ కె.సుబ్బారావు, డాక్టర్ ఎ.మట్టారెడ్డి, డాక్టర్ వై. శ్రీనివాసరావు, డాక్టర్ టి.హైమవతి, డాక్టర్ పి.పెర్సిస్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment