‘డోక్లామ్’ సుఖాంతం
దాదాపు 75 రోజుల తర్వాత భారత్–చైనాల మధ్య భారత్–భూటాన్–చైనా సరిహద్దుల కూడలిలో తలెత్తిన వివాదం సద్దుమణిగింది. అయితే ఇదంత సజావుగా ఏమీ పూర్తి కాలేదు. ఇరు దేశాల మధ్య దౌత్య స్థాయిలో సాగిన సంభాషణల పర్యవసానంగా రెండు పక్షాలూ దళాలను ఉపసంహరించుకోవాలన్న నిర్ణయం జరిగిందని మన విదేశాంగ శాఖ సోమవారం ప్రకటించింది. అందుకు సంబంధించిన పని ప్రారంభమై కొనసాగుతున్నదని చెప్పింది. కానీ చైనా విదేశాంగ శాఖ మాత్రం భారత దళాలు తిరిగి తమ సరిహద్దులకు మళ్లాయని, చైనా దళాలు వివాదాస్పద ప్రాంతంలో కొనసాగుతాయని ప్రకటించి గందరగోళంలో పడేసింది. ఇరుగుపొరుగు దేశాల మధ్య వివాదాలు తలెత్తడం, అవి కొనసాగుతున్న సమయంలో మాటల తీవ్రత పెరగడం సహజమే. అవి సద్దుమణిగే క్రమంలో సైతం ఆ తీవ్రత ఎంతో కొంత కొనసాగుతుంది. ముఖ్యంగా వీరావేశంతో మాట్లాడినవారు వెనక్కి తగ్గే క్రమం కొంత భిన్నంగా ఉంటుంది. డోక్లామ్ వివాదం మొదలైన దగ్గరనుంచీ మన దేశం సంయమనంతోనే మాట్లాడింది.
సమస్యపై సైన్యం స్థాయిలోనూ, దౌత్య స్థాయిలోనూ చర్చలు కొనసాగుతాయని, త్వరలోనే వివాదం సమసిపోతుందని మన విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది. గత నెల జూలైలో విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ రెండు దేశాలూ తమ తమ సైన్యాలను వెనక్కి పిలిపించుకుని, అటుమీదట చర్చలు ప్రారంభించాలని ప్రతిపాదించారు. కానీ ఈ ప్రకటనలన్నిటికీ చైనా వైపునుంచి దూకుడే జవాబైంది. 1962నాటి అనుభవాలు మర్చిపోవద్దని హెచ్చరించడంతో మొదలుపెట్టి రెండు దేశాల సైనిక వ్యయం, జీడీపీ, రక్షణ సామర్ధ్యం వగైరాల మధ్య పోలిక తెచ్చి మీరు అన్నివిధాలా తీసికట్టని చెప్పడం వరకూ అందులో ఎన్నో ఉన్నాయి.
ఎలాంటి చర్చలు జరగాలన్నా ముందు భారత్ బేషరతుగా అక్కడినుంచి వెనక్కి వెళ్లాల్సిందేనని స్పష్టం చేసింది. దళాల ఉపసంహరణ విషయంలో అంగీకారానికొచ్చాక కూడా ఈ ధోరణి పోలేదు. అందుకే ఉపసంహరించుకున్నది భారత్ మాత్రమే తప్ప తాము కాదంటోంది. దీన్నుంచి గుణపాఠం తీసుకోవాలని హితవు చెబుతోంది. సరిహద్దుల్లో యథాతథంగా తమ దళాల గస్తీ కొనసాగుతుందని చెప్పింది. చైనా దళాలు సరిహద్దుల్లో గస్తీ కాస్తే భారత్‌కు అభ్యంతర ఉండాల్సిన పనిలేదు. ఆ సరిహద్దును వదిలి 2012 సరిహద్దు ఒప్పందాన్ని ఉల్లంఘించి డోక్లామ్ పీఠభూమి వరకూ రహదారిని పొడిగించడానికి చైనా ప్రయత్నించడమే వివాదానికి కారణం. చైనా రోడ్డు పనుల్ని నిలిపేసిందని, అక్కడి సామగ్రిని, దళాలను తరలించిందని ఇప్పటికే వెల్లడైంది. ఇతరత్రా మాటలన్నీ భారత్ కంటే చైనా జనాన్నుద్దేశించి చేసినవే. తీవ్ర పదజాలంతో ప్రకటనలు చేశాక ఇవన్నీ తప్పనిసరి.
త్వరలో చైనా రాజధాని బీజింగ్‌లో జరగబోయే బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సుకు ప్రధాని నరేంద్ర మోదీ వెళ్లడానికి ఈ దళాల ఉపసంహరణ నిర్ణయం ఎంతో దోహదపడింది. ఆ సదస్సుకు మోదీ వెళ్లకపోతే చైనాపై బ్రిక్స్‌లోని ఇతర సభ్య దేశాల్లో సందేహాలు తలెత్తుతాయి. బ్రిక్స్‌లో చైనా తర్వాత భారత్ ఆర్థిక వ్యవస్థే పటిష్టంగా ఉంది. ఈ రెండు దేశాలూ సరిహద్దు సమస్యలను సామరస్యపూర్వకంగా పరిష్కరించుకుంటేనే బ్రిక్స్ వంటి సంస్థలు సమర్ధవంతంగా పనిచేయగలవని ఆమధ్య రష్యా అధ్యక్షుడు పుతిన్ అభిప్రాయపడ్డారు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకునే చైనా తన దూకుడు ధోరణిని తగ్గించుకున్నదని కొందరు చెబుతున్నారు. అయితే తాజా పరిణామాలకు ఇతర కారణాలు కూడా ఉన్నాయి. చైనా సైన్యం పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ(పీఎల్‌ఏ)ను ప్రక్షాళన చేయాలని గత కొంతకాలంగా చైనా అనుకుంటోంది. ముఖ్యంగా ఉన్నతస్థాయి సైనికాధికార వ్యవస్థను చక్కదిద్దాలని, దళాల సామర్ధ్యాన్ని పెంచేలా పునశ్చరణ కార్యక్రమాలు మొదలుపెట్టాలని భావిస్తోంది. ముఖ్యంగా వైమానిక, నావికాదళాల సామర్ధ్యం మరింత మెరుగుపరచాలని చైనా నాయకత్వం అనుకుంటోంది.
మరోపక్క అక్టోబర్‌లో చైనా కమ్యూనిస్టు పార్టీ 19వ కాంగ్రెస్ జరగాల్సి ఉంది. భారత్‌తో యుద్ధం వచ్చి ఆ సమయానికి తేలకపోతే రాజకీయంగా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్‌కు అది ఇబ్బందికరం. మరోపక్క పొరుగునున్న ఉత్తర కొరియాకు అమెరికాతో తలెత్తిన వివాదం ఒక కొలిక్కి రాలేదు. అంచనాలకు దొరక్కుండా క్షిపణి పరీక్ష ద్వారానో, అణు పరీక్ష ద్వారానో అమెరికాను కవ్విస్తున్న కిమ్ వల్ల ఆ ప్రాంతంలో ఎప్పుడేమవుతుందో తెలియదు. ఇలాంటి తరుణంలో భారత్‌తో ఘర్షణకు దిగి శక్తియుక్తులన్నీ దానిపైనే కేంద్రీకరించడం వల్ల సమస్య అవుతుందని చైనాకు అనుమానాలున్నాయి. వచ్చేది శీతాకాలం కావడంతో డోక్లామ్ పీఠభూమి ప్రాంతం చైనా దళాల కదలికకు అనువుగా ఉండదు. భారత దళాలకు అది అలవాటైన ప్రాంతం.
యుద్ధం దేనికీ పరిష్కారం కాదు. అది ప్రారంభించడం తేలిక. గౌరవప్రదంగా దాన్నుంచి బయటకు రావడం అంత సులభం కాదు. ప్రత్యర్థి పక్షంపై మొదట వేసుకున్న అంచనాలు తలకిందులవుతున్నాయని తెలిసినప్పుడు మరింత దూకుడుగా ముందుకెళ్లాలి తప్ప వెనక్కిరావడం కుదరదు. ఉన్నకొద్దీ ఇది తీవ్రమవుతున్నదనుకుంటే ఎవరో ఒకరి మధ్యవర్తిత్వం కోసం అర్రులు చాచటం తప్ప గత్యంతరం ఉండదు. అందుకు భిన్నంగా వివాదం తలెత్తిన పక్షంతో చర్చించడం ప్రారంభిస్తే తన వైఖరిలోని సహేతుకతను చెప్పవచ్చు. ఒప్పించే ప్రయత్నాలు చేయొచ్చు. పరస్పర అవగాహన సాధ్యమవుతుంది. ప్రపంచ దేశాల్లో పరిణతితో వ్యవహరించిన ఖ్యాతి దక్కుతుంది. సంక్షోభం తలెత్తినప్పుడు సంయమనం పాటించడం, ఓపికతో వేచి ఉండటం అవసరం. అది అర్ధం చేసుకోకుండా కొన్ని మీడియా సంస్థలు, కొందరు వ్యక్తులు అత్యుత్సాహంతో వ్యాఖ్యలు చేశారు. వీటన్నిటికీ అతీతంగా ఆచితూచి వ్యవహరించినందుకు ప్రభుత్వాన్ని అభినందించాలి. ఇదే స్ఫూర్తితో చైనాతో ఉన్న ఇతర వివాదాల విషయంలోనూ పరిష్కారాన్ని సాధిస్తుందని ఆశిద్దాం.