పుష్కర కాలంనుంచి నీళ్లు కాదు... నెత్తురు ప్రవహిస్తున్న టైగ్రిస్ నది మరోసారి పెను సంక్షోభానికి మౌన సాక్షిగా మిగిలింది. జాతుల ఘర్ష ణలు సర్వసాధారణమైన ఇరాక్ ఇప్పుడు పూర్తిస్థాయి అంతర్యుద్ధంతో అట్టుడుకుతున్నది. జనవరిలో ఇరాక్‌లోని పెద్ద రాష్ట్రమైన అల్ అంబర్ రాజధాని రమాదీ, మరో నగరం ఫలూజాల్లోకి భారీ సంఖ్యలో ప్రవే శించిన ‘ఇరాక్, లెవాంత్ ఇస్లామిక్ ప్రభుత్వం’(ఐఎస్‌ఐఎల్) మిలి టెంట్లు అక్కడ ప్రభుత్వ దళాలకు భారీయెత్తున నష్టం కలిగించారు. వారంక్రితం మొసుల్‌తో మొదలుపెట్టి మాజీ అధ్యక్షుడు సద్దాం హుస్సేన్ స్వస్థలం తిక్రిత్‌ను స్వాధీనం చేసుకున్నారు. అటుతర్వాత దేశంలో అతిపెద్ద రిఫైనరీ ఉన్న బైజీ నగరాన్ని ఆక్రమించారు. దేశ రాజధాని నగరమైన బాగ్దాద్‌వైపు దూసుకెళ్తూ సమర్రా, ఉధాయిమ్, ముక్తాదియా పట్టణాల్లో ప్రభుత్వ దళాలతో తలపడుతున్నారు. ఇరాన్ సరిహద్దులకు సమీపంగా ఉన్న దియాలా ప్రాంతంలోని పట్టణాలు సైతం మిలిటెంట్ల దూకుడుకు తలవంచాయి. అల్‌కాయిదా ఆద ర్శంగా సున్నీలు ఏర్పాటుచేసుకున్న ఐఎస్‌ఐఎల్ నల్లజెండాలతో, మారణాయుధాలతో చొచ్చుకొస్తున్నకొద్దీ షియాలే ప్రధానంగా ఉండే ప్రభుత్వ దళాలు పరారవుతున్నాయి. ఇదే అదునుగా ఇరాక్ ఉత్తర ప్రాంతం లోని చమురు నిల్వల నగరం కిర్కుక్‌ను అక్కడి కుర్దులు స్వాధీనం చేసుకున్నారు. ఈ అంతర్యుద్ధం ఎంతటి అమానవీయ తను, రాక్షసత్వాన్ని వ్యాప్తి చేస్తున్నదో సామాజిక మాధ్యమాల్లో దర్శన మిస్తున్న హృదయవిదారక చిత్రాలే చాటిచెబుతున్నాయి. పట్టు బడిన ఇరాక్ సైనికులను ఐఎస్‌ఐఎల్ మిలిటెంట్లు చేతులు విరిచికట్టి సమీపం నుంచి కాల్చిచంపుతున్న దృశ్యాలు షియా తెగ పౌరుల్లో ప్రతీ కారాన్ని రెచ్చగొడుతున్నాయి. అమెరికా సాయం కోసం ప్రాధేయపడి విఫలుడైన దేశ ప్రధాని నౌరీ అల్ మలికీ ఇప్పుడు పౌరులందరినీ సాయుధం కమ్మని పిలుపునిస్తున్నారు. షియా మత గురువులు సైతం యువకులంతా యుద్ధరంగానికి తరలి దేశాన్ని కాపాడాలని కోరారు. కనుక రానున్న కాలంలో ఇరాక్ మరింత హింసను చవిచూస్తుందని సులభంగానే అర్ధమవుతుంది. ఆలస్యంగా రంగప్రవేశం చేసిన అమె రికా పర్షియన్ జలసంధిలో రెండు క్షిపణి వాహక నౌకలను, ఒక విమాన వాహక నౌకను మోహరించింది.
ఇరాక్‌ను నిరాయుధం చేయడం కోసమంటూ 2003లో అమెరికా ప్రారంభించిన దురాక్రమణ యుద్ధం ఆ దేశాన్ని నిత్య సంక్షోభంలోకి నెట్టింది. ఏళ్లతరబడి సాగిన ఆ యుద్ధంలో దాదాపు పది లక్షలమంది పౌరులు మరణించారు. అయితే ఆనాటి తమ నిర్వాకమే ఇరాక్‌ను ఈ స్థితికి చేర్చిందని అమెరికా, బ్రిటన్‌లు ఒప్పుకోవడంలేదు. ‘నియంత’ సద్దాంను తొలగించడం సరైందేనని సమర్ధించుకుంటున్నాయి. కాకపోతే నౌరీ అల్ మలికీ బాధ్యతాయుతంగా వ్యవహరించి సున్నీల కు కూడా ప్రభుత్వంలో భాగస్వామ్యం కల్పించివుంటే ఈ దారుణ స్థితి దాపురించేది కాదని సన్నాయినొక్కులు నొక్కుతున్నాయి. కానీ, షియా, సున్నీ తెగలమధ్య అప్పటికే ఉన్న శత్రుత్వాన్ని పెంచిపోషించ డంలో అమెరికా, బ్రిటన్‌ల పాత్ర కూడా ఉంది. వారిమధ్య కలహా లను మరింత పెంచి సున్నీలను తుడిచిపెట్టాలన్న వ్యూహం వారిదే. అందులో నౌరీ పాత్రధారి మాత్రమే. కనీసం ఇప్పటికైనా అమెరికా ఆలోచనలు మారలేదు. ఇరాక్ సున్నీ మిలిటెంట్లను తుడిచిపెట్టడానికి నిన్నటివరకూ బద్ధ శత్రువైన ఇరాన్‌ను దువ్వుతోంది. షియాల ఆధిప త్యంలోని ఆ దేశం సాయపడితే తప్ప ఈ అంతర్యుద్ధాన్ని అదుపు చేయడం అసాధ్యమని భావిస్తోంది.
ఎన్నడో 2003 వరకూ కూడా వెళ్లనవసరం లేదు. సిరియాలో మూడేళ్లనాడు మిలిటెంట్లకు ఆయుధాలిచ్చి, డబ్బులిచ్చి ఆ దేశాన్ని వల్లకాడుగా మార్చే పని ప్రారంభించినప్పుడే పలువురు పశ్చిమాసి యా నిపుణులు హెచ్చరించారు. ఈ వ్యూహం వికటించి ఉగ్రవాదం వేళ్లూనడానికి దోహదపడుతుందని అనేక విధాల చెప్పారు. కానీ, వీట న్నిటినీ అమెరికా, ఇతర పాశ్చాత్యదేశాలు పెడచెవినబెట్టాయి. తాము సరఫరాచేస్తున్న ఆయుధాలు, మందుగుండు, డబ్బు అల్‌కాయిదాకు చేరుతున్నదని గుర్తించాక మిలిటెంట్ వర్గాలకు సాయం మానుకున్నా దాని విష ఫలాలు హద్దులు దాటాయి. ఇప్పుడు ఇరాక్‌లో సాగుతున్న అంతర్యుద్ధం ఆ దేశాన్ని పంచుకోవడానికి, దానిపై ఆధిపత్యం నెరప డానికి మాత్రమే కాదు... మొత్తంగా పశ్చిమాసియాను గుప్పిట బం ధించేందుకు జరుగుతున్న చంపుడు పందెం. షియా, సున్నీ తెగలు రెండూ పోటాపోటీగా సాగిస్తున్న ఈ సంకుల సమరంలో పాత మిత్రులు శత్రువులవుతుంటే... ఆగర్భ శత్రువులు సన్నిహితులుగా మారుతున్నారు. అమెరికా, ఇరాన్‌లు ఇప్పుడు ఇరాక్ అంతుర్యుద్ధం విషయంలో ఏకమయ్యే సూచనలు కనిపిస్తుండగా అది అమెరికా- సౌదీల చిరకాల స్నేహంలో చిచ్చురేపుతున్నది. ఇంతవరకూ ఇరాక్ లోని కుర్దులకు అన్నివిధాలా సాయపడుతున్న టర్కీ ఇరాక్‌లో వారి సమరోత్సాహాన్ని చూసి బెంబేలెత్తుతున్నది. తమ భూభాగంలోని కుర్దుల ప్రాంతాలకు ఇది విస్తరించి దేశాన్ని విచ్ఛిన్నం చేస్తుందని సందేహిస్తున్నది. పశ్చిమాసియాలోని ఈ పరిణామాలు మనకు సైతం ఆందోళన కలిగించేవే. ఇరాక్, సిరియాల్లోని ‘సోదరుల’ అడుగుజా డల్లో నడిచి విముక్తి సాధించుకోవాలని కాశ్మీర్ ముస్లింలను కోరే అల్ కాయిదా వీడియో విడుదలైందని బ్రిటన్ పత్రిక గార్డియన్ కథనం. అమెరికా, పశ్చిమదేశాలు ఇకనైనా బాధ్యతాయుతంగా వ్యవహరించి అంతర్జాతీయ సంస్థల నేతృత్వంలో ఈ సంక్షోభానికి ముగింపు పలకడానికి కృషిచేయాలి. ఇరాక్ అంతర్యుద్ధాన్ని సకాలంలో అదుపు చేయడంలో విఫలమైతే అది ప్రమాదకర పర్యవసానాలకు దారితీయగలదని గుర్తించాలి.
అంతర్యుద్ధంలో ఇరాక్!
Published Tue, Jun 17 2014 12:05 AM | Last Updated on Mon, Jul 29 2019 7:43 PM
Advertisement
Advertisement