కో-పైలెట్ తెచ్చిన విషాదం
ఆపద చెప్పిరాదు. దానికి ఒక రూపమంటూ ఉండదు. ఎక్కడ పొంచి వుంటుందో కూడా ఎవరూ అంచనా వేయలేరు. మంగళవారం స్పెయిన్ నుంచి జర్మనీ వెళ్తున్న ఎయిర్‌బస్-ఏ320 విమానం ఉన్నట్టుండి ఆల్ప్స్ మంచు పర్వత శ్రేణిలో కూలిపోవడం, ఆరుగురు విమాన సిబ్బందితోపాటు 144మంది ప్రయాణికులు ప్రాణాలు కోల్పోవడం అందరినీ దిగ్బ్రాంతిపరిచింది. జర్మనీకి చెందిన లుఫ్తాన్సా సంస్థకు అనుబంధంగా కొనసాగుతున్న జర్మన్‌వింగ్స్‌కు చెందిన ఈ విమానం ప్రమాదానికి లోనైన తీరుపై తాజాగా వెలువడుతున్న కథనాలు మరింత దిగ్భ్రాంతి కలిగిస్తున్నాయి.
ప్రమాదస్థలిలో లభ్యమైన విమానం బ్లాక్‌బాక్స్‌ను విశ్లేషించిన నిపుణులు కో-పెలైట్ ఉద్దేశపూర్వకంగా దాన్ని కూల్చివేశాడని ప్రాథమికంగా నిర్ధారణకొస్తున్నారు. ప్రధాన పెలైట్ పాట్రిక్ సాండర్‌హీమర్ కాక్‌పిట్‌నుంచి బయటికొచ్చాక కో-పెలైట్ ఆండ్రియాస్ లుబిడ్స్ తలుపులు బిగించుకుని 25,000 అడుగుల ఎత్తులో ఎగురుతున్న విమానాన్ని పర్వత శ్రేణి ప్రాంతంలో హఠాత్తుగా కిందకు దించాడన్నది వారి భావన. అది కిందికి దిగుతుండగా ఆందోళనకు లోనైన ప్రధాన పెలైట్ పదే పదే తలుపు తట్టడం, కోపెలైట్ నుంచి ఎలాంటి జవాబూ రాకపోవడం బ్లాక్ బాక్స్‌లో నమోదైంది. ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ సిబ్బంది సైతం అప్రమత్తంగా ఉండి వెనువెంటనే పంపిన అత్యవసర సందేశాలకు కూడా కో-పెలైట్ స్పందించకపోవడం బ్లాక్‌బాక్స్ రికార్డు చేసింది. పెలైట్ అచేతన స్థితిలో ఉన్నప్పుడు కాక్‌పిట్‌ను తెరవడానికి తోడ్పడే అత్యవసర కోడ్ వ్యవస్థను కూడా కో-పెలైట్ ధ్వంసంచేశాడని బ్లాక్‌బాక్స్ విశ్లేషణ నిర్ధారిస్తున్నది.
ఇంతకూ కో-పెలైట్ లుబిడ్స్ ప్రమాదకర ప్రవర్తనకు కారణమేమిటి? అతనిపై ఉగ్రవాద సిద్ధాంతాల ప్రభావం ఏమైనా ఉందా? కుటుంబ పరిస్థితులు లేదా విధి నిర్వహణకు సంబంధించిన సమస్యలతో అతనేమైనా మానసికంగా దెబ్బతిని ఉన్నాడా? ఒకవేళ ఆత్మహత్యే చేసుకోదల్చుకుంటే తనతోపాటు అంత మంది ప్రాణాలను ఎందుకు హరించాలనుకున్నాడు? దర్యాప్తు చేస్తున్న అధికారులకు వీటిపై స్పష్టమైన సమాధానాలు ఇంతవరకూ లభించలేదు. అనారోగ్యానికి సంబంధించి వైద్య చికిత్స పొందుతున్నట్టు తెలిపే కొన్ని కాగితాలు మాత్రం లుబిడ్స్ ఇంట్లో దొరికాయంటున్నారు. ప్రపంచంలో అంతకంతకూ ఉగ్రవాద ముప్పు పెరగడంతో విమానయాన సంస్థలు, ప్రభుత్వాలు రకరకాల జాగ్రత్తలు తీసుకుంటున్నాయి. విమానాశ్రయాల్లో వాడే తనిఖీ వ్యవస్థను పెంచడం, అందుకోసం అత్యున్నత స్థాయి సాంకేతిక పరిజ్ఞానాన్ని వాడుకలోకి తీసుకురావడం అందులో ఒకటి.
అలాగే, విమానాన్ని నడపడంలో పెలైట్‌కు సమర్థవంతంగా తోడ్పడగల పరిజ్ఞానం కూడా అందుబాటులోకి వచ్చింది. ప్రత్యేకించి ఎయిర్ బస్ ఏ-320లో ఇందుకు సంబంధించిన ఆధునాతన వ్యవస్థ ఉన్నదంటున్నారు. ఇవన్నీ విమాన ప్రయాణాన్ని సాపేక్షంగా అత్యంత సురక్షితం చేశాయి. విమానగమనాన్ని, దాని తీరుతెన్నులను నిర్దేశించే మెకానికల్, హైడ్రో మెకానికల్ నియంత్రిత వ్యవస్థల స్థానంలో ఇప్పుడు ‘ఫ్లై బై వైర్’ వ్యవస్థ అందు బాటులోకొచ్చింది. పెలైట్ ఒక కమాండ్ ఇచ్చినప్పుడు దానికి అనుగుణంగా జరగాల్సిన మార్పులన్నీ వాటికవే చోటుచేసుకోవడం...విమాన గమనంలో ఇబ్బందులేమైనా ఉన్న పక్షంలో సెన్సర్ల సాయంతో గుర్తించి సరిచేయడం ఈ కొత్త వ్యవస్థ విశిష్టత. అత్యంత వేగంగా, ఏకకాలంలో అనేక పనులను పూర్తి చేయగల ఈ సంక్లిష్ట సాంకేతిక వ్యవస్థ వల్ల పెలైట్‌కు చాలావరకూ శ్రమ తగ్గింది. అయితే, ఇదే సమయంలో అధునాతన సాంకేతిక పరిజ్ఞానం తెచ్చిన సమస్యలను నిపుణులు ఏకరువు పెడతారు. ఇది పెలైట్‌ను యాంత్రికంగా మారుస్తున్నదని, ఆలోచించవలసిన అవసరాన్ని చాలావరకూ తగ్గిస్తున్నదని వారంటారు. దీనివల్ల పెలైట్ లో నైపుణ్యం అవసరమైనంతగా పెరగడం లేదని చెబుతారు.
అయితే పెలైట్ స్థానంలో ఉండే వ్యక్తి భావోద్వేగ స్థితిగతులు సక్రమంగా లేనప్పుడు... అతనికి దురుద్దేశాలు ఉన్నప్పుడు ఎలాంటి సాంకేతిక పరిజ్ఞానమైనా నిరుపయోగం అవుతుంది. బయటినుంచి కాక్‌పిట్ తలుపు తెరవగల అత్యవసర కోడ్ సదుపాయం కూలిన విమానంలో ఉన్నా కో-పెలైట్ చర్యవల్ల అది నిరర్ధకమైంది. ఇలాంటి పరిస్థితి తలెత్తుతుందని ఊహించడంవల్ల కాక్‌పిట్‌లో నిరంతరం ఇద్దరు పెలైట్లు ఉండాలని అమెరికా విమానయాన నిబంధనలను సవరించారు. తాజా విమాన ప్రమాదం తర్వాత ప్రపంచంలోని అన్ని విమానయాన సంస్థలూ ఈ నిబంధనను తప్పనిసరి చేస్తున్నాయి.
అయితే, ఆ ఇద్దరూ ఏకమై ఏ ఉపద్రవానికైనా ఒడిగట్టే అవకాశం లేకపోలేదు. కనుక హఠాత్తుగా ఏ పెలైట్ అయినా అసాధారణ రీతిలో కమాండ్లు ఇచ్చినప్పుడు వాటిని స్వీకరించకుండా నిరోధించడంవంటి ఏర్పాట్లు ఉండాలని భద్రతా నిపుణులు గతంలో సూచించారు. అలాగే ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ నుంచి అత్యవసర పరిస్థితుల్లో విమానగమనాన్ని సరిచేయగల నియంత్రిత వ్యవస్థ అందుబాటులో ఉంచడం అవసరమని వారు ప్రతిపాదించారు.
ఇదిగాక ఫ్లైట్ డేటాను ఎప్పటికప్పుడు గమనిస్తూ కాక్‌పిట్‌లో అసాధారణ కార్యకలాపాలు చోటు చేసుకున్నప్పుడు వాటి స్వభావాన్ని మదింపువేసి అప్రమత్తం చేయగల సాఫ్ట్‌వేర్ రూపకల్పన తుది దశకు చేరుకున్నదంటున్నారు. దీంతోపాటు పెలైట్‌లతో ప్రమేయం లేకుండా విమానాన్ని పూర్తిగా అదుపు చేయగలిగే పరిజ్ఞానం కూడా దాదాపు సాధించారంటున్నారు. అయితే, ఎలాంటి పరిజ్ఞానమైనా దురుద్దేశంతో వ్యవహరించదల్చుకున్నవారిని పూర్తిగా నియంత్రించగలదనుకోవడం, నిరోధించ గలదనుకోవడం అత్యాశే. కుటుంబం, సమాజం అప్రమత్తంగా మెలిగే పరిస్థితులే అంతిమంగా భద్రతకు గ్యారెంటీ ఇస్తాయి.